గేమ్‌ ఆడే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు !

‘తెలుగు చిత్ర పరిశ్రమ నా మనసుకు బాగా దగ్గరైన పరిశ్రమ. నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది ఇక్కడే’ అని అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇటీవల ‘అయ్యారి’ చిత్రంతో బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించింది రకుల్‌. ప్రస్తుతం మరో బాలీవుడ్‌ చిత్రంలో అజయ్ దేవగన్‌ సరసన కథానాయికగా నటిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఎక్కువగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రకుల్‌ ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది….

‘నేను ఇప్పటి వరకు కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కోలేదని గతంలో చెప్పాను. అది నా వ్యక్తిగత విషయానికి సంబంధించినది. నా అనుభవం చెప్పానే తప్ప ఇతరుల గురించి కాదు. కొందరు గేమ్‌ ఆడుతుంటారు. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళ గురించి నేను పట్టించుకోను. ఇండిస్టీలో నాకు గొప్ప అనుభవం ఉంది. నీపై వందకోట్ల బడ్జెట్‌ పెట్టడానికి ఎవరూ రెడీగా లేరంటే నువ్వు చాలా ఈజీ గర్ల్‌ అని అర్థం. ఇక్కడ చివరకు మాట్లాడేది మన ప్రతిభ గురించే. ఆ విషయాన్ని నూతన తరానికి చెప్పదలిచాను. ఏదో ఒకటి రెండు సంఘటనలను చూసి నిరాశ చెందవద్దు. దేనికైనా కొంత సమయం పడుతుంది. అన్నింటికంటే ముందు మనల్ని మనం నమ్మాలి. ఇది అవకాశాల ప్రపంచం. ప్రతిభ ఉంటే ఎవరైనా సరే ఇక్కడ రాణించగలరు. ఈ క్రమంలో మనం వెళ్తున్న దారి చాలా ముఖ్యమైనది. కొంతమంది మనల్ని అడ్వంటేజ్‌గా తీసుకోవాలనుకుంటారు. దీనికి మనం ఎలా రెస్పాండ్‌ అవుతున్నామనేది చాలా కీలకం. ఏదిఏమైనా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి’ అని రకుల్‌ చెప్పింది. తమిళంలో సూర్యతో ‘ఎన్‌జీకే’ చిత్రంలోను, కార్తీ, శివకార్తీకేయన్‌ చిత్రాల్లో నటిస్తూ రకుల్‌ బిజీగా ఉంది.