లెస్బియన్ల జీవితాలను అంగీకరించాలి !

రెజిన కాసాండ్ర… “బాలీవుడ్‌లో చేసిన ‘ఏక్‌ లడఖీ కో దేఖాతో ఐసా లగా’ నాకు మంచి పేరును తెచ్చి పెట్టింది. ఒక నటిగా ఎలాంటి పాత్రను అయినా చేయగలగాలి. అందుకే ఇలాంటి పాత్రను ఎంచుకున్నాను. మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం. కాలం మారుతోంది. లెస్బియన్ల జీవితాలను అంగీకరించాలి”….అని అంటోంది దక్షిణాదిలో పలు చిత్రాలు చేసి, బాలీవుడ్ లో ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రెజిన కాసాండ్ర. తొలి చిత్రం ‘ఏక్ లడఖీ కో దేఖాతో ఐసా లగా’ లోనే లెస్బియన్ గా చేసి సంచలనం సృష్టించింది.
ఎవరు ఎలా జీవించాలని కోరుకుంటే వారిని అలా జీవించనివ్వాలి. సుప్రీంకోర్టే హిజ్రాలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇప్పుడిప్పుడే సమాజంలో మార్పు వస్తోంది అనడానికి కారణం ఈ సినిమాకు దక్కుతున్న ఆదరణే !
నటిగా ఒక ప్రాంతానికో, ఒక భాషకో, ఒకేరకమైన పాత్రలకో పరిమితం కావాలని నేను అనుకోవడం లేదు. లెస్బియన్లు సమాజంలో ఓ భాగం. అలాంటప్పుడు వారి జీవితాలను ప్రతిబింబించే పాత్రలో చేయడంలో తప్పేముంది? ఇది ఓ ప్రయోగాత్మక సినిమా. అన్ని సినిమాలు వారి చుట్టూ తిరిగేవిగా ఉండవుగా! ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఆ సినిమాలో నేనూ ఓ భాగం కావడం ఆనందంగా ఉంది.
పిల్లల అభిప్రాయాలకు విలువనివ్వాలి !
లెస్బియన్‌ పాత్ర చేసే సమయంలో వారి జీవితాల గురించి కొంత వరకూ తెలుసుకున్న తరువాతే షూటింగ్‌లో పాల్గొన్నాను. నటించేటప్పుడు టెన్షన్‌ పడలేదు కానీ, ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని కొద్దిగా టెన్షన్‌ పడ్డాను. సినిమాకీ, నా పాత్రకు వస్తున్న రెస్పాన్స్‌ చూసిన తరువాత నా టెన్షన్‌ ఎగిరిపోయింది.
స్వలింగ సంపర్కాన్నినేనే కాదు, ఎవరూ సమర్ధించాలని చెప్పను. తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలకు విలువనివ్వాలి. గౌరవించాలి. అప్పుడు ఇదొక సమస్యగా అనిపించదు. దురదృష్టవశాత్తు మన దేశంలో తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలకు పెద్దగా విలువ ఇవ్వరు. దానితో సమస్యలు మొదలవుతాయి.