ఆమెలా చెయ్యమంటే ఆనందంగా చేస్తా !

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌… ‘బయోపిక్‌లంటే నాకు చాలా ఇష్టం. సావిత్రి బయోపిక్స్‌ లాంటివి మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే శ్రీదేవి బయోపిక్‌ గురించి నన్నెవరూ సంప్రదించలేదు. అలాంటి ఛాన్స్‌ వస్తే కచ్చితంగా నటిస్తాను’ అని అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.తన డ్రస్‌ కల్చర్‌ గురించి ఇటీవలఓ నెటిజన్‌కి తనదైన శైలిలో రకుల్‌ ఇచ్చిన ఘాటైన సమాధానం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది.
తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రకుల్‌ తన రాబోయే సినిమాల గురించి మాట్లాడుతూ… ‘తమిళంలో కార్తి సరసన నటిస్తున్న ‘దేవ్‌’లో నేను మేఘన అనే ధైర్యవంతురాలైనా అమ్మాయిగా కనిపిస్తా. నా పేరుని సైతం ఎంచుకునే స్వతంత్ర భావాలు కలిగిన పాత్ర నాది. అయితే నిజ జీవితంలో ఈ పాత్రకి పూర్తి భిన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటాను. ‘దేవ్‌’లో కార్తి, ‘ఎన్జీకే’ లో సూర్య వంటి వారితో నటించడం మంచి అనుభవం. ఓ రకంగా లక్కీగా భావిస్తున్నా. సూర్యకి నేను వీరాభిమానిని. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు. నేను నటిగానే కొనసాగుతా. దర్శకత్వం వహించే క్రియేటివిటీగానీ, సినిమాలని నిర్మించే డబ్బు గానీ నా దగ్గర లేదు. అలాగే నేను హోటల్‌ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నట్టు వస్తున్న వార్తల్లోనూ నిజం లేదు’ అని తెలిపింది.
ప్రస్తుతం ‘వెంకీమామ’, ‘మర్జావా’, ‘దేవ్‌’, ‘ఎన్జీకే’, ‘దే దే ప్యార్‌ దే’ వంటి తదితర చిత్రాల్లో నటిస్తూ రకుల్‌ బిజీగా ఉంది.
ఎక్కువ పని గంటలు ఇష్టపడతా !
ఇన్ని ప్రాజెక్ట్స్‌ షెడ్యూల్స్, డేట్స్, ప్రమోషన్స్‌ను ఎలా ప్లాన్‌ చేసుకుంటున్నారు? మీకు అలసటగా అనిపించదా? అన్న ప్రశ్న రకుల్‌ ముందు ఉంచితే.. ‘‘మనం చేసే పనిని ప్రేమిస్తే ఎంత కష్టమైనా సులభంగానే అనిపిస్తుంది. వర్క్‌ కమిట్‌మెంట్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు మనల్ని మనం మోటివేట్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కెరీర్‌కు ప్లస్‌ అవుతున్నప్పుడు ఎక్కువ టైమ్‌ వర్క్‌ చేయడంలో తప్పులేదు. ఒక్కోసారి లాంగ్‌ జర్నీ చేసి కూడా షూటింగ్‌లో పాల్గొనాల్సి వస్తుంది. అయినప్పటికీ నేను ఇబ్బంది ఫీలవ్వను. ఎందుకంటే రోజులో ఎక్కువ పని గంటలు ఉండటాన్ని ఇష్టపడతాను. ఆ పనిలోనే ఆనందం వెతుక్కుంటా’’ అని పేర్కొన్నారు రకుల్‌.