ఇద్దరికీ ‘ఓకే’ అయినప్పుడు, మధ్యలో మీ గొడవేంటి ?

‘అవకాశాలు ఇస్తాం’ అంటే ఆశపడి వెళ్లాక మళ్లీ గోలపెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తోంది రష్మి. ఎంత బోల్డ్‌గా నటిస్తుందో, అంతే బోల్డ్‌గా మాట్లాడుతుంది రష్మీ. ఎదుటివాళ్లు ఏమనుకుంటారు? అనే భయాలు లేకుండా, మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. రష్మీ టాలీవుడ్‌లో కొన్నాళ్లుగా సంచలనం అవుతోన్న కాస్టింగ్ కౌచ్ పైనా పెదవి విప్పింది.
‘అంతకుమించి’ సినిమా ప్రమోషన్స్‌లో రష్మీకి ‘కాస్టింగ్ కౌచ్’ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకి చాలా ఘాటు సమాధానాలు ఇచ్చింది రష్మీ…. ‘కాస్టింగ్ కౌచ్’ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే లేదని, ప్రతీ రంగంలో ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉందని చెప్పింది. అయినా ఇద్దరికీ ఓకే అయినప్పుడు దాన్ని కాస్టింగ్ కౌచ్ అనలేమని, ఆ బంధాన్ని వాళ్లు ఎంజాయ్ చేసినప్పుడు,మధ్యలో చూసినోళ్లు గొడవచెయ్యడం ఎందుకని ప్రశ్నించింది. అంతేకాదు ‘అవకాశాలు ఇస్తాం’ అంటే ఆశపడి వెళ్లాక మళ్లీ గోలపెట్టాల్సిన అవసరం ఏమిటని సూటిగా ప్రశ్నించింది.
రష్మీ ‘కాస్టింగ్ కౌచ్’పై తనకు ఎదురైన సంఘటనలనూ వివరించింది. తనకు ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదని, కేవలం రెమ్యునరేషన్ విషయంలోనే నిర్మాతలతో భేదాభిప్రాయాలు వచ్చాయని తెలిపింది. అంతేకాదు కాస్టింగ్ కౌచ్‌కు సహకరిస్తేనే అవకాశాలు వస్తాయనుకోవడం కూడా తప్పేనని, దేనికైనా ‘నో’ అనే ఒక ఆప్షన్ ఉంటుందని, దాన్ని కరెక్ట్ టైమ్‌లో ఉపయోగించుకుంటే …తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదని తేల్చేసింది. మరి రష్మీ మాటలను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ఎంతమంది అర్థంచేసుకుంటారో చూడాలి.
ఎంచుకోవడంలో ఆమె ఫెయిలైంది !
రష్మి గౌతమ్ ముందు ఆమె సినిమాల్లో నటించింది కానీ, అక్కడ సరైన బ్రేక్ రాలేదు. దీంతో ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్‌కు యాంకర్ అయింది. అక్కడ ఆమెకు తిరుగులేని పేరొచ్చింది. ఈ పాపులారిటీతో మళ్లీ సినిమా అవకాశాలు అందుకుంది. అయితే మొదట్లో మాదిరి సైడ్ క్యారెక్టర్లు చేయకుండా ‘గుంటూరు టాకీస్’ సినిమాలో ప్రధాన కథానాయికగా నటించిన రష్మి… ఇందులో హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో రష్మీకి మంచి అవకాశాలు వచ్చాయి. కానీ వచ్చిన అవకాశాల్లో సరైనవి ఎంచుకోవడంలో ఆమె ఫెయిలైంది. ఆ తర్వాత ఆమె చేసినవన్నీ తన హాట్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించినవే తప్ప… విషయం ఉన్నవేవీ లేవు. దీంతో రష్మి వేగంగా పడిపోయింది. తాజాగా రష్మి హాట్ హాట్ అందాలతో నటించిన ‘అంతకుమించి’  విడుదలై నిరాశ మిగిల్చింది.