బ్యాక్‌గ్రౌండ్‌ లేకుంటే మంచి పాత్రలు చాలా కష్టం !

“ఇండిస్టీ బయటి వారికి, బ్యాక్‌గ్రౌండ్‌ లేని వారికి మంచి పాత్రలు రావడం చాలా కష్టం” అని అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం ఆమె హిందీలో ‘దే దే ప్యార్‌ దే’లో కథానాయికగా నటిస్తుంది. అజయ్ దేవగన్‌, టబు ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ నేపథ్యంలో రకుల్‌ మాట్లాడుతూ….’ఈ సినిమాలో నటించడానికి ప్రధాన కారణం నా పాత్ర. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. చిత్ర పరిశ్రమలో బయటి వారికి అర్థవంతమైన పాత్రలు దక్కాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. ఇందులో నా పాత్రకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అంతా నా పాత్రని ఐడెంటీఫై చేస్తున్నారు. ఇలాంటి మంచి పాత్రలు నాకు దక్కడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో నా పాత్ర లుక్‌ డిఫరెంట్‌గా ఉంటుంది.
 
ఈ పాత్ర కోసం నన్ను ఆఫర్‌ చేసినప్పుడే చిత్రనిర్మాత లవ్‌రంజన్ ఈ సినిమా కోసం నన్ను చాలా సన్నబడాలని కోరారు. మామూలుగా నేను చక్కటి ఫిట్‌నెస్‌ను మెయిన్‌టెయిన్ చేస్తాను.అయితే పాత్రపరంగా ఇంకా బరువు తగ్గాలని సూచించారు. కాక్‌టెయిల్ సినిమాలో దీపికాపదుకునే మాదిరిగా కనిపించాలని చెప్పారు. ఆయన మాటల్ని ఛాలెంజ్‌గా తీసుకున్నాను. జిహ్వాచాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటూ చక్కటి డైట్‌తో పదికిలోల బరువు తగ్గాను. నాజూకు సోయగంతో స్క్రీన్‌పై నన్ను నేను చూసుకొని ఎంతగానో మురిసిపోయాను అని చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్. అకివ్‌ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మే 17న విడుదల కానుంది. ప్రస్తుతం రకుల్‌ ‘ఎన్జీకే’, ‘మర్జావాన్‌’, ‘మన్మథుడు 2’లో నటిస్తూ బిజీగా ఉంది.హిందీలో అక్షయ్‌కుమార్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది.
 
వారి ప్రయత్నాలు ఫలించవు !
“నను ఎవరూ అడ్డుకోలేరు” అంటోంది నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌. టాలీవుడ్‌లో సక్సెస్‌ అయ్యింది. వరుస పెట్టి యంగ్‌ స్టార్స్‌తో నటించేసింది. టాప్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను తెచ్చుకుంది.ఆ క్రేజ్‌తో కోలీవుడ్‌లో పాగా వేసింది. అయితే టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఫ్లాప్‌లు వెంటాడాయి. ముఖ్యంగా తమిళంలో కార్తీతో రెండోసారి రొమాన్స్‌ చేసిన ‘దేవ్‌’ ఫ్లాప్‌ ఆమె కెరీర్‌కు పెద్ద ఎఫెక్ట్‌ అయ్యింది. దీంతో కొత్త అవకాశాలేమీ రకుల్‌ప్రీత్‌సింగ్‌ దరిదాపులకు కూడా రావడం లేదు. ప్రస్తుతం సూర్య సరసన నటించిన ఎన్‌జీకే చిత్రం, శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న చిత్రాలనే నమ్ముకుంది. అంతే కాదు టాలీవుడ్‌లో ఫ్లాప్‌ల కారణంగా అంగీకరించిన చిత్రాలు కూడా చేజారుతున్నాయట.
 
మూడు భాషల్లో నటించే అతి కొద్ది మందిలో తాను ఒకరిని కావడం సంతోషంగా ఉందని రకుల్‌ప్రీత్‌సింగ్‌ అంది. అయితే తన ఎదుగుదలను అడ్డుకోవడానికి కొందరు సామాజిక మాధ్యమాల్లో వదంతులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. అలాంటి వారి ప్రయత్నాలు ఫలించవని, అలాంటి తప్పుడు ప్రచారం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంది.