నాకు మంచి జీవితాన్నిచ్చింది ఈ చిత్రపరిశ్రమనే !

రకుల్‌ప్రీత్‌సింగ్‌ ….తనకు మంచి సినీ జీవితాన్ని ప్రసాదించింది దక్షిణాది సినిమానేనని నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ అంటోంది. టాలివుడ్, కోలివుడ్‌ అంటూ మార్చిమార్చి అవకాశాలను అందుకుంటోంది. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత కోలివుడ్‌కు దిగుమతి అయినా, పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో టాలివుడ్‌లో పాగావేసింది. అక్కడ టైమ్‌ కలిసి రావడంతో వరుసగా స్టార్‌ హీరోలతో నటించింది. కాగా ఎంత వేగంగా అక్కడ ఎదిగిందో అంతే వేగంగా గ్రాఫ్‌ పడిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఖాతా ఖాళీ అయింది. అయితే కోలీవుడ్‌ ఆదుకోవడంతో ఇంకా దక్షిణాదిలో పేరు వినిపిస్తోంది. ఇక్కడ కార్తీకి జంటగా నటించిన ‘ధీరన్‌ అధికారం ఒండ్రు’చిత్రం మంచి విజయం సాధించి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను కాపాడింది. ప్రస్తుతం సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్యకు జంటగా ‘ఎన్‌జీకే’చిత్రంలో నటిస్తోంది.

‘ధీరన్‌ అధికారం ఒండ్రు'(ఖాకీ) చిత్రం తరువాత మరోసారి కార్తీతో ‘దేవ్‌’చిత్రంలో రొమాన్స్‌ చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నటుడు శివకార్తీకేయన్‌తో కూడా రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఒక చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. మొత్తం మీద కోలీవుడ్‌లో బాగానే నటిగా స్థాయిని పెంచుకుంటోంది. అయితే పనిలో పనిగా బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది రకుల్‌. ఈమె ఇంతకు ముందు హిందిలో నటించిన చిత్రం ‘అయ్యారి’ ప్లాప్‌ అయ్యింది. తాజాగా అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా ఒక చిత్రం చేస్తోంది.  అజయ్‌దేవ్‌గన్‌తో కలిసి నటిస్తానని ఊహించలేదని, ‘అయ్యారి’ చిత్రం విజయం సాధించకపోవడంతో చాలా బాధ పడ్డానంది. అయితే ఆ చిత్రంలో తన నటనే అజయ్‌దేవ్‌గన్‌తో కలిసి నటించే అవకాశాన్ని తెచ్చి పెట్టిందని చెప్పుకొచ్చింది. ఈ చిత్రం హిట్‌ అయి తనకు మంచి మార్కెట్‌ను తెచ్చి పెట్టినా తాను దక్షిణాది చిత్ర పరిశ్రమను మర్చిపోనని చెప్పుకొచ్చింది. ఒకవేళ హింది చిత్రాలతో బిజీ అయినా తెలుగు, తమిళం చిత్రాల్లోనూ నటిస్తానంది. తనకు మంచి జీవితాన్నిచ్చింది దక్షిణాది చిత్రపరిశ్రమనేనని రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొంది.

లాంగ్‌ వర్కింగ్‌ డేస్‌లోనే ఇంకా మజా !

పని ఒత్తిళ్లు, ఎక్కువ పని గంటలున్నప్పుడు సాధారణంగా అలసిపోతుంటాం. కానీ ఈ రూల్‌ రకుల్‌కి వర్తించదట. లాంగ్‌ వర్కింగ్‌ డేస్‌లోనే ఇంకా మజా వస్తుంది అంటున్నారీ భామ. హీరోయిన్‌గా బిజీ షెడ్యూల్స్‌ గురించి ఆమె మాట్లాడుతూ–‘‘షూటింగ్‌ ఎప్పుడూ ఒకేచోట జరగదు. వివిధ ప్రదేశాలు తిరగాల్సి వస్తుంటుంది. ఈరోజు చెన్నైలో ఉంటే ఆ మరుసటి రోజు ముంబైలోనో, ఢిల్లీలోనోఉంటాం.అయితే వర్క్‌హాలిక్‌ని  కాబట్టి ఇవన్నీ నన్ను అలసిపోయేలా చేయవు. వర్క్‌ ఎంత చేసినా అలుపు సొలుపు అంత సులువుగా రావు. లాంగ్‌ వర్కింగ్‌ షెడ్యూల్స్‌ని ఇంకా ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తాను’’ అని పేర్కొన్నారు. వర్క్‌హాలిక్‌ కాబట్టే ముంబైలో అజయ్‌ దేవగన్‌ సినిమా, హైదరాబాద్‌లో కార్తీ సినిమా షూటింగ్స్‌కు అటు ఇటు షిఫ్ట్‌ అవుతూ సినిమాలను కంప్లీట్‌ చేస్తున్నారు రకుల్‌.