‘క్రాక్’ ఇచ్చిన ఊపులో యమ జోరుమీదున్నాడు !

రవితేజ ‘కిక్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో బ్రహ్మాండమైన కామెడీ తో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఆ కామెడీ.. రొటీన్ గా,అతిగా.. మారిపోయేసరికి ‘కిక్ 2’ వంటి డిజాస్టర్లు వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాడు. దానికి తోడు, కుర్రాడిలా కనబడాలని అతిగా డైటింగ్ చేసి ఘోరమైన ఆకారం లోకి  మారిపోయాడు. పైగా రెమ్యునరేషణ్ విషయంలో పట్టిన పట్టు విడవటం లేదని చెప్పుకున్నారు. దానితో రవితేజ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. అయితే…

రవితేజ మొన్న సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్’ సంచలన విజయం సాధించి మరోసారి అతనికి బ్రేక్ ఇచ్చింది. దాదాపు 38 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఓటిటి లో విడుదలై అక్కడా సంచలనం సృష్టించింది. ‘క్రాక్’ ఇచ్చిన ఊపులో వరస సినిమాలకు కమిట్మెంట్ ఇస్తున్నాడు మాస్ మహా రాజా. రవితేజ మళ్లీ  ఫామ్ లోకి వచ్చి, ఇప్పుడు అరడజను సినిమాలతో యమ జోరుమీదున్నాడు. ఇప్పటికే ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నాడు. రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇలా ఉండగానే మరో మూడు సినిమాలకు కూడా కమిటయ్యాడు.

త్రినాథరావు నక్కిన సినిమాను ఈ మధ్యే అధికారికంగా ప్రకటించారు. అభిషేక్ అగర్వాల్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో లాయర్ గా నటించబోతున్నాడు రవితేజ. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. రవితేజ ఎనర్జీకి తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందంటున్నాడు దర్శకుడు త్రినాథరావు.

ఈ సినిమాతో పాటు కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు ఓకే చెప్పాడు. ఇది కూడా పక్కా కమర్షియల్ సినిమా. ఇప్పుడు మరో సినిమాకు కూడా రవితేజ ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మారుతి సినిమా సైతం ఓకే చేసినట్లు తెలుస్తోంది. గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ అయిపోయిన తర్వాత రవితేజ సినిమా మొదలు కానుంది. ఇక తాజాగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు కమిటయ్యాడు రవితేజ. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘రక్ష’ లాంటి సినిమాలతో వంశీకృష్ణ ఆకెళ్ళ గుర్తింపు తెచ్చుకున్నాడు. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కోసం గతంలో రానా, బెల్లంకొండ శ్రీనివాస్ ను అనుకున్నాడు ఈ దర్శకుడు. వాళ్లు నో చెప్పడంతో మాస్ రాజా దగ్గరికి ఈ ప్రాజెక్టు వచ్చింది. వీళ్ళతో పాటు బోయపాటి శ్రీనుతోనూ రవితేజ సినిమా ఉంటుందనే టాక్ వస్తోంది.