రాబోయే సినిమాల్లో రియల్ రష్మికను చూస్తారు !

రష్మిక మందన్న… “తెలుగులో ఇప్పటి వరకూ నేను చేసింది మూడు సినిమాలు మాత్రమే! రెండు సినిమాలు బాగా ఆడాయి. ఒకటి యావరేజ్‌గా ఆడింది. అంత మాత్రాన నేనో స్టార్‌ హీరోయిన్ని అయిపోయాననీ అనుకోవడం లేదు. టాలీవుడ్‌లో నా జర్నీ ఇంకా చాలా ఉంది”…. అని అంటోంది ‘ఛలో’, ‘గీత గోవిందం’ నాయిక రష్మిక.
రొమాంటిక్‌ సన్నివేశాలలో నటించాలంటే సిగ్గుతో వంకర్లు తిరిగిపోతాను. ఇన్ని అవలక్షణాలున్నా నన్నో పెద్ద హీరోయిన్‌గా చూస్తుంటే నమ్మశక్యం కావడంలేదు. నాకున్న వాటిని వదిలించుకోవాలనుకుంటాను కానీ కుదరడం లేదు. నిజం చెప్పాలంటే నా నటన నాకే సరిగా నచ్చదు, నా ప్రతి సినిమాతో నటనలో చాలా మెలుకువలు నేర్చుకుంటున్నాను. నటనపై ఇంకా నాకు చాలా పట్టు రావాల్సి ఉంది. నన్ను ఎవరైనా స్టార్‌ హీరోయిన్‌ అంటే నవ్వు వస్తుంటుంది.
హీరోయిన్‌గా అన్ని పాత్రలూ చేయాలనుంది. విలనీగా చేయాలన్నది నా కోరిక. విలనీగా అంటే చెడ్డ విలనీ కాదు, మంచి విలనీ అన్నమాట. అందర్నీ చితకొట్టాలనుంది. నా రూపం అందుకు సహకరించదేమో అన్న అనుమానం మీకు అక్కర్లేదు. ‘నా నటనతో అందర్నీ మెప్పించగలను’ అన్న నమ్మకముంది. ఇప్పటి వరకు నేను కొత్త కాబట్టి, జస్ట్ డైరెక్టర్స్ ఎలా చెప్తే అలాగే నటించాను. నటనలో నా స్టయిల్‌ అంటూ ఏదీ ఏర్పర్చుకోలేదు. ఇప్పుడు నా మీద నమ్మకం పెరిగింది. దానికి తోడు కొంత అనుభవం కూడా వచ్చింది. నా తరువాతి సినిమాల్లో రియల్ రష్మికను చూస్తారు.
 
గ్లామర్‌ పేరుతో అర్ధనగ్నంగా కనిపించడానికి నేను ఎప్పుడూ వ్యతిరేకమే! మోడ్రన్ డ్రస్సులు వేసుకుంటాను కానీ అసభ్యంగా కనిపించకూడదు. నా సినిమాను అందరూ కుటుంబంతో కలిసి చూడాలి. అలా కనిపించడానికే నేను ఇష్టపడతాను.నన్ను నమ్మి సినిమాలు ఇచ్చేవారున్నారు. నా కోసమే పాత్రలు రాసే రచయితలూ ఉన్నారు. అలాంటప్పుడు భయపడడం ఎందుకు? నా అవకాశాలు నాకు వస్తాయి.