అద్భుతాలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది !

“జీవితంలో మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం మంచిదని  గోల్ప్‌ ఆట నాకు చెప్పింది. అలాగే ఒకసారి షాట్‌ మిస్సయిందంటే మళ్లీ మళ్లీ ప్రయత్నించాలని.. ‘విజయం ఖాయం’ అనే నమ్మకం కలిగిస్తుంది. జీవితం మీద ఎప్పుడూ  నమ్మకాన్ని కోల్పోకూడదని గోల్ఫ్‌ చెబుతుంది. ఎందుకంటే అద్భుతాలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంటుంది’’ అని చెబుతోంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ‘జీవితం ఒక ఆట లాంటిది. ఎవరి ఆట వారిదే. ఒకరి ఆటను ఇంకొకరు ఆడలేం. కష్టమైన ఆటలు ఉంటాయి. ఆనందాన్నిచ్చేవీ ఉంటాయి. ఏ ఆటలో అయినా ప్రత్యర్థి ఉంటారు. కానీ గోల్ఫ్‌కు ఉండరు. మనం బంతిని ఎంత వేగంగా కొడుతున్నామనే దాని మీదే మన విజయం ఆధారపడి ఉంటుంది. సొంతంగా ఆడాలి. మన జీవితం మన సొంత ఆట లాంటిది. గోల్ఫ్‌ ఆటలో బంతిని కొట్టేటప్పుడు తలదించుకోవాలి. తల ఎత్తితే షాట్‌ మిస్సవుతుంది” అని చెప్పింది.

రకుల్‌ ఐదో క్లాస్‌లో ఉన్నప్పుడు ఆమె తండ్రి  గోల్ఫ్‌ నేర్పించడానికి తీసుకెళితే, నచ్చేది కాదట. ‘‘మా నాన్నగారు ఆర్మీకి చెందిన వ్యక్తి. సహజంగానే స్పోర్ట్స్‌తో అనుబంధం ఉంటుంది. అందుకే ఫుట్‌బాల్, బ్యాడ్‌మింటన్‌ వంటివన్నీ కోచ్‌లను పెట్టి నేర్పించారు. అలాగే గోల్ఫ్‌ కూడా. నాకేమో అది పాత కాలపు  ఆటలా అనిపించేది. ఇష్టం ఉండేది కాదు. కానీ నేర్చుకోవడం మొదలుపెట్టాక ఇష్టం పెరిగింది. ప్రతి ఒక్కరూ ఏదొక ఆట నేర్చుకోవాలి. అది మనం సంయమనంతో ఉండడానికి ఉపయోగపడుతుంది’’ అని చెప్పింది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

ఫిట్‌నెస్‌ లైఫ్‌ స్టయిల్‌… “మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి. మన దేహం దేవాలయం లాంటిది. ఇంట్లో చెత్త లేకుండా చూసుకుంటాం. మరి దేహంలో కూడా చెత్త లేకుండా చూసుకోవాలి’’ అని హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అంటోంది . ‘‘వ్యాయామం, యోగాను కలిపి చేయడం చాలా మంచిది. వ్యాయామం ఫిట్‌నెస్‌ ఇస్తే, యోగా పాజిటివ్‌ దృక్పథాన్ని కల్పిస్తుంది. నాకు నచ్చిన ఫుడ్‌ని ఫుల్‌గా తింటాను, కానీ యోగా–జిమ్‌ చేస్తాను. ఒకర్ని చూసి వ్యాయామాలు చేయడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చేయొద్దు. మీ శరీరానికి తగ్గదే తినండి, అలాంటి వ్యాయామాలే చేయండి. శరీరం మాత్రమే కాదు.. మనసు కూడా లైట్‌గా ఉండాలి. ఆరోగ్యం కోసం కొంతమంది అదే పనిగా సలాడ్స్‌ తింటారు. అది మంచిది కాదు. కొన్ని వండుకొని తినాలి. ఇంకా చెప్పాలంటే.. మన అమ్మమ్మల కాలం నాటి భోజనాలకి వెళ్లిపోవాలి. అదే సరైన పద్ధతి. తాత–అమ్మమ్మల కాలం నాటి వంటకాల వల్ల ఒంట్లో కొవ్వు చేరదు. ఫిట్‌నెస్‌ను లైఫ్‌ స్టయిల్‌గా చూడాలి. అది మన జీవితంలో భాగమైనప్పుడు ఆరోగ్యంగా ఉంటాం’’ అని చెప్పింది రకుల్‌ ప్రీత్‌సింగ్ .

మానసికంగా కూడా ఆరోగ్యంగా… ‘ఆరోగ్యంగా ఉండడం అంటే ప్రతిరోజూ వ్యాయామం చేయడమో, సన్నగా ఉండడమో కాదు. మన ఆలోచనలు కూడా హెల్దీగా, పాజిటివ్‌గా ఉండాలి’’ అని చెప్పింది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ‘‘చూడడానికి మనం ఆరోగ్యంగా కనిపించాలంటే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. బాహ్య సౌందర్యం ముఖ్యం కాదు. మనం అంతర్గతంగా కూడా చాలా సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా రోజులో ఒకసారైనా మనల్ని మనం పలకరించుకోవాలి. ఎప్పుడూ నీతో నువ్వు సంతోషంగానే ఉండాలి. నీ శరీరానికీ, మనసుకూ ఏదో ఒక పని చెబుతూనే ఉండాలి. సానుకూలమైన ఆలోచనలను పెంపొందించుకోవాలి. ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి… మీలోని చిన్నపిల్లాడిని ఎంజాయ్‌ చేయనివ్వండి. ప్రకృతిని ఆస్వాదించనివ్వండి. అల్లరి పనులు ‌చేయండి. సరదాగా ఉండండి. ఖాళీ సమయాల్లో డిఫరెంట్‌గా ఏదైనా ప్రయత్నించండి. జీవితంలో ఏం చేసినా.. సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి’’ అని చెప్పింది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.