భోజన ప్రియురాలిని..ఓ హోటల్‌ ప్రారంభిస్తా !

రకుల్‌ప్రీత్‌సింగ్‌… ఈ మధ్యకాలంలో కార్తీతో రొమాన్స్‌ చేసిన ‘ధీరన్‌ అధికారం ఒండ్రు'(ఖాకీ) చిత్రంతో విజయాన్ని అందుకుంది. మరోసారి కార్తీకి జంటగా ‘దేవ్‌’ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ ఆయన సోదరుడు సూర్యతోనూ ‘ఎన్‌జీకే’ చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా శివకార్తికేయన్‌తో ఒక చిత్రంతో మొత్తం కోలీవుడ్‌లో మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఇక టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘ఎన్‌టీఆర్‌’ బయోపిక్‌ నాటి అతిలోకసుందరి శ్రీదేవిగా మెరవనుంది. ఇంతకు మించి అవకాశాలు ప్రస్తుతానికి లేవు.
ఈ అమ్మడు నటిగా దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చి నాలుగేళ్లు అయ్యిందట.ఈ 4 ఏళ్లలో 16 చిత్రాలు చేసింది. దీంతో హ్యాపీస్‌ అంటోంది. “ఇప్పటికి 4 ఏళ్లలో 16 చిత్రాల్లో నటించాను. చాలా ఉత్సాహంగా ఉన్నాను. విశ్రాంతి అన్నది నాకు నచ్చని విషయం. ఇచ్చిన పనిని పూర్తి చేసే మనస్తత్వం. ఫలితం గురించి ఆలోచించను. నా సంతోషానికి కారణం ఇవే” …అని నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పేర్కొంది. అన్నట్టు ఈ రకుల్‌కి 2018 అచ్చిరాలేదనే చెప్పాలి. కోలీవుడ్‌లో ఈమె నటించిన ఒక్క చిత్రం విడుదల కాలేదు. సూర్యతో రొమాన్స్‌ చేస్తున్న ‘ఎన్‌జీకే’ చిత్రం దీపావళికి తెరపైకి రావలసి ఉన్నా, షూటింగ్‌ జాప్యం కారణంగా అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
సినిమా తరువాత ఇష్టమైనది ఆహారం !
రకుల్‌ప్రీత్‌సింగ్‌ పైకి అలా అంటున్నా, ఆమెకు సినిమాపై నమ్మకం సన్నగిల్లుతోందని అనిపిస్తోంది. సినిమా నిరంతరం కాదని ఇంతకు ముందే స్టేట్‌మెంట్‌ ఇచ్చిన రకుల్‌ ఇతర వ్యాపారాలపై ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే జిమ్‌ను నడుపుతున్న ఈ బ్యూటీ తాజాగా హోటల్‌ వ్యాపారాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. దీని గురించి తనే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. …సినిమా తరువాత నాకు ఇష్టమైనది ఆహారం. శరీరాన్ని స్లిమ్‌గా ఉంచుకోవడానికి కడుపును కాల్చుకోవాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. ఇష్టమైన పదార్థాలను తిని కూడా శరీరాన్ని కట్టుబాటులో ఉంచుకోవచ్చు. అందుకు ఉదాహరణ నేనే. వ్యాయామ శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్న నేను భోజన ప్రియురాలిని. నగరంలో ఒక్క హోటల్‌నూ వదలను. ఎక్కడ ఏ ఆహార పదార్థం బాగుందని తెలిసే అక్కడకు వెళ్లి లాగించేస్తాను.జిమ్‌ను నడుపుతున్న నాకు ఇప్పుడు ఆహారంపై ప్రియంతో ఒక హోటల్‌ను ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. నాకు నచ్చిన ఆహార పదార్థాలన్నీ ఒకే చోట లభించేలా చేయాలన్న ఆశ కలిగింది.
మరో తెలుగు సినిమాకు ఓకె !
మహేష్ బాబు ‘స్పైడర్‌’ సినిమాతో టాలీవుడ్ తెర మీద చివరి సారిగా మెరిసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ 2018లో ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. కనీసం డబ్బింగ్‌ సినిమాతోనూ తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. రకుల్‌ ప్రీత్‌ బాలీవుడ్ లో ‘అయ్యారి’ మాత్రమే నటించింది. ప్రస్తుతం రెండు హిందీ, రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్‌ లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఓ తెలుగు సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.
మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో నితిన్‌, విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భీష్మా’తో పాటు …ఏలేటి సినిమాలో కూడా నటించే ఆలోచనలో ఉన్నాడు. భీష్మాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా చంద్రశేఖర్‌ ఏలేటి సినిమాలో రకుల్‌ ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్‌.