నేను ఎలాఉండాలో ఎవరో డిసైడ్‌ చేస్తానంటే ఎలా?

“సీనియర్లతో నటిస్తున్నానా? నాకంటే తక్కువ వయసు వాళ్లతో నటిస్తున్నానా? అనేది ఆలోచించను. కథకు అవసరం అయినప్పుడు ఎవరి పక్కన నటిస్తే ఏమిటి?”… అని ప్రశ్నిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.
“నేను సీనియర్లతో నటిస్తున్నానా… నాకంటే వయసు తక్కువ ఉన్నవాళ్లతో నటిస్తున్నానా… అనేది ఆలోచించను. నాకు పాత్ర నచ్చితే చాలు ! ‘దే దే ప్యార్‌ దే’, ‘మన్మథుడు 2’ కథల ప్రకారం… నేను పెద్ద వయసున్న వాళ్లతో ప్రేమలో పడాలి. రెండు చోట్లా నా వయసు పాతికేళ్ళు. కథకు అవసరం అనుకున్నప్పుడు ఎవరి పక్కన నటిస్తే ఏమిటి… నటిగా నేను ఎదగాలి. అలాంటప్పుడు మంచి పాత్రను ఎందుకు వదిలేయాలి? యంగ్ హీరోతో నాలుగు సీన్లు, పాటల్లో చేసే కంటే.. ప్రేక్షకులలో గుర్తింపునిచ్చే పాత్రలో నటించడానికే నేను ఇష్టపడతాను. ఇప్పుడు నితిన్‌తో ఓ సినిమా చేస్తున్నా. అందులో నేను లాయర్‌గా కనిపిస్తా… అది నటనకు ఆస్కారం ఉన్న పాత్ర, అందుకే అంగీకరించాను.. నాకు నచ్చితే హీరో వయస్సు గురించి పట్టించుకోను…అని చెప్పింది రకుల్
 
మీపై విమర్శలకు సమాధానం?
మాకు పర్సనల్‌ లైఫ్‌ అనేది పర్సనల్‌గా ఉండదు. మా జీవితంలో ఏం జరుగుతుందో పబ్లిక్‌కి కావాలి. ఒక్కోసారి జరగనివాటి గురించి చెప్పుకుంటారు. అలాంటప్పుడు చాలా బాధ కలుగుతుంది.
పాత్ర పరంగా విమర్శిస్తే నా తప్పును సరిదిద్దుకుంటాను. ఫలానా చోట రకుల్‌ బాగా చేయలేదంటే… మరోసారి బాగా చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ విషయంలో విమర్శకులు ఎలాంటి సలహాలు ఇచ్చినా… పాటించడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ నా వ్యక్తిగత విషయాల్లోకి జోక్యం చేసుకుని  విమర్శిస్తుంటే మాత్రం సహించలేను. అలాంటి వారికి ఘాటైన సమాధానం తప్పదు. బయట ఎలా ఉండాలో నేను డిసైడ్‌ చేసుకోవాలి. ఎవరో డిసైడ్‌ చేస్తానంటే ఎలా ఒప్పుకుంటాను.
 
హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు…
ప్రస్తుతానికి చేతినిండా సినిమాలున్నాయి. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ సినిమా అంటే కష్టమే. ఆ సినిమాలకి చాలారోజులు కావాలి…సర్దుబాటు చేయలేను. అందుకే, నేను చేసే కమర్షియల్‌ సినిమాల్లో నా పాత్రకు ప్రాముఖ్యత ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. భవిష్యత్తులో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తానేమో.
 
పాత్ర పరంగా మార్పుకోరితే…
పాత్రకు అనుగుణంగా నన్ను నేను మార్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. బాలీవుడ్‌లో సినిమా కోసం పది కిలోలు తగ్గమన్నారు. అలాగే మరో సినిమా కోసం బరువు పెరగమంటే పెరుగుతాను. మరీ ఎక్కువ మార్పులు కావలసి వస్తే మేకప్‌తో మేనేజ్‌ చేయడానికే ప్రయత్నిస్తాను. కొన్ని రకాల ప్రయోగాలకు దూరంగానే ఉంటాను. అలాగని ప్రయోగాత్మక సినిమాలకు నేను వ్యతిరేకం కాదు.