ఆ విషయంలో నా కెరీర్‌ ఇప్పుడే ప్రారంభమైంది !

రకుల్‌ప్రీత్‌సింగ్…   వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ అవకాశాల కోసం ఇబ్బందులు పడే కంటే స్థిరంగా ఒక భాషలో గుర్తింపును తెచ్చుకోవడం ఉత్తమమని అంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్. స్టార్, గ్లామర్‌క్వీన్ అనే ముద్రల కంటే కథకు మాత్రమే తాను ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తానని చెబుతున్నది. తెలుగులో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్న రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టింది. హిందీలో వరుస అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది ఈ పంజాబీ సుందరి.

‘నేను నటించేది నా కోసం కాదు, ఇతరుల కోసం. నా సినిమాల వల్ల నాకు ప్రశంసలు, ప్రేక్షకులు ఆనందాన్ని పొందితే అదే నాకు చాలు’ అని అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం పలు బాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్రాల షూటింగ్‌తో తెలుగు తెరకు దూరంగా ఉంది. ఈ ఏడాది ‘అయ్యారి’తో మెరిసిన ఆమె ప్రస్తుతం అజయ్ దేవగన్‌తో కలిసి ‘దే దే ప్యార్‌ దే’ చిత్రంలో నటిస్తోంది.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రకుల్‌ చెబుతూ… ‘నేను ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి ఇప్పుడీ స్థాయిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది.  ఒక్క అవకాశం వచ్చినా చాలు అని ఎదురుచూస్తున్న వాళ్లు ఎంతో మంది బయటి ప్రపంచంలో కనిపిస్తుంటారని, వారితో పోలిస్తే తానెంతో అదృష్టవంతురాలినని చెబుతున్నది. నేను ఇప్పటి వరకు ఎచీవ్‌ చేసిన దాంతో సంతృప్తిగానే ఉన్నా. అలాగే ప్రియాంకచోప్రా, దీపికా పదుకొనె, అలియాభట్‌ తరహాలో విభిన్న సినిమాలు చేయాలనుకుంటున్నా. వారిలా సవాళ్లతో కూడిన పాత్రలతో నా ప్రతిభను నిరూపించుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపింది. వారిలా రాణించాలని భావిస్తున్నా. ఈ విషయంలో నా కెరీర్‌ ఇప్పుడే ప్రారంభమైంది. చేరుకోవాల్సింది చాలా ఉంది.

ఆమెలా నటించగలను, కానీ  శ్రీదేవిని కాలేను !

నటీనటులకు జయాపజయాలు సర్వసాధారణమే. నేను వాటిని పట్టించుకోను. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నా. ఇప్పుడు నాకు ప్రేమ అవసరం ఉందనిపిస్తోంది. అందుకు మంచి అబ్బాయిని వెతికి పెట్టండి అని ముంబయి, హైదరాబాద్‌లో ఉన్న నా ఫ్రెండ్స్‌కి చెప్పా. ప్రస్తుతం నటిస్తున్న ‘దే దే ప్యార్‌ దే’ న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీ. నాకు, అజయ్ కి మధ్య ప్రేమను, ఏజ్‌ గ్యాప్‌ను తెలియజేస్తుంది. ఇక సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న ‘మర్జావాన్‌’ చిత్రంలో ఓ విభిన్న పాత్రను పోషిస్తున్నాను. ఇది నా నటనా పరిధిని పెంచే చిత్రమవుతుంది. ఇక ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో శ్రీదేవిగా నటిస్తున్నా. ఈ పాత్రలో నటించడం చాలా ఒత్తిడితో కూడుకున్నది. సరిగా చేయకపోతే విమర్శలొస్తాయి. ఆమెలా నటించగలను, కానీ నేను శ్రీదేవిని కాలేను’ అని తెలిపింది.