నాతో పాటు నా అభిమానులూ గర్వపడాలి !

రష్మిక మందన్న…”పెద్ద సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశం రావడాన్ని నా అదృష్టమనుకోవడం లేదు. నా కష్టానికి వచ్చిన గుర్తింపు అనుకుంటున్నాను. కష్టపడే తత్త్వమే నన్ను ఈ స్థాయికి చేర్చిందనుకుంటున్నాను”… అని అంటోంది .
“నాలో ఓ సుగుణముంది. ఎవరైనా ఏదైనా నాకు రాదని అంటే బాధపడను… తిరిగి వారినేమీ అనను. చేసి చూపిస్తా! దాని కోసం ఎంతైనా కష్టపడతాను. అలాగే, నాకొచ్చిన సక్సెస్ నాకు కెరీర్ పరంగా ఉపయోగపడింది తప్పిస్తే… వ్యక్తిగతంగా నాకు ఏ విధంగా ఉపయోగపడలేదు. నా కెరీర్ కారణంగా వచ్చిన విజయాల్ని నేను తలకెక్కించుకోను. ఇవాళ నాకు వచ్చిన సక్సెస్ రేపు నా చేతుల నుండి జారిపోకుండా మాత్రమే నేను ప్రయత్నిస్తాను.
ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టలేను
వెండితెర మీద గ్లామర్ పండించటానికి చాలామంది పోటిపడుతున్నారు. నటన – ఛాలెంజింగ్ రోల్స్ వేయడానికి తక్కువ పోటీ ఉంది అందుకే ఈ దారిలో వెళ్తున్నా. స్కిన్ షో చేయడమే గ్లామర్ కాదని నా ఉద్దేశం. అందంగా కనిపిస్తూ.. మన నటనతో అభిమానుల్ని ఆకట్టుకోవడం కూడా గ్లామరే !. అయితే, అలా తక్కువ అవకాశాలొస్తాయి. అయినా భయపడను… నా పంథా వదులుకోను.
కమర్షియల్‌ చిత్రాల్లో చెయ్య మని చాలామంది అడుగుతుంటారు. వచ్చిన ప్రతి సినిమానూ అంగీకరించడం లేను. సత్తా లేని పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టలేను. అందుకే వాటిని చేయనని చెబుతుంటాను. నా స్థానంలో ఉండి చూస్తే.. నేనెందుకు అలా అంటోంది మీకు అర్థం అవుతుంది. కమర్షియల్‌ చిత్రాల్లోనే నటించుకుంటూపోతే కొంతకాలమే ఉండగలను. ‘ఎన్ని సినిమాలు చేశాను? ఎంత కాలం ఉన్నాను’ అనేదాని కన్నా.. నేను నటించిన చిత్రాలను చూసి నాతో సహా నా అభిమానులూ గర్వపడాలి. అందుకే సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్త పడుతున్నా .
 
ఆయనతో వెండి తెరని పంచుకోవాలి
‘గీతగోవిందం’ విజయంతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక తెలుగుతోపాటు కోలీవుడ్‌పై కూడా ఫోకస్‌ చేసింది. ఇప్పటికే కార్తీ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అగ్ర కథానాయకుడు విజయ్ సినిమా కోసం రష్మికని తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. అలాగే అజిత్‌ కొత్త సినిమాలోనూ రష్మికని ఎంపిక చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట.
“అజిత్‌ అంటే చాలా ఇష్టం. ఆయన నటన చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. ఆయనతో వెండి తెరని పంచుకోవాలనుకుంటున్నా. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా” అని రష్మిక తెలిపింది. రష్మిక ప్రస్తుతం మహేష్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్‌లో ‘భీష్మ’, అల్లు అర్జున్‌ తో సుకుమార్‌ చిత్రంలోను చేస్తోంది. రష్మిక తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ కార్తీతో ‘సుల్తాన్‌’ లో నాయికగా నటిస్తోంది. అలాగే కన్నడలో ‘పొగరు’ లో నటిస్తూ బిజీగా ఉంది.