‘సోషల్‌ మీడియా’ మంచీ చెడూ చెప్పే రానా వెబ్‌ సిరీస్‌

రానా ‘బాహుబలి’ తర్వాత ఎంచుకున్న కథలు కూడా విభిన్నంగా ఉంటున్నాయి. మొన్న తీసిన ‘ఘాజీ’..ఇప్పుడు వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’…ఇవన్నీ ఇప్పుడు వెండితెరపై చూశాం. రానా ఇప్పుడు కొత్తగా వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు. అదీ కూడా ఓ సామాజిక అంశమే. కేవలం చిన్న క్లిక్‌ చేస్తే ప్రపంచం అంతా మన ముందు ఉంచేది ఇంటర్నెట్‌. దాని వల్ల కొందరు తమకు కావాల్సిన విధంగా ఉపయోగించుకుని ఉన్నతంగా ఎదుగుతున్నారు. మరికొందరు జీవితాలనే నాశనం చేసుకున్నవారూ ఉన్నారు. సామాజిక మీడియా బాగా పెరిగిన తర్వాత ప్రస్తుతం యువతంతా పెడదోపడుతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ఇలా సోషల్‌ మీడియా వల్ల లాభం పొందిన వారి..నష్టపోయిన వారి కోణాల గురించి రానా తన వెబ్‌ సిరీస్‌లో చెప్పబోతున్నారు. దీనికి ‘సోషల్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విభిన్న వృత్తులకు చెందిన నలుగురు వ్యక్తులు ఓ అమ్మాయి అదృశ్యమైతే ఎలా ఛేదిస్తారన్నది ఇందులో కథ. ఇది మొత్తం సోషల్‌ మీడియా చుట్టూనే తిరుగుతుంది. డిజిటల్‌ స్టీరింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ ‘విఐయు’ ద్వారా టెలీకాస్ట్‌ కానుంది. ఈ సిరీస్‌ మొత్తం 13 ఎపిసోడ్‌లు. ఈనెల ఎనిమిది నుంచి ప్రచారం కానుంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. శశి సుడిగాల దర్శకత్వం వహిస్తున్నారు. వాక్‌డౌట్‌ మీడియా, గురు ఫిల్మ్‌ నిర్మిస్తున్నాయి. రానా కూడా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్‌ ద్వారా స్ఫూర్తి పొందిన వ్యక్తిగా అరాధన ఉప్పల్‌ చేస్తుంది. అబ్దుల్‌ రజాక్‌, మౌని ఖాన్‌, ప్రీతి, అశ్రాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ” ఇది నా మొదటి డిజిటల్‌ ఫిక్షన్‌. ఈ సిరీస్‌ సామాజిక అవగాహన కల్పిస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నా. ఓ విభిన్నమైన జెనర్‌లో చేసిన ప్రయోగంలో నేను భాగం కావడం ఆనందంగా ఉంది. సోషల్‌ మీడియాలో ఏది నిజం? ఏది అబద్ధం? … వంటి అంశాలపై అవగాహన పరచాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు.