ఫట్ మని కొట్టి ‘టేక్ ఓకే’ చేసింది !

నదియ…   ” కొట్టే సన్నివేశంలో నటించడం నా వల్ల కాదు. వేరేవరినైనా చూసుకోండి ” అంటూ విసిగిపోయిన నదియ ‘సూపర్‌డీలక్స్‌’ చిత్రం నుంచి వైదొలిగింది. అన్ని సార్లు మరో నటుడి చెంప చెళ్లు మనిపించి నదియ అలా చేసిందేంటబ్బా? అనుకుంటున్నారు కదా… 90 కాలం కథానాయకి నదియ. ఆ తరువాత కథానాయకి పాత్రలకు రాజీనామా చేసి అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తోందిప్పుడు. ఈమె చాలా గ్యాప్‌ తరువాత తమిళంలో ఒక చిత్రానికి కమిట్‌ అయ్యింది. విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘సూపర్‌డీలక్స్‌’ ఒకటి. ‘అరణ్యకాండం’ చిత్రం ఫేమ్‌ త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి సమంత నాయకి. ముఖ్యమైన పాత్రల్లో దర్శకుడు మిష్కిన్, నదియ నటిస్తున్నారు.
 
ఈ చిత్రంలో మిష్కన్‌ను నదియ కొట్టే సన్నివేశం చోటు చేసుకుంటుందట. ఆ సన్నివేశం సహజంగా ఉండాలని మిష్కిన్‌ నిజంగానే కొట్టమని నదియకు చెప్పారు. దీంతో ఆమె కూడా ఆయన్ని నిజంగానే కొట్టింది. అయితే అలా 56 సార్లు నదియ కొట్టినా ఆ సన్నివేశం బాగా రాలేదు. రెండు రోజుల పాటు అదే సన్నివేశాన్ని చిత్రీకరించారట. దీంతో విసిగిపోయిన నటి నదియ ఇకపై ఆ కొట్టే సన్నివేశంలో నటించడం తన వల్ల కాదు. వేరేవరినైనా చూసుకోండి అంటూ చిత్రం నుంచి వైదొలిగింది.
 
కాగా నదియతో అన్ని సార్లు కొట్టించుకున్న మిష్కిన్‌ కూడా వేసారిపోయి తానూ నటించను… అంటూ నటించడం తెలియని వారిని ఎందుకు ఎంపిక చేస్తారు? అని నదియ సమక్షంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారట. నదియ ‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రం నుంచి వైదొలగడానికి కారణం ఇదేనట. కాగా ఆమె పాత్రలో నటి రమ్యకృష్ణను ఎంపిక చేసారు. ఆమె మిష్కిన్‌ను కొట్టే సన్నివేశాన్ని రెండే రెండు టేక్‌ల్లో ఓకే చేసేసిందట. ఇప్పుడు ఈ న్యూసే దక్షిణాది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.