రామ్ ‘రెడ్’ తేలిపోయింది !…. ‘రెడ్’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.25/5

శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై  కిషోర్ తిరుమల దర్శకత్వంలో  స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధాంశం… సిద్ధార్థ్‌(రామ్‌ పోతినేని) ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఎండీ. తన ఆఫీసుకు పక్కనుండే సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో పనిచేసే అమ్మాయి మహిమ(మాళవికా శర్మ)ను చూసి ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ కావాలని అనుకుంటారు. మరో వైపు ఆదిత్య(రామ్‌ పోతినేని) మోసాలు చేస్తూ బతుకుతుంటాడు. ఇద్దరి జీవితాలు భిన్నంగా వెళుతుంటాయి. అయితే అనుకోకుండా ఆకాశ్‌ అనే యువకుడిని ఒకరు హత్య చేస్తారు. దొరికిన ఫొటో ఆధారంగా పోలీసులు హ‌త్య చేసింది సిద్ధార్థ్ అని నిర్ధారణకు వచ్చి అరెస్ట్‌ చేస్తారు. పాత పగను మనసులో పెట్టుకున్న సీఐ(సంపత్‌) మాత్రం ఒకవేళ సిద్ధార్థ్‌ తప్పు చేయకపోయినా, అతన్ని కేసులో ఇరికించి శిక్ష పడేలా చేయాలని అనుకుంటాడు. అదే సమయంలో ఆదిత్యను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. ఇద్దరూ ఒకేలా ఉండటంతో ఇద్దరి బ్యాగ్రౌండ్స్‌ను పోలీసులు చెక్‌ చేస్తారు. కేసు పురోగ‌తిలోనూ అనుమానించే అంశాలేవీ దొరకవు. దాంతో ఇద్దరినీ కోర్టు నిర్దోషులుగా కోర్టు వదిలేస్తుంది. అయితే కేసుని డీల్‌ చేసిన ఎస్సై యామిని(నివేదా పేతురాజ్‌)కి అదే సమయంలో అనుకోని నిజం ఒకటి తెలుస్తుంది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇంత‌కీ యామినికి తెలిసిన నిజ‌మేంటి? మ‌రి ఆకాశ్‌ను చంపింది ఎవరు?  సిద్ధార్థ్‌, ఆదిత్య మధ్య సంబంధం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమాలో చూడాలి…

విశ్లేషణ… రామ్‌, కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ఇది. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన సినిమా ‘తడం’ కు ఇది రీమేక్‌. తమిళ మాతృకను తెలుగులోకి రీమేక్ చేసినప్పటికీ  సందర్భానుసారం మంచి డైలాగ్స్‌ రాశాడు కిషోర్‌. కథలో ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ.. సినిమా స్లోగా రన్‌ అవుతూ సెకండ్‍ హాఫ్‍ నిరాశపరుస్తుంది. ఇన్వెస్టిగేషన్‍ కార్యక్రమాన్ని దర్శకుడు పట్టుగా తీయలేకపోవడంతో థ్రిల్లర్‍ సినిమా కాస్తా చప్పబడిపోయింది. హీరో తల్లి సోనియా అగర్వాల్‍ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సుదీర్ఘంగా సాగడంతో ఎమోషన్‍ పండకపోగా బోర్‍ కొట్టిస్తుంది. క్లైమాక్స్ లో వివరంగా చెప్పాల్సిన విషయాలను..పైపైన చెప్పేసి ముగించడం, ట్విస్ట్ ఎఫెక్టివ్‍గా ప్రెజెంట్‍ చేయలేకపోవడంతో సినిమా తేలిపోయింది.

నటీనటులు… మూస ఫార్ములాకు వ్యతిరేకంగా రామ్ ఈ సినిమా చేసాడు‌. అయితే అతని ప్రయోగం ఫలించలేదు. తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన రామ్‌ ఆదిత్య, సిద్ధార్థ్‌ పాత్రల్లో చక్కటి వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. సిద్దార్థ్‌ పాత్రలో క్లాస్‌గా కనిపించిన రామ్‌.. ఆదిత్య పాత్రలో ఊర మాస్‌గా అలరించినా.. ఇది అతని ఇమేజ్‍కి, ఎనర్జీకి తగ్గ కథ కాదు. సిన్సియర్‌ ఎస్సై యామినిగా నివేదా పేతురాజ్ బాగా చేసింది. మాళవికా శర్మ  తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా మెప్పించింది. మాళవిక శర్మ‌-రామ్ రొమాన్స్  బాగుంది. ఇక అమృతా అయ్యర్‌ పాత్ర చిన్నదే అయినా బాగా చేసింది. సత్య ఇంగ్లీష్‍ను ఖూనీ చేస్తూ చేసే కామెడీ బాగానే పండింది. సంపత్‌, పోసాని కృష్ణమురళి, సోనియా అగర్వాల్‌ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికం… ఈ సినిమాకి ప్రధాన బలం మణిశర్మ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కు కీలకంగా ఉండే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో తన పనితనంతో సన్నివేశాలను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లాడు. పాటల విషయానికి వస్తే.. హెబ్బాపటేల్‌ ఐటెమ్‌ సాంగ్‌ మాస్‌ను ఆకట్టుకుంటుంది. ‘నువ్వే నువ్వే’ పాట బాగుంది. సినిమా మూడ్‍కి తగ్గట్టే సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది – రాజేష్