నటనంటే నాకు పిచ్చి.. నా మీద నాకు నమ్మకం!

రణ్‌వీర్‌ సింగ్‌ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా బాలీవుడ్ లో స్టార్‌ హీరో స్థానానికి చేరుకున్నాడు. ఎన్నో వైవిధ్య పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తున్న ర‌ణ్‌వీర్ సింగ్ తాజాగా ‘క‌పిల్ దేవ్’ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నాడు. తన సామర్ధ్యాన్ని నిరూపించుకొని సూపర్ స్టార్ గా మారిన ర‌ణ్‌వీర్ సింగ్ ఎదుగుదల చాలా మందికి ఆదర్శం. ఎనిమిది సంవత్సరాల్లో వరుస హిట్ల తో సంచలనం సృష్టిస్తున్న నటుడు ర‌ణ్‌వీర్ . ‘బ్యాండ్ బాజా బారాత్’, ‘రామ్ లీలా’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’, ‘గల్లీ బాయ్’ లాంటి చిత్రాలలో గుర్తుండిపోయే పాత్రలు పోషించి, ర‌ణ్‌వీర్ సింగ్ జనాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
 
ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో కనపడనున్నాడు ర‌ణ్‌వీర్. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ’83’ , యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ‘జయేష్ భాయ్ జోర్దార్’, కరణ్ జోహార్ స్వీయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘తఖ్త్’ లాంటి చిత్రాలు చేస్తూ ప్రేక్షకులకు ఇంకా చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నాడు .మొదట్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నాడు రణ్‌వీర్‌ సింగ్‌. నటించే అవకాశాలు లేక పని కోసం పరితపించే రోజుల్ని గుర్తు చేసుకోవడమే తన పెదవులపై చిరునవ్వుని చిగురింప జేస్తోందని చెప్పాడు ర‌ణ్‌వీర్ సింగ్.
‘నాకు రేపు అనేది లేదు.. ఈ రోజే ఆఖరు’
‘ఆ రోజుల్లో నేను ఇచ్చిన కొన్ని ఆడిషన్లు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఎందుకంటే.. ‘నాకు రేపు అనేది లేదు.. ఈ రోజే ఆఖరు’ అని అనుకుంటూ ఆడిషన్స్‌ చేసేవాడిని. దాంతో నాకు ఊపిరి సలపని సందర్భాలు చాలా ఉన్నాయి.అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేను అన్నింటినీ వినియోగించుకునేవాడిని.ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని అనుకునేవాడిని.‘బ్యాండ్‌ బజా బరాత్‌’ తర్వాత ఓ ప్రముఖ దర్శకుడు నన్ను ఆడిషన్‌కు పిలిచి.. తాగుబోతు డ్యాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించమన్నాడు.మనస్ఫూర్తిగా డ్యాన్స్‌ చేయడం ప్రారంభించాను. ఎంతో ఉద్రేకంతో డ్యాన్స్‌ చేయడం తో…ఊపిరి ఆడటం కష్టంగా మారింది. ఆదర్శకుడు నా డ్యాన్స్‌ చూసి ఎంతో ప్రశంసించాడు’
 
గడిచిన ఆ రోజులు నా జీవితంలో మధురస్మృతులు. కఠిన పరీక్షలు, నిరాశ..అవమానాలు..నిరాకరణ అన్నింటిని చూశాను. నాకు అవకాశాలు వస్తాయా అని ఆలోచించేవాడిని. మిమ్మల్ని సెలక్ట్‌ చేశాం రండి’ అంటూ ఎవరైనా నాకు ఫోన్‌ చేస్తారని ఎదురుచూస్తూ..ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోలేదు. నాకు నేనే ధైర్యం చెప్పుకునే వాడిని. ఆ సమయంలో రెండు విషయాలను బాగా నమ్మేవాడిని’ …‘ఒకటి.. నటన పట్ల నాకున్న పిచ్చి.. రెండు నా మీద నాకున్న నమ్మకం.
సంపాదన, పేరు కోసం నేను సినిమాల్లోకి రాలేదు. అందుకే ఎప్పుడు నాకు నేను ఒకటే చెప్పుకునేవాడిని… “నువ్వు మంచివాడివి.పట్టుదల కల్గిన వాడివి. ఏదో రోజు నీకు మంచే జరుగుతుంది”.. అని నాకు నేనే చెప్పుకునేవాడిని. ఈ రోజు నాకు వస్తోన్న ప్రతి అవకాశాన్ని విలువైనదిగానే భావిస్తాను’ అన్నాడు రణ్‌వీర్‌ సింగ్‌.