తీరిక లేకుండా పని చేయడమన్నది ఓ వరం !

కన్నడ భామ రష్మిక ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ రేసులో పరుగెడుతోంది.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న `సరిలేరు నీకెవ్వరు`లో ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటివరకు రష్మిక తెలుగులో చేసిన `ఛలో`,`గీతగోవిందం`,`డియర్ కామ్రేడ్` వంటి సినిమాల్లో ఆమెకు హీరోతో సమానమైన పాత్రలు దక్కాయి. పాటలు, గ్లామర్ షోకు మాత్రమే పరిమితమైపోకుండా రష్మిక నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక… తాను పూర్తి కమర్షియల్ సినిమాలకు చాలా దూరమని చెప్పింది.“ఒక సినిమాకు హీరో, హీరోయిన్ ఇద్దరూ ముఖ్యమే. అలా ఉంటేనే సినిమా బాగుంటుంది. అయితే కమర్షియల్ సినిమాల్లో మాత్రం హీరోయిన్ పాత్ర బొమ్మలాగే ఉంటుంది. కమర్షియల్ చిత్రాల్లో నటించమని తమిళం నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే అలాంటి సినిమాల్లో నటించేందుకు నేను సిద్ధంగా లేను. సినిమాల సంఖ్య కంటే ఎలాంటి సినిమాల్లో నటించామనేదే నాకు ముఖ్యం. పాటల కోసమే హీరోయిన్ అనే సినిమాల్లో నేను నటించను. నేను ఇలా చెప్పడం చాలా మంది దర్శకులకు నచ్చకపోవచ్చు. నా వైపు నుంచి ఆలోచిస్తే వారికి అర్థమవుతుంద”ని రష్మిక చెప్పింది.
 
విడుదలకు ముందు ఆందోళన
వరుస సినిమాలతో చాలా బిజీగా, ఒత్తిడిగా అనిపిస్తోందని తెలిపింది. ఒక్కోసారి తెల్లవారుజామున సెట్‌కు వెళ్తే తిరిగి పడుకునే సరికి తెల్లారిపోయేదని, మరుసటి రోజు మళ్లీ సెట్‌కి వెళ్లాల్సి వచ్చేదని, దీంతో తిండి, నిద్ర కూడా కరువయ్యేదని తెలిపింది. అయితే ఇలా తీరిక లేకుండా పని చేయడమన్నది ఓ వరమని, తాను కూడా అలాగే ఉండాలని ఆశించినట్టు రష్మిక తెలిపింది. అయితే సినిమాలో తన నటన ప్రేక్షకులకు నచ్చుతుందా? తన కష్టం ఫలిస్తుందా, లేదా? అని సినిమా విడుదలకు ముందు చాలా ఆందోళన పడుతున్నానని రష్మిక తెలిపింది.
 
మాతృభాష మాట్లాడడం కష్టమా ?
విజయ్‌దేవరకొండతో నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో ఇటీవల తెరపైకి వచ్చింది. మిశ్రమ స్పందనతో చిత్రం ప్రదర్శింపబడుతోంది. ఇకపోతే ఈ చిత్ర ప్రమోషన్‌ కోసం రష్మిక విజయ్‌దేవరకొండ, చిత్ర యూనిట్‌తో కలిసి నాలుగు రాష్ట్రాల్లోనూ చుట్టేసింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్నారు. ఏ భాషలో నటించడం కష్టం అనిపిస్తోందన్న మీడియా వాళ్ల ప్రశ్నకు ఏ మాత్రం ఆలోచించకుండా… కన్నడ భాషలో మాట్లాడి నటించడం కష్టం అనిపిస్తోందని టక్కున చెప్పింది. అంతే బుక్కయ్యిపోయింది. అలా చెప్పి సొంత రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యింది. ‘మాతృభాషను మాట్లాడడం కష్టంగా ఉందంటావా?’ అంటూ కన్నడ సంఘాలు రష్మికపై మండిపడుతున్నారు.