మీతో మీరు కనెక్ట్‌ అయ్యే సమయం ఇది!

“స్వీయ ఆత్మ పరిశీలన చేసుకునే సమయం ఇది . మీతో మీరు కనెక్ట్‌ అయ్యే సమయం. నేను ప్రస్తుతం పర్సనల్‌ డెవలప్‌మెంట్‌కు అధిక సమయం కేటాయిస్తున్నాను”…. అంటూ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ లాక్‌డౌన్‌లో తన రోజూవారి షెడ్యూల్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది …
 
“నా జీవితంలో ఎప్పుడు ఇన్ని రోజులు ఇంట్లో ఉండలేదు. ఇదే నాజీవితంలో సుదీర్ఘకాల విరామం. చిన్నప్పుడు వేసవికాలం సెలవుల్లో కూడా ఇన్ని రోజులు ఒకచోట లేను. మార్చి 18 తర్వాత ఇంట్లోనే ఉంటున్నా. లాక్‌డౌన్‌లో ముగిసే సమయానికి బద్దకంగా తయారవకుండా పక్కా షెడ్యూల్‌ తయారు చేసుకున్నా. రోజూ ఉదయం 7 లోపు నిద్ర లేస్తాను. కొద్దిసేపు చదువుకుని …ఆ తరువాత యోగా చేస్తా. ప్రస్తుతం ‘వై వీ స్లీప్‌’ అనే పుస్తకాన్ని చదువుతున్నా. ఇప్పటికే ‘చారియోట్స్‌ ఆఫ్‌ ద గాడ్స్‌’, ‘కాస్‌మిక్స్‌ కాన్షియస్‌నెస్’అనే ‌ రెండు పుస్తకాలను పూర్తి చేశాను. సోషల్‌ మీడియాలో మధ్యాహ్నం కొంచెం సమయం కేటాయిస్తాను. గత రెండేళ్లలో ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న ప్రతి సినిమాను చూశాను.ప్రతి రోజు సాయంత్రం ఓ సినిమాతోపాటు… ఏదైనా షోకు సంబంధించిన రెండు మూడు ఎపిసోడ్‌లు చూస్తాను. అలాగే ఇక ముఖ్యమైనది కుకింగ్‌. నాకు వంట మనిషి ఉన్నప్పటికీ నేను వంట చేస్తున్నాను. ఇటీవలే యూట్యూబ్‌లో వంటల ఛానల్‌ ఓపెన్‌ చేశాను”
 
“ఇంతకాలం ఇంట్లో ఉండటం అనేది ‘ఒక కొత్త అనుభూతి’ అని అనుకుంటున్నా. ఒక విధంగా చెప్పాలంటే.. ఇది మంచిదే. ఎందుకంటే, మనం ఏం చేసినా.. ‘ప్రకృతికి దాని సొంత మార్గాలు ఉంటాయ’ని మీరు అర్థం చేసుకుంటారు. ఇది స్వీయ ఆత్మ పరిశీలన చేసుకునే సమయం. మీతో మీరు కనెక్ట్‌ అయ్యే సమయం. నేను ప్రస్తుతం పర్సనల్‌ డెవలప్‌మెంట్‌కు అధిక సమయం కేటాయిస్తున్నాను. ఈ సంక్షోభం ‘భూమి మీద మన మనుగడ చిన్నది’ అని నేర్పిస్తుంది. ఇలాంటి సమయంలో మీ ఆరోగ్యం, మీరు ఇష్టపడే వ్యక్తులు, మీ జ్ఞాపకాలు ఎంత ముఖ్యమైనవో తెలుసుకుంటారు. వీటి తర్వాతే మిగతావని మీరు గ్రహిస్తారు. మీరు మీ కోసం కష్టపడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మీరే జీవించాలి. ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ఆనందంగా జీవించాలని కోరుకోండి”
 
ఆదాయం కరోనాపై పోరాటానికే !
రకుల్‌ ప్రీత్‌ సింగ్ సినిమాలతోపాటు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. యోగా, వర్కౌట్‌లకు సంబంధించిన విషయాలనే కాకుండా… తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే రకుల్‌ కొత్తగా ‘యూట్యూబ్‌ ఛానల్‌’ను ప్రారంభించారు. ఇందులో వంటలు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలాగే తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని కరోనాపై పోరాటానికి ‘పీఎం కేర్‌’ ఫండ్స్‌కు అందించనున్నట్లు ఆమె తెలిపారు.
 
“ప్రస్తుతం నాకు చాలా సమయం ఉంది కాబట్టి.. యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాలని అనుకున్నాను. దీనిలో అన్ని సరదా విషయాలను మీతో పంచుకుంటాను. దీని ద్వారా వచ్చే ఆదాయం పీఎం కేర్‌ ఫండ్‌కు వెళుతుంది. ప్రతి ఒక్కరం ఆనందాన్ని పంచుదాం. మార్పు కోసం ఇప్పుడే ఛానల్‌ను సబ్‌స్ర్కైబ్‌ చేయండి” అని కోరింది.. ఇక తొలి వీడియోగా ‘చాకొలెట్‌ పాన్‌కేక్‌’ను ఎలా తయారు చేయాలో వీడియో చేసి అప్‌లోడ్‌ చేసింది . కాగా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి గుర్గావ్‌లోని తన ఇంటి సమీపంలో ఉన్న పేదవారి 200 కుటుంబాలకు రకుల్‌ ఆహారం అందజేస్తూ సహాయం చేస్తోంది.