సక్సెస్‌ తక్కువైనా.. డిమాండ్ ఎక్కువే !

రకుల్‌ ప్రీత్‌సింగ్‌… ఒక్క సక్సెస్‌ వస్తే చాలు హీరోహీరోయిన్లు తమ పారితోషికాలను అమాంతం పెంచేస్తుంటారు. స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటీనటుల పారితోషికాలను చూస్తుంటే మతిపోతోంది.పెద్ద హీరోలు 20 కోట్ల నుండి.. రూ.40 కోట్లు  డిమాండ్‌ చేస్తుంటే, హీరోయిన్లు తామేమీ తక్కువ కాదు అన్నట్టుగా బాలీవుడ్‌ హీరోయిన్లు రూ.12 కోట్ల వరకూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇక దక్షిణాదిలో భారీ పారితోషికం పుచ్చుకుంటున్న నటి నయనతారనే. ఈ సంచలన నటి రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు  సమాచారం. అనుష్క రూ.3 కోట్ల వరకూ డిమాండ్‌ చేస్తున్నట్లు టాక్‌. ఇక పెద్దగా మార్కెట్‌ లేని హీరోయిన్లు రూ.50 నుంచి 60 లక్షల వరకూ పుచ్చుకుంటున్నారు.
 
కోలీవుడ్‌లో హిట్‌ కోసం ఆశ పడ్డ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఆ మధ్య కార్తీతో జత కట్టిన ‘ధీరన్‌ అధికారం ఒండ్రు’(ఖాకీ) చిత్ర విజయంతో కోటి వరకూ పారితోషికాన్ని డిమాండ్‌ చేసింది. ఇటీవల మరోసారి కార్తీతో రొమాన్స్‌ చేసిన ‘దేవ్‌’ చిత్రం తీవ్రం గా నిరాశపరిచింది. అయినా కూడా మరోసారి పారితోషికాన్ని పెంచేసిందట రకుల్‌. ప్రస్తుతం కోలీవుడ్‌లో సూర్యకు జంటగా నటించిన ‘ఎన్‌జీకే’ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. అదే విధంగా శివకార్తికేయన్‌తో ఒక చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో రకుల్‌కి పెద్దగా అవకాశాలు లేవు. అయినా తెలుగులో నాగార్జునకు జంటగా నటించే చిత్రం కోసం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ప్రస్తుతం తీసుకుంటున్న పారితోషికానికి మరో సగం పెంచేసి రూ.1.50 కోట్లు డిమాండ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతోంది. మరో విజయం వచ్చేవరకూ ఇదే పారితోషికాన్ని మెయిన్‌టేన్‌ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
మనసారా నవ్వుకుంటే చాలు!
‘పని ఒత్తిడి నుంచి బయటపడటానికి చాలామంది విహారయాత్రకు వెళ్తారు. అక్కడికి వెళ్లొచ్చాక రిఫ్రెష్‌ అయినట్లు భావిస్తారు. నా వరకూ రిఫ్రెష్‌మెంట్‌ అంటే మనసారా నవ్వుకోవడమే’’ అని చెబుతోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. వృత్తిరీత్యా కథానాయికగా నిరూపించుకోవడానికి రకుల్‌ ఎంతగా కష్టపడతారో.. వ్యక్తిగతంగా సుఖపడటానికీ అంతే కంఫర్ట్‌ కోరుకుంటారు. రిఫ్రెష్‌మెంట్‌కు కొత్త నిర్వచనం చెబుతున్నారామె. ‘‘ఏ రంగంలోనైనా ఒత్తిడికి గురైతే.. కాస్త విరామం తీసుకుని సేద తీరాలనుకుంటారు. నేనూ అలాగే ఆలోచిస్తా. కానీ నా దృష్టిలో రిఫ్రెష్‌మెంట్‌కు అర్థం వేరు. విహారయాత్రలంటే నాకూ ఇష్టమే. తరచూ వెళ్తుంటాను కూడా. కానీ అది నాకు సేద తీరినట్లు కాదు. సరదాగా నలుగురితో కూర్చొని మాట్లాడుకుంటూ మనసారా నవ్వుకుంటే చాలు. ఆ నవ్వే నాలో డబుల్‌ ఎనర్జీ పెంచుతుంది. దాంతో ఈజీగా రీఫ్రెష్‌ అవుతా. ఒత్తిడికి లోనైనప్పుడు ఇదే పద్దతిని ఫాలో అవుతా’’ అని రకుల్‌ చెప్పారు.