అమాంతం రెమ్యూనరేషన్‌ పెంచేసింది !

ఎప్పటి నుండో ప్రిన్స్ మహేశ్ సరసన నటించాలని తహతహలాడుతున్న రకుల్ కోరిక ‘స్పైడర్’తో తీరిపోయింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ రూపుదిద్దుకోవడం విశేషం. ఇంతకూ విషయం ఏమంటే.. ‘స్పైడర్’కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రకుల్ ఇప్పుడు అమాంతంగా తన రెమ్యూనరేషన్‌ను పెంచేసిందట.
రకుల్ ప్రీత్‌సింగ్‌కు అందం మాత్రమే కాదు, అదృష్టం కూడా బాగా కలిసొచ్చిందన్నది ఇండస్ట్రీ వర్గాల  మాట. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో హిట్ ట్రాక్‌లోకి వచ్చిందీ అమ్మడు. ఆ తర్వాత కూడా విజయాలకంటే పరాజయాలే ఆమె ఖాతాలో ఎక్కువ జమయ్యాయి. అయినా కూడా ఊహించని విధంగా రకుల్‌కు ఇటు తెలుగు, తమిళంతో పాటు అటు హిందీలోనూ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. గత యేడాది రకుల్ నటించిన సినిమాల్లో ‘ధృవ’ కాస్త నిరాశ పరిచినా, ‘నాన్నకు ప్రేమతో…’, ‘సరైనోడు’ మంచి విజయమే సాధించాయి.ఇక ఈ యేడాది రకుల్ ఏకంగా ఐదు చిత్రాల్లో నటించింది. మొదట వచ్చిన ‘విన్నర్’ తీవ్ర నిరాశకు గురిచేసినా ఆ తర్వాత వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘జయ జానకి నాయక’ చిత్రాలు ఈ చిన్నదానికి కాస్తంత ఓదార్పును అందించాయి.
ఇవాళ తమిళ స్టార్ హీరోలందరూ తమ చిత్రాలను తెలుగులోనూ డబ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో వారి మార్కెట్ ఎలా ఉన్నా… రకుల్ ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోయిన్ కాబట్టి ఆమెకు కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చినా నష్టం ఉండదని, తమకు టాలీవుడ్ బిజినెస్ బాగా జరుగుతుందని భావిస్తున్నారట. కోలీవుడ్ నిర్మాతల నుండీ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రకుల్ సైతం తెలుగు కంటే తమిళ చిత్రాలను అంగీకరించడానికే ఆసక్తి చూపుతోందట. ప్రస్తుతం కార్తీ సరసన రకుల్ ‘తీరన్ అధికారం ఒండ్రు’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ తెలుగులో ‘ఖాకీ’ పేరుతో డబ్ అవుతోంది. మొత్తం మీద రెండు భాషల్లో ఉన్న క్రేజ్‌ను అమ్మడు బాగానే ఉపయోగించుకుంటోందని, నయనతార, అనుష్క తర్వాత దక్షిణాదిలో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది రకుల్ మాత్రమే అని  అనుకుంటున్నారు.