ఖాళీగా కూర్చోలేక.. హీరోలతో డ్యూయెట్లు పాడేస్తున్నా !

ఒక చిత్రం జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. అయితే ఆ చిత్రంలో నేను నటించిన పాత్ర నాకు పేరు తెచ్చిపెడుతుందా? లేదా? అన్నది నేను గ్రహించగలను. ఒకరితో కొన్ని నిమిషాలు మాట్లాడితే చాలు వారి అంతరంగమేమిటో ఇట్టే అర్థం చేసుకోగలను. అలాంటి నేను చిత్ర కథలో సత్తా ఉందా? లేదా? అన్నది తెలుసుకోగలను. నేను ఈ రంగంలోకి వచ్చి చాలా సంవత్సరాలైంది. ఆ అనుభవంతో చెబుతున్నాను”….అని అంటోంది అందాల నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌.ప్రస్తుతం తమిళంలో సోదర ద్వయం సూర్య, కార్తీలతో ఒక్కో చిత్రం చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో ఒక చిత్రం, హిందీలో ఒక చిత్రం చేస్తోంది. అయితే మునుపుటంత జోష్ లేకపోయినా వచ్చే అవకాశాలను బట్టి బండి నడిపేస్తోంది. 
కథ, పాత్రల విషయంలో మాత్రం నా లెక్కలు ఎప్పుడూ తప్పలేదు. మంచి కథ అని నేను భావించిన చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. కథలను ఎంపిక చేసుకోవడంలో నేనెప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను. పరిస్థితుల కారణంగాకొన్ని మంచి చిత్రాలు కూడా అపజయం పొందాయి. ఒక నటిగా నా దృష్టి ఎప్పుడూ మంచి కథాపాత్రలపైనే ఉంటుంది. అయితే అన్ని వేళలా నేను ఆశించిన కథా పాత్రలు రావడం లేదు. దీంతో ఇంట్లో ఖాళీగా ఎందుకు కూర్చోవాలి. అందుకే స్టార్‌ హీరోలకు జంటగా కమర్శియల్‌ కథా చిత్రాల్లో డ్యూయెట్లు పాడి నటించేస్తున్నాను. అయితే ఇకపై విరామం తీసుకుని అయినా మంచి కథా పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నాను” అని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అంటోంది.
ఈ నెల 10న రకుల్‌ పుట్టిన రోజు. రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తున్న తాజా చిత్రాల్లో దేవ్‌ ఒకటి. కార్తీతో జతకట్టిన ఈ చిత్రానికి సంబంధించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ పాత్ర సన్నివేశాలు శనివారంతోనే పూర్తి అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్‌ షూటింగ్‌ స్పాట్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్‌ పుట్టినరోజు వేడుకను వేడుకగా నిర్వహించారు. ఈ బ్యూటీ పెద్ద కేక్‌ను కట్‌ చేసి చిత్ర యూనిట్‌ వర్గాలతో తన ఆనందాన్ని పంచుకుంది రకుల్‌.
అందరి కళ్లు నాపై ఉంటాయి
రెండు భాగాలుగా రాబోతున్న ‘యన్‌.టి.ఆర్‌’ చిత్రంలో శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన రకుల్ ప్రీత్ సింగ్…
“లెజెండ్ శ్రీదేవి పాత్ర పోషించడమనేది సాధారణ విషయం కాదని, ఈ పాత్ర తనకెంతో సవాలుతో కూడుకున్న పాత్ర అని చెప్పింది. తాను కూడా శ్రీదేవి అభిమానినే అని, తనపై నమ్మకముంచి ఈ పాత్ర ఇచ్చినందుకు.. అది పెద్ద భాద్యత అయినప్పటికీ న్యాయం చేస్తాననే నమ్మకముందని చెప్పింది. శ్రీదేవి గురించి తెలిసిన వారిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని, ఆమె నటించిన సినిమాలు చూసి.. ఈ పాత్ర కోసం సిద్దమవుతున్నానని చెప్పుకొచ్చింది. తొలిసారి శ్రీదేవి పాత్రలో తెరపై కనిపించనుంది కాబట్టి.. అందరి కళ్లు తనపై ఉంటాయనే విషయం తెలుసని చెప్పింది. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవడం తనకు సంతోషంగా ఉందని వెల్లడించింది.