రాబోయే ఎన్నికలకు రానా కానుక !

శేఖర్ కమ్ముల ‘లీడర్’ సీక్వెల్ తీసేందుకు సిద్ధమయ్యాడు. రానా హీరోగా చేసిన తొలి చిత్రం ‘లీడర్’  బాక్సాఫీస్ వద్ద  హిట్ కొట్టడంతో  అతనికి మంచి పేరు వచ్చింది. దర్శకుడు శేఖర్ కమ్ముల రాష్ట్ర రాజకీయాల్లోని లొసుగుల్ని ఎత్తి చూపి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆతర్వాత రానా విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు . అటు హీరోగా ఇటు విలన్‌గా కూడా చేస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో బాలీవుడ్‌లో కూడా తనదైన ముద్ర వేశాడు. తాజాగా మరోసారి రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే సంచలన కథతో రానా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శేఖర్ కమ్ముల ‘లీడర్’ సీక్వెల్ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు  రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం.  ‘లీడర్ 2’ కథ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించేలా ఉంటుందని తెలిసింది. శేఖర్ కమ్ముల ఇప్పటికే ఈ సినిమా కథను రానాకు వినిపించగా ఆయన కొన్ని చిన్న మార్పులను సూచించినట్టు తెలిసింది. అవి చేసి సెప్టెంబర్ నుంచి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
 
గుణశేఖర్‌, రానా కాంబినేషన్‌లో ‘హిరణ్య’
‘రుద్రమదేవి’ సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు గుణశేఖర్‌, ఈ సారి పౌరాణిక కథ మీద వర్క్‌ చేస్తున్నారు. మహా భక్తుడు ప్రహ్లాదుడి కథను హిరణ్య కశిపుడి కోణంలో రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నా ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయట. ఈ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్స్‌పై  దాదాపు 180కోట్లతో నిర్మాత సురేశ్‌బాబు నిర్మించబోతున్నట్లు వినికిడి. రానా హిరణ్యకశ్యపుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమాపై సురేష్‌ బాబు క్లారిటీ ఇచ్చారు…
గుణశేఖర్‌, రానా కాంబినేషన్‌లో ‘హిరణ్య’ చిత్రం రూపొందుతుందని వెల్లడించారు. ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌ జరుగుతుందని చెప్పిన సురేష్‌, సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళుతుందన్న విషయం ఇప్పుడు చెప్పలేమన్నారు.