వారు తీసుకున్న రిస్క్ కు భారీ లాభాలొచ్చాయి !

గ్రాండ్ ఇండియన్ మూవీ ‘బాహుబలి’‌లో ప్రతినాయకుడి పాత్ర పోషించే వరకూ దగ్గుబాటి రానాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కసారిగా ఆ మూవీతో దేశవ్యాప్తంగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. కేవలం ఆ ఇమేజ్ కారణంగానే అతను సోలో హీరోగా నటించిన ‘ఘాజీ’ చిత్రం సైతం ఇతర భాషల్లో విడుదలై విజయాన్ని కైవసం చేసుకుంది. అలాంటిది రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకు పైసా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించాడట. ఎలాంటి హీరో, దర్శకుడైనా డబ్బుల విషయం దగ్గరకు వచ్చే సరికీ సేఫ్ గేమ్ ఆడుతుంటారు. కానీ కొందరు మాత్రమే సబ్జెక్ట్ మీద నమ్మకంతో రిస్క్‌కు రెడీ అవుతారు.

 ఒక్క రానా మాత్రమే కాదు, దర్శకుడు తేజ సైతం అదే పని చేశాడట. ఇటీవల కాలంలో తన చిత్రాలన్నీ పరాజయంకావడంతో… ‘నేనే రాజు నేనే మంత్రి’కి  రెమ్యూనరేషన్ తీసుకోకుండా వర్క్ చేశాడట. సినిమా సక్సెస్ అయ్యి లాభాలు వస్తేనే, తనకు అందులో కొంత వాటా ఇవ్వమని కోరాడట.

ఇప్పుడు వారు తీసుకున్న రిస్క్… ఆయనకు, హీరో రానాకు కోట్ల రూపాయలను అందించబోతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన లాభాలను లెక్కచూసిన నిర్మాతలు ఇటు రానాకు, అటు తేజ‌కు చెరొక ఐదు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చే ఆస్కారం ఉందని సినీజనం చెప్పుకుంటున్నారు.’నేనే రాజు నేను మంత్రి’ సినిమాతో దర్శకుడు తేజ, హీరో రానా జాక్ పాట్ కొట్టినట్టే అనుకుంటున్నారు.

అంతేకాదు, ఈ సినిమా విషయంలో కొత్త నిర్మాతలకూ, సురేష్ బాబు కూ  భారీ లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ఫిల్మ్ మేకింగ్ మీద ప్యాషన్‌తో భరత్ చౌదరి, కిరణ్ రెడ్డీ ఈ సినిమాతో నిర్మాతలుగా మారారు. సురేశ్ బాబు సహకారంతో నిర్మితమైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో, ఈ ముగ్గురికీ తలో ఐదు కోట్లు మిగులుతాయని తెలుస్తోంది. మొత్తం మీద జోగేంద్ర. తన వాళ్ళందరికీ భారీ లాభాలు తెచ్చిపెట్టాడు.