సినిమాల్లో చేయలేనివి, అందులో చేస్తా!

“సినిమాల్లో చేయలేనివి, అందులో చేస్తా” అని రకుల్‌ చెప్పింది .డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై కూడా మెరిసేందుకు తారలు అమితాసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సమంత, కాజల్‌, తమన్నా వెబ్‌ సిరీస్‌లు చేసేందుకు సిద్ధమయ్యారు.తాజాగా వీరి జాబితాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా చేరబోతుంది. ‘డిజిటల్‌కి సంబంధించి ఇప్పటికే చాలా ఆఫర్స్‌ వస్తున్నాయి. కానీ నాకు బిగ్‌ స్క్రీన్‌ అంటేనే ఇష్టం. అయితే వెబ్‌ సిరీస్‌ అనేది మనకొక కొత్త దారి. మనలోని కొత్త కోణాలను ఆవిష్కరించుకునేందుకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి అందులో నటించాలంటే పూర్తిగా పాత్‌ బ్రేకింగ్‌ స్క్రిప్ట్‌లు, పాత్రలు రావాలి. అలాంటివి వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తా. సినిమాల్లో చేయలేనివి, అందులో చేస్తా’ అని రకుల్‌ చెప్పింది . ఇదిలా ఉంటే, ఓ వెబ్‌ సిరీస్‌లో రకుల్‌ నటించేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు సమాచారం. గత ఏడాది ఐదు సినిమాల్లో నటిస్తే.. ఒక్కటి కూడా రకుల్‌కి సక్సెస్‌ని అందించలేదు.
నేనెట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను!
నటిగానే కాకుండా ఫిట్‌నెస్‌తోనూ ఎంతో మందికి దగ్గరైన రకుల్‌ తాజాగా ఓ ఆసక్తికర స్టేట్‌మెంట్‌ ఇచ్చింది… ‘ఫిట్‌నెస్‌ అనేది జీవితంలో భాగం. ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కి హాని కలిగించే పాత్రలు నేను చేయను’ అని చెబుతోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. గతేడాది వరుస పరాజయాలు అందుకున్న రకుల్‌ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో భాగమైంది.
‘ఫిట్‌నెస్‌కి షార్ట్‌కట్స్‌ లేవు. అది రెగ్యులర్‌గా చేస్తూనే ఉండాలి. బద్ధకంతో వ్యాయామాలకు దూరంగా ఉండేవారు తమ మైండ్‌ సెట్‌ని మార్చుకోవాలి. మన శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం మన చేయాల్సిన ముఖ్యమైన పని వ్యాయామం. మీకోసం, మీ ఆరోగ్యం కోసం సమయం కేటాయించలేనప్పుడు ఆ జీవితం ఎందుకు? సినిమాల పరంగా ఆరోగ్యానికి హాని కలిగించే పాత్రలను నేనెట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను.
సినిమాల్లో ఫిజికల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. కొన్నిసార్లు సినిమా, సినిమాకి మధ్య శరీరాకృతిలో వ్యత్యాసం చూపిస్తాం. ‘దే దే ప్యార్‌ దే’ సినిమా కోసం 45 రోజుల్లో దాదాపు పది కిలోల బరువు తగ్గాను. బరువు తగ్గడం ఇబ్బంది కాదు. కానీ పాత్ర కోసం 20 కేజీల బరువు పెరగమంటే ఒప్పుకోను. అది ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది’ అని తెలిపింది. ప్రస్తుతం తమిళంలో ‘ఇండియన్‌ 2’, ‘అయలాన్‌’, హిందీలో జాన్‌ అబ్రహాం ‘ఎటాక్‌’తోపాటు అర్జున్‌ కపూర్‌తో కలిసి ఓ సినిమాలో రకుల్‌ నటిస్తోంది.