అపజయాల వల్లనే జీవిత పాఠాలు బోధపడతాయి!

“నాపై నాకు నమ్మకం ఎక్కువ. అది ఆత్మవిశ్వాసమే. కానీ మితిమీరిన విశ్వాసం కాదు. జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లినప్పుడే విజయాలు పలకరిస్తాయి” అంటున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. రకుల్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ మంచి జోరు మీద ఉన్నారు. జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలి? అనే విషయం గురించి రకుల్‌ మాట్లాడుతూ …
 
‘‘నేను చేయాలనుకున్న పనిని పూర్తి ఆత్మవిశ్వాసంతో మొదలుపెడతాను.నాపై నాకు నమ్మకం ఎక్కువ. అది ఆత్మవిశ్వాసమే. కానీ మితిమీరిన విశ్వాసం కాదు. ఎంత శ్రమ పడ్డా కొన్నిసార్లు వైఫల్యాలు మనల్ని వరిస్తాయి. అలాంటప్పుడు జీవితం పట్ల భయపడాల్సిన పని లేదు. అపజయాలు మంచికే. అవి మనం ఆలోచించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. మన బలాలను గుర్తు చేస్తాయి. అవి లేకపోతే మనం ఏమీ నేర్చుకోకుండా మిగిలిపోతాం. అర్ధం చేసుకుంటే.. వైఫల్యాల ద్వారానే మనకు జీవిత పాఠాలు బోధపడతాయి’’ అని చెప్పింది.
దాంతో నాకు ధైర్యం అలవడింది
బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లను దక్కించుకుంటున్న రకుల్‌ ఇఫీ వేడుకలో మాట్లాడుతూ…”మాది ఆర్మీ కుటుంబం కావడంతో చిన్నతనం నుంచి నేను చాలా ప్రాంతాల్లో పెరిగాను.. దీంతో నాకు ధైర్యం అలవడింది. ఎంత సంపాదించినా మామూలు మనుషుల మధ్య గడపడమే ఇష్టం.. ఎందుకంటే వారి జీవితంలోని కష్టసుఖాలను దగ్గర్నుంచి చూసే అవకాశం కలుగుతుంది. నేను ఏ పనిచేసినా ప్రణాళిక ప్రకారం చేస్తా.. అయితే అవి కొన్ని సార్లు నేను అనుకున్నట్టు జరగవు. సినిమాల్లో నేను ఎలా నటిస్తున్నాను. పాత్రకి న్యాయం చేస్తున్నానా? అనేదే చూస్తాను. ఫలితం గురించి పెద్దగా ఆలోచించను. ఎందుకంటే, అది మన చేతుల్లో ఉండదు. నా సినిమాలు కొందరికి నచ్చకపోవచ్చు. అది వాళ్ళ అభిప్రాయం. దీని వల్ల మనం బాధపడాల్సిన అవసరం లేదు. నా పని సిన్సియర్‌గా చేసుకుంటూ ముందుకు సాగడమే నాకు తెలుసు. వెను తిరిగి చూసే అవసరం లేదని నేను నమ్ముతాను” అని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పింది
 
బాలీవుడ్‌లో రకుల్ నటించిన రెండో సినిమా ‘దేదే ప్యార్ దే’ సక్సెస్ సాధించడంతో ఆమెకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత తెలుగులోనూ అదే తరహా చిత్రం ‘మన్మధుడు 2’లో నటించింది. కానీ, ఆకట్టుకోలేకపోయింది.ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘మర్జవాన్’ చిత్రంలో నటించిన రకుల్ ఆ సినిమాతో చేదు అనుభవమే చవి చూసింది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రకుల్ సందడి బాగానే ఉంది. తెలుగులో నితిన్ ‘చదరంగం’ లో, శివకార్తీకేయన్‌ చిత్రంతోపాటు..తమిళంలో విశ్వ నటుడు కమల్ హాసన్ చిత్రం ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. ఇక హిందీ విషయానికి వస్తే రకుల్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులున్నాయి. యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ఓ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ తాజాగా జాన్ అబ్రహాం సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.