ప్రతి రోజు షూటింగ్‌కు హాజరు కావడమే గొప్ప వరం !

రకుల్‌ప్రీత్‌సింగ్  తాజాగా చిత్రసీమలో కథానాయికల మధ్య వున్న పోటీ గురించి తనదైన శైలిలో వ్యాఖ్యానించింది . రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రతి మాటలో ఆత్మవిశ్వాసం ప్రతిధ్వనిస్తుంటుంది. తన మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేయడం ఈమె నైజం.ప్రతి రంగంలో పోటీ మామూలే. మన ప్రతిభకు అనుగుణంగా అవకాశాలు దక్కుతాయి. ఈ విషయంలో నేను ఎక్కువగా ఆలోచించను. కెరీర్ ఆరంభంలో వున్న వర్ధమాన నాయికలు కూడా తమ ప్రతిభతో భారీ చిత్రాల్లో అవకాశాల్ని దక్కించుకుంటున్నారు.పోటీ గురించి ఆలోచిస్తుంటే వృత్తిపై ఏకాగ్రత లోపిస్తుంది. ప్రతి రోజు షూటింగ్‌లకు హాజరయ్యే అదృష్టం దక్కడమే గొప్ప వరంగా భావిస్తాను. నాకు లభించిన పాత్రలకు పరిపూర్ణంగా న్యాయం చేయాలన్నదే నా సిద్ధాంతం. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో నాకంటూ మంచి గుర్తింపు ఉంది. మరికొన్నేళ్లు ప్రేక్షకుల విశ్వాసంతో కెరీర్‌ను కొనసాగించాలనుకుంటున్నాను అని చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్. ప్రస్తుతం ఈ సుందరి తమిళంలో సూర్య కథానాయకుడిగా ‘ఎన్‌జీకే’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. సెల్వరాఘవన్ దర్శకుడు.

 అన్నీ విజయం సాధించాలంటే కుదరదు !

‘నా సినిమాలు సక్సెస్‌ అయినా అవకపోయినా కళ, వృత్తి పట్ల నాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. నాకు ఇప్పటి వరకు వచ్చిన మంచి సినిమాలు, అవకాశాలకు కృతజ్ఞురాల్ని. నేను నటించిన ప్రతి సినిమాకు 100శాతం న్యాయం చేయడమే నా బాధ్యత’ అని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ చెప్పింది. ఓ సినిమా విజయం, అపజయం నటీనటులు, దర్శక, నిర్మాతల చేతుల్లో ఉండదని రకుల్‌ అన్నారు. నటించిన ప్రతి సినిమా విజయం సాధించాలంటే కుదరదని, సినిమా అపజయం పొందినప్పుడు ఎందుకు అలా అయ్యిందని ప్రజలు నన్ను ప్రశ్నిస్తుంటారని పేర్కొంది. బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాకు జోడీగా రకుల్‌ నటించిన చిత్రం ‘అయ్యారి’. నీరజ్‌ పాండే దర్శకుడు. ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం గురించి రకుల్‌ మాట్లాడుతూ ‘ఇది నా హృదయానికి చేరువైన సినిమా. నీరజ్‌తో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధమే. ఈ సినిమా తీయడానికి మేమంతా చాలా కష్టపడ్డాం. ఓ సినిమాకు ఆదరణ లభించడం, లభించకపోవడం యూనిట్‌ సభ్యులపై ఆధారపడి ఉండదు. ఓ నటిగా నా పాత్ర నుంచి ఏం కోరుకున్నారో దాన్ని ఇవ్వగలిగా. అదే నాకు ముఖ్యం’ అని తెలిపింది. ఎక్కువగా బాధపడి, నిరాశ చెందాల్సిన అవసరం లేదని, సానుకూలతపైనే నా దృష్టి పెడతానని చెప్పింది. తన సామర్థ్యంపై నమ్మకం ఉంచి, ఇంకా కష్టపడతానని, అప్పుడు తన ఫెయిల్యూర్‌కు ఇబ్బందులు ఎదురౌతాయి’ అని చెప్పింది రకుల్‌