ఒకే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నా !

నా పది సంవత్సరాల కెరీర్‌లో చాలా మలుపులు ఉన్నాయి. అవేవీ నన్ను స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి తీసుకెళ్ళలేదనే చెప్పాలి. నన్ను నేను నిరూపించుకోవడానికి ఒకే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఆ రోజు తప్పనిసరిగా వస్తుందనే అనుకుంటున్నాను.ఎంతో ఇష్టంతో నటిని అయ్యాను. బాధపడడానికి నో ఛాన్స్. కెరీర్‌ ప్రారంభంలో తెలిసీ తెలియక చేసిన కొన్ని తప్పుల కారణంగా స్టార్‌ డమ్‌కి దూరంగా ఉన్నాననే విషయం తెలుసుకున్నాను. ఇక నుంచి కెరీర్‌ తప్ప మరో ఆలోచన చేయను.

కెరీర్‌ ప్రారంభంలోనే ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఆ సమయంలో సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను. నా తప్పులను నేను గుర్తించేసరికి సమయం మించిపోయింది. ఇక ఇప్పుడు ప్రేమా, పెళ్ళి జోలికి వెళ్ళదలుచుకోలేదు. మా ఇంట్లో కూడా అదే చెప్పేశాను. కొన్ని రోజుల వరకూ నా జోలికి రావద్దన్నాను. ఇప్పుడు నా దృష్టంతా కెరీర్‌ మీదే! తెలుగు, తమిళం ఏ భాషలోనైనా సరే మంచి విజయాన్ని అందుకోవాలి.తెలుగులో ‘అ’ తరువాత మరో సినిమా ఒప్పుకోలేదు. కథలు వింటున్నాను అంతే! తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను.

ప్రేక్షకుల్లో వచ్చే స్పందన కోసం ఎదురుచూస్తున్నా!

‘2017 గొప్ప సంవత్సరం కాదు. కానీ 2018 ఆశించిన స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నా’ అని అంటోంది రెజీనా. గతేడాది తమిళంలో మూడు సినిమాలు, తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. సందీప్‌ కిషన్‌ సరసన ‘నక్షత్రం’, నారా రోహిత్‌కి జోడీగా నటించిన ‘బాలకృష్ణుడు’ చిత్రాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో గతేడాది ఎలా సాగిందనే ప్రశ్నకు రెజీనా స్పందిస్తూ… ‘నిజం చెప్పాలంటే 2017 నా కెరీర్‌కు గొప్ప ఏడాది కాదు. నా సినిమాలు ఆశించిన ఫలితాన్విలేదు. కానీ 2018 ఆశించిన స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నా. ఈ ఏడాది నేను పనిచేసిన కొన్ని చిత్రాలు నటిగా నాలో పరిణతికి తోడ్పడ్డాయి. ఇప్పటి వరకు నేను పోషించిన పాత్రలతో పోల్చితే ఇప్పుడు చేస్తున్నవి చాలా విభిన్నంగా ఉంటాయి. నా పాత్రలు చూసిన తర్వాత ప్రేక్షకుల్లో వచ్చే స్పందన కోసం ఎదురుచూస్తున్నా. తెలుగు సినిమా ‘అ!’లో నేను మాదక ద్రవ్యాలకు బానిసైన అమ్మాయిగా కనిపిస్తాను. ఈ పాత్ర కోసం నా జుట్టును షార్ట్‌ కట్‌ చేసుకున్నా. ఇది నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను’ అని చెప్పింది.