ఖాన్ల కన్నా అక్షయ్ కుమార్ టాప్ హీరో !

బాలీవుడ్‌లో టాప్ హీరోలు ఎవరంటే ఆమిర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటూ ఖాన్‌ త్రయం పేర్లను చెప్పేస్తారు. అదేంటో మరి, సల్మాన్ ఖాన్ మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇస్తున్నాడు. తమ ముగ్గురు ఖాన్ల కన్నా అక్షయ్ కుమార్ స్టార్ హీరో, టాప్ హీరో అని పొగిడేస్తున్నాడు. దానికి కారణం లేకపోలేదు. మరి, అక్షయ్ కుమార్ స్టార్ హీరో ఎందుకు అవుతాడో సల్మాన్ ఖాన్ చెప్పిన కారణాలేంటో తెలుసా..? ఆమిర్ ఖాన్, షారూక్ ఖాన్, తానూ ఏడాదిలో కొన్ని సినిమాలు మాత్రమే చేస్తామని అన్నాడు సల్మాన్. తాను ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేసుకుంటూ పోతుంటే.. ఆమిర్ మాత్రం మూడేళ్లకో సినిమా చేస్తుంటాడని, కాబట్టి వాళ్లు, తాను స్టార్ హీరోలం ఎలా అవుతామని, అదే అక్షయ్ విషయానికొస్తే ఏడాదిలో అలవోకగా ఐదారు సినిమాలు చేసేస్తుంటాడని చెప్పాడు. కాబట్టి అతడే స్టార్ హీరో అని అన్నాడు.
         ఏడాది పొడవునా అంతలా కష్టపడి, అంత డబ్బు సంపాదించి, చాలా నిర్మాణ సంస్థలను ఆర్థికంగా నిలబెడుతూ, డైరెక్టర్లకు చేతి నిండా పని కల్పించే వ్యక్తే నిజమైన స్టార్ హీరో అని అక్షయ్ కుమార్‌ను పొగిడాడు. అయితే తానూ ఒకప్పుడు అంతే కష్టపడేవాడినని, ఇప్పుడు అక్షయ్ కుమార్ చేస్తున్నాడని అన్నాడు. దీనిపై స్పందించిన అక్షయ్ కుమార్.. ఒకప్పుడు ఐదారు లక్షల రూపాయల కోసమే ఎన్నో సినిమాలను చేసేవారని, మరిప్పుడు కోట్లు వస్తుంటే ఇంకెన్ని సినిమాలు చేయాల్సి ఉంటుందని అన్నాడు. కానీ, కోట్లు వస్తున్నా కొన్ని సినిమాలే చేస్తున్నామని అన్నాడు. రెండు నెలలకోసారి ఓ మంచి సినిమాతో వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అన్నాడు. ఓ సినిమా తీయడానికి 60 రోజులు చాలా ఎక్కువని అభిప్రాయపడ్డాడు. అయితే.. మునుపటి చిత్రం కన్నా తర్వాత వచ్చే చిత్రం మరింత మంచిగా ఉండాలని అన్నాడు. అది తన ఆలోచన మాత్రమేనని, ప్రస్తుతం తాను ఏడాదికి రెండున్నర సినిమాలు చేస్తున్నానని, వచ్చే ఏడాది నుంచి మూడు సినిమాలు చేస్తానని అన్నాడు.