మెగాస్టార్ ‘ఆచార్య’ లో చేసేది రామ్‌చరణే !

‘మెగాస్టార్’ చిరంజీవి కొత్త సినిమా ‘ఆచార్య’లో ప్రత్యేక పాత్రకు ముందు రామ్‌చరణ్‌నే అనుకున్నారు. కానీ మధ్యలో మహేష్ బాబు పేరు తెరపైకి వచ్చింది. కానీ నాటకీయ పరిణామాల మధ్య అతడి పేరు వెనక్కి వెళ్లిపోయింది. మహేష్ మరీ ఎక్కువ పారితోషికం అడగడంతో, బడ్జెట్ పెరిగిపోతుందని భావించి అతడి పేరును పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రామ్‌చరణ్ నటించబోతున్నారని ఖాయం అయ్యింది. చరణ్‌ని ఈ సినిమాలో నటింపజేసేందుకు అనుమతించాలని.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి నెల రోజుల పాటు అతడికి విరామం ఇవ్వాలని దర్శకుడు రాజమౌళిని చిరంజీవి అడగితే.. అందుకు ఆయన అంగీకరించారట. కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాక.. చరణ్ నేరుగా ‘ఆర్ ఆర్ ఆర్’ సెట్స్‌కు వెళ్లకుండా ‘ఆచార్య’ కోసం పని చేస్తారని అనుకుంటున్నారు. ఈ సినిమాలో తమవి తండ్రీ కొడుకుల పాత్రలు కావనీ… గురు శిష్యుల్లా ఉంటామని చిరు అంటున్నారు. చరణ్ చేయబోయే పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుందని, చిరంజీవి ఇంతకుముందే వెల్లడించారు. తామిద్దరం కలిసి నటించాలని తన భార్య సురేఖ కోరుకున్నట్లు కూడా చిరంజీవి చెప్పారు.
 
ఈ ప్రత్యేక పాత్రకు ఒక దశలో ఈ పాత్రకు అల్లు అర్జున్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ ఏం జరిగిందో ఏమో… చిరు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినపుడు మాత్రం.. ముందు నుంచి చరణ్ పేరే చర్చల్లో ఉందన్నారు. మహేష్ పేరు ఎలా ప్రచారంలోకి వచ్చిందో తెలియదన్నారు. రాజమౌళి, కొరటాల మధ్య అవగాహన కుదిరితే చరణ్ ఈ సినిమాలో నటిస్తాడని చెప్పారు. ఇంతకుముందు చరణ్ నటించిన ‘మగధీర’, ‘బ్రూస్ లీ’ సినిమాల్లో చిరు కాసేపు కనిపించారు. చిరంజీవి చేసిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంలో చరణ్ ఒక పాటలో తళుక్కుమన్నారు. అయితే వీళ్లిద్దరూ కలిసి పూర్తి స్థాయిలో ఈ చిత్రంలో నటిస్తున్నారు.
 
సుజిత్‌ దర్శకత్వంలో ‘లూసీఫర్‌’
మోహన్‌లాల్‌ హీరోగా మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించిన సూపర్‌హిట్‌ మూవీ ‘లూసీఫర్‌’ తెలుగులో రీమేక్‌ కానుంది. ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ తెలుగు రీమేక్‌ హక్కులను రామ్‌చరణ్‌ దక్కించుకున్నారు. ఇందులో చిరంజీవి హీరోగా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు?.. అనే ప్రశ్నకు సమాధానంగా సుకుమార్, హరీష్‌ శంకర్‌ ఇలా కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా యువ దర్శకుడు సుజిత్‌ పేరు వినిపిస్తోంది. ‘లూసీఫర్‌’ తెలుగు స్క్రిప్ట్‌ను రెడీ చేయాల్సిందిగా సుజిత్‌కు చిరంజీవి చెప్పారట. ఇంతకు ముందు శర్వానంద్‌ ‘రన్‌ రాజా రన్‌’, ప్రభాస్‌ ‘సాహో’ చిత్రాలకు సుజిత్‌ దర్శకత్వం వహించారు.