పూరి మూసలో రామ్ మాస్ షో … ‘ఇస్మార్ట్ శంక‌ర్’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.25/5

పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ పతాకం పై పూరి జ‌గ‌న్నాథ్‌ దర్శకత్వం లో పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు

కధలోకి వెళ్తే… శంక‌ర్ (రామ్‌) ప‌క్కా తెలంగాణ బ‌స్తీ కుర్రాడు. అత‌ని మాట తీరు, వేష‌భాష‌లూ అన్నీ అలాగే ఉంటాయి. అత‌నికి త‌న కాకా (మ‌ధుసూద‌న్ రావు) ఎంత చెబితే అంత‌. ఏది చెబితే అంత‌. కాకా చెప్పాడ‌ని మాజీ మంత్రి కాశీ విశ్వ‌నాథ్ (పునీత్ ఇస్సార్‌) ను చంపేస్తాడు. అత‌ను ఇచ్చిన డ‌బ్బుతో త‌ను ప్రేమించిన చాందిని (న‌భా న‌టేష్‌)ను తీసుకుని గోవాకు వెళ్తాడు. అక్క‌డ వారిద్ద‌రూ ఉండ‌గా కొంద‌రు సీబీఐ ఆఫీస‌ర్లు అటాక్ చేస్తారు. చాందిని క‌న్నుమూస్తుంది. శంక‌ర్ త‌ప్పించుకుని హైద‌రాబాద్ వ‌చ్చేస్తాడు. చాందినిని ఎవ‌రు చంపారు? ఎందుకు చంపారు? అసలు కాకాకు కాశీ విశ్వ‌నాథ్‌ను చంప‌మ‌ని ఎవ‌రు పుర‌మాయించారు? అనేది తెలుసుకోవాల‌ని శంక‌ర్ తాప‌త్ర‌యం. ఆ క్ర‌మంలో ఉండ‌గానే అత‌నికి జ‌మాల్ ఆచూకి తెలుస్తుంది. అత‌న్ని వెతుక్కుంటూ శంక‌ర్‌తో పాటు సీబీఐ ఆఫీస‌ర్ అరుణ్ (స‌త్య‌దేవ్‌) కూడా వ‌స్తాడు. కాల్పుల్లో అరుణ్ క‌న్నుమూస్తాడు. శంక‌ర్‌ గాయ‌ప‌డ‌తాడు. అరుణ్ గ‌ర్ల్ ఫ్రెండ్ సారా (నిధి అగ‌ర్వాల్‌) న్యూరో సైంటిస్ట్. తాను చేసిన ప‌రిశోధ‌న‌ను ఉప‌యోగించి అరుణ్ జ్ఞాప‌కాల‌ను శంక‌ర్ బుర్ర‌లోకి చిప్ రూపంలో ఎక్కిస్తుంది. అప్ప‌టిదాకా ఎలుక‌ల మీద మాత్ర‌మే ప్ర‌యోగించిన ఆ ప‌రిశోధ‌న శంక‌ర్ మీద ప‌నిచేస్తుందా? అరుణ్ జ్ఞాప‌కాల‌న్నీ శంక‌ర్ మ‌దిలోకి వ‌చ్చి, అత‌ను ఏం చేశాడు? సారా చేసిన ప్ర‌యోగం ఫ‌లించిందా? ఇంత‌కీ మాజీ మంత్రి కాశీ విశ్వ‌నాథ్‌ను చంప‌మ‌ని ఎవ‌రు పుర‌మాయించారు? అస‌లు సీఎం ధ‌నుంజ‌య్‌కీ, అత‌ని మామ రామ్మూర్తి (ఆశిష్ విద్యార్థి)కి ఈ హ‌త్య‌తో ఉన్న సంబంధం ఏంటి? ఆఖ‌రికి కాశీ విశ్వ‌నాథ్ భార్య (తుల‌సి) శంక‌ర్‌కు ఏం పుర‌మాయిస్తుంది? వ‌ంటివ‌న్నీ సెకండాఫ్‌లో తెలుస్తాయి.

విశ్లేషణ… హీరో రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌.. ఇద్దరూ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ హీరోలు అన‌గానే.. మాస్ లో ‘మహామాస్‌’గా ఉంటారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ ఫక్తు పూరీ మార్కు సినిమా. మ‌నిషి మెద‌డులో చిప్ పెట్టి, అత‌ని జ్ఞాప‌కాల‌ను మ‌రో వ్య‌క్తి బుర్ర‌లోకి పంప‌డం ఈ చిత్రంలో చూపించినంత తేలికైన విష‌య‌మా?… డాటా ట్రాన్స్ ఫ‌ర్ ఎంత లోడ్ అయిందో చూపించ‌గ‌లుగుతామా? మెమరీ ట్రాన్స్‌ఫర్‌ అనే కాన్సెప్ట్‌ని 2016లో వచ్చిన ‘క్రిమినల్‌’ అనే అమెరికన్‌ సినిమా నుంచి తీసుకుని దాన్ని తన పధ్ధతిలో తీసాడు పూరి జగన్నాథ్‌. ఆ కాన్సెప్ట్‌ ఒక్కటీ తీసేస్తే… ఇటీవల వచ్చిన పూరి సినిమాలకి, దీనికీ పెద్ద తేడా ఉండదు. కథనం విషయంలో మాత్రం తన రొటీన్‌ స్టైల్‌నే ఫాలో అయ్యాడు.పూరి తన మూస ఫార్ములా నుంచి ఇంకా బయటపడలేదనే చెప్పాలి. పూరీ ఇటీవల తీసిన సినిమాలతో పోలిస్తే కాస్త మెరుగు.ద్వితియార్థంలో స్టోరీని ముందుకి తీసుకెళ్లే ఆసక్తికరమైన పాయింట్‌ వుండదు. విలన్స్‌ ట్రాక్‌ మహా వీక్‌ . హీరోయిన్‌ ట్రాక్‌ని పొడిగించడానికి, మరో రెండు పాటలు జోడించడానికి ఈ ‘డబుల్‌ సిమ్‌ కార్డ్‌’ కాన్సెప్ట్‌ ఉపయోగపడిందే తప్ప కథనాన్ని ఆసక్తికరంగా మార్చలేదు.
 
పూరి జగన్నాథ్‌ తన కథకి, సన్నివేశాలకీ ప్రేక్షకులను ఆకట్టుకునే లక్షణాలు లేవు కనుక.. తన హీరోని మాత్రం నమ్ముకున్నాడు. అతని క్యారెక్టరైజేషనే సినిమాని నడిపించడానికి వాడుకున్నాడు. ఇది ఇస్మార్ట్‌ శంకర్‌కి ప్లస్ అయ్యింది.సినిమాలోని మైనస్ లు అన్నింటినీ ఓవర్‌ లుక్‌ చేయగలిగేంత విలక్షణమైన కాలక్షేపాన్ని హీరోరామ్ అందించాడు.రామ్ గెట‌ప్‌, యాక్టింగ్‌, శ్లాంగ్‌..మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌..డ్యాన్సులు,ఫైట్స్.. ఇందులో స్పెషాలిటి. పాయింట్ ప‌రంగా కొత్త‌దిగా అనిపించిన‌ప్ప‌టికీ, సాదాసీదాగా ఉన్న క‌థ‌, స్క్రీన్ ప్లే ఆస‌క్తిని క‌లిగించ‌క‌పోవ‌డం,ఎమోష‌న్ లేక‌పోవ‌డం.. ఇందులో మైనస్.పూరీ ఇటీవల తీసిన సినిమాలతో పోలిస్తే కాస్త మెరుగు.
 
నటవర్గం… ఇప్ప‌టిదాకా మిల్కీ బోయ్‌గా క‌నిపించిన రామ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` గా మాస్‌ గెటప్ లుక్ లో బావున్నాడు. తెలంగాణ యాస‌లో రామ్ చెప్పిన కొన్ని సామెత‌లు థియేట‌ర్లో ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ లుక్ కూడా ఆక‌ట్టుకుంటుంది. చాందిని పాత్ర‌లో న‌భా న‌టేష్‌, సారా పాత్ర‌లో నిధి అందాల ఆర‌బోత‌కు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. హుషారైన పాత్ర‌లో న‌భా త‌న‌వంతు బాగానే చేసింది.నభా నటేష్‌ సగటు పూరీ మార్కు హీరోయిన్‌లా ‘రౌడీయిజం’ చూపిస్తూ అలాంటి పాత్రలు నచ్చే వారిని ఆకర్షించింది. నిధి అగర్వాల్‌ పాసివ్‌ రోల్‌ పోషించింది. ఒక‌వైపు ప్రియుడి పోయిన‌ప్పుడు, మ‌రోవైపు అప్ప‌టిదాకా కాపురం చేసిన శంక‌ర్ మీద పోలీసులు దాడిచేసిన‌ప్పుడు… నిధిలో ఎమోష‌న్స్ పండ‌లేదు. ఒక ర‌క‌మైన బ్లాంక్ ఫేస్‌తో క‌నిపించింది. మరో కీలక పాత్రలో నటించిన సత్యదేవ్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా గుర్తుండిపోయే పాత్రలో అలరించాడు. షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి బాగా నటించారు.
 
సాంకేతికంగా… పూరి జగన్నాథ్‌ మాస్‌, యూత్‌ ఆడియన్స్‌ను అలరించే డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మణిశర్మ మ్యూజిక్‌ సినిమాకు ప్రధానబలం.తన పని అయిపోయిందనుకునే వారికి ఇంకా తనలో ఎంత ‘పనితనం’ వుందో చూపించాలనే కసితో పని చేసి మణిశర్మ తన సంగీతంతో శంకర్‌ని నడిపించాడు.తన సంగీతంతో ప్రతీ సీన్‌ను మరింతగా ఎలివేట్ చేశాడు. పాటలు బాగున్నా.. కథలో ఇరికించినట్టుగా ఉన్నాయి.రాజ్ తోట‌ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. జునైద్ సిద్ధికీ ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి       – రాజేష్