నాకు దక్కని సినిమాలేవీ సరిగా ఆడలేదు!

“కెరీర్‌ స్టార్టింగ్‌లో దక్షిణాదిలో రెండు చిత్రాల్లోంచి నన్ను తీసేసి, వేరే హీరోయిన్లను తీసుకున్నారు. సినిమా నేపథ్యం లేని కారణంగా కొన్ని సినిమాలు నా చేతుల్లోంచి వెళ్లిపోయాయి. మా నాన్న దర్శకుడో, నిర్మాతో అయ్యుంటే..సినీ నేపథ్యం ఉండుంటే..ఆ ఆ అవకాశాలు నాకే వచ్చేవేమో… అని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. మనలో ప్రతిభ ఉంటేనే చిత్ర పరిశ్రమలో ఉండగలం. ఏదైనా రాసి పెట్టుంటే జరుగుతుంది. ‘నన్ను భూమిలో పాతిపెట్టాలని ప్రయత్నించేవాళ్లకు నేనొక విత్తనం అనే సంగతి తెలియదు’ అని ఒక కోట్‌ మా ఇంట్లో ఉంటుంది. నేనిలా చెప్పకూడదు గానీ… ‘ఆ సినిమా నేను చేయాల్సింది’ అనుకున్నవన్నీ సరిగా ఆడలేదు. దాంతో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నా.
ప్రస్తుతం ప్రేక్షకులు ప్రతిభను చూస్తున్నారు. విక్కీ కౌశల్‌, అనుష్కా శర్మ, తాప్సీ, భూమి పెడ్నేకర్‌, ఆయుష్మాన్‌ ఖురానాలు సినీ నేపథ్యం నుండి వచ్చినవాళ్లు కాదు. ఎక్కడో ఎవరో ఒకరు వాళ్లకు అవకాశాలు ఇస్తేనే కదా పైకి వచ్చారు. ప్రతిభ ఉంటే పైకొస్తారని నా నమ్మకం !”
 
అటువంటి ట్రిక్స్‌కి పడవద్దు!
‘‘ప్రపంచంలో అవకాశ వాదం ఎక్కువ. మనిషి నైజమే అంత! అవకాశాల కోసం అర్రులు చాస్తున్నామని ఎదుటివాళ్లకు తెలిస్తే… ‘మాకేంటి?’ అనే ధోరణిలో కొందరు ఉంటారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ‘వాళ్లకు అవకాశం ఇవ్వాలా? వద్దా?’ అనే నిర్ణయం మన చేతుల్లో ఉంటుంది. ఆ అమ్మాయి అవకాశం ఇస్తుందని ఎవరూ వందకోట్ల సినిమాలో కథానాయికగా తీసుకోరు. అమ్మాయిలను లోబరచుకోవడానికి కొందరు ట్రిక్స్‌ ప్లే చేస్తారు. నేను చెప్పేది ఒక్కటే… అటువంటి ట్రిక్స్‌కి పడవద్దు!
నిజాయతీగా చెప్పాలంటే… హీరోయిన్లు నాజుకుగా కనిపించడం కోసం జిమ్‌కు వెళతాం. చిన్న చిన్న దుస్తులు వేసుకోవడం కోసం, డ్యాన్స్‌ చేయడం కోసం చాలా కష్టపడతాం. సినిమా కోసం కెమేరా ముందు, వెనుకా అదనంగా ఎంతో శ్రమిస్తాం. కానీ, సినిమా హిట్టయితే ‘గోల్డెన్‌ లెగ్‌’ అంటారు. ఫ్లాప్‌ అయితే ‘ఐరన్‌ లెగ్‌’ అంటారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో నేను చేసిన సినిమాలు బ్లాక్‌బస్టర్లు అయ్యాయి. నా దృష్టిలో ఇవన్నీ మూఢ నమ్మకాలు. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు’’
 
సమాజంలో స్త్రీ-పురుష వివక్ష ఉంది!
‘‘ప్రపంచంలో, మన సమాజంలో స్త్రీ-పురుష వివక్ష ఉంది. మహిళలను చిన్నచూపు చూసేవారున్నారు. చిత్రసీమలో నటీనటుల పారితోషికాల్లో వ్యత్యాసం ఉంటుంది. అయితే… చిత్రసీమలో నన్నెప్పుడూ చిన్న చూపు చూడలేదు. నేను మంచి టీమ్స్‌తో పని చేశా. అందులోనూ, దక్షిణాదిలో మహిళలకు పెద్దపీట వేస్తారు.
పారితోషికం విషయానికి వస్తే… హీరోలు క్రౌడ్‌ పుల్లర్స్‌. సినిమా బరువు బాధ్యతలన్నీ వాళ్ల భుజాల మీదే ఉంటాయి. నేనది అర్థం చేసుకున్నా. హీరోల తరహాలో హీరోయిన్లు కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అప్పుడు… వాటిని ఫీమేల్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ అనడం మానేయాలి. ఉదాహరణకు… ‘బద్లా’, ‘సాండ్‌ కీ ఆంఖ్‌’, ‘ఛపాక్‌’. ఆ సినిమాలకు తగ్గట్టు హీరోయిన్లకు పారితోషికాలు ఇస్తారు. నా వల్ల వసూళ్లు ఎంత వస్తాయి? ఎన్ని రోజులు పని చేస్తున్నాను? అనేదాని మీద నా పారితోషికం ఆధారపడి ఉంటుంది’’