షూటింగ్‌ జరిగినన్ని రోజులు నేను స్నానం చేయలేదు !

ఈ మధ్య ‘అ!’లో రెజీనా పోస్టర్‌ టాలీవుడ్‌ డైరక్టర్‌ రాజమౌళిని సైతం అట్రాక్ట్‌ చేసిందట.కొన్నిసార్లు ఫొటోలు చూడగానే చాలా ఆసక్తిగా అనిపిస్తాయి.  ఈ ఫొటో చూడగానే రాజమౌళి ‘‘ఈ అమ్మాయి ఇప్పుడప్పుడే ఇంకేం సినిమాలు చేయదా? ఇంతగా టాటూలు వేయించుకుంది?’’ అని ఆయన విస్తుపోయారట. అందరి దృష్టినీ ఆకట్టుకున్న ‘అ!’ సినిమాలోని బ్యాక్‌లుక్‌ గురించి రెజీనా తమిళ మీడియాతో చాలా విషయాలు చెప్పుకొచ్చారు….

‘‘వైవిధ్యమైన హెయిర్‌ స్టైల్‌, చేతుల మీద గ్యాప్‌ లేనంతగా టాటూలు వేయించుకుని సినిమాలో నటించాలని ముందుగా నాకు కేరక్టర్‌ చెప్పేటప్పుడే వివరించారు. దాంతో షూటింగ్‌ ముందురోజే నేను హైదరాబాద్‌కి చేరుకున్నా. ఆ హెయిర్‌ స్టైల్‌ పూర్తి చేసి, వెనుక వైపు జుట్టు కట్‌ చేసి, డైమండ్‌ షేప్‌లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుని, ఆ తర్వాత చేతి వేళ్ల వరకు టాటూలు డిజైన్‌ చేయడానికి సరిగ్గా 24 గంటలు పట్టింది. అందులోనూ అప్పటికి వీపుమీద చెట్టు వేయనేలేదు. దానికి ఇంకా మరింత సమయం పట్టిందనుకోండి. మొదటి రోజు సాయంత్రం నాలుగు గంటలకు మొదలైన హెయిర్‌స్టైల్‌, టాటూ ప్రక్రియ మరుసటి రోజు అదే సమయానికి పూర్తయింది. మధ్యలో నేను రెండు గంటలు నిద్రపోయాననుకోండి. ఆ లుక్‌తో మొదటి షెడ్యూల్‌లో నాలుగు రోజులు షూట్‌ చేశాను. అలా మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఆ షూటింగ్‌ జరిగినన్ని రోజులు నేను స్నానం చేయలేదు. కేవలం స్పాంజ్‌ బాత్‌ చేశానంతే. కొన్నిసార్లు మనం నమ్మి చేసే పాత్రల కోసం అంతగా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే ప్రేక్షకుల ప్రశంసలు దక్కుతాయి’’ అని వివరించారు రెజీనా

‘థాంక్స్‌ రెజీనా.. ఫర్‌ ది కోఆపరేషన్‌’

 రెజీనా కోలీవుడ్‌లో అడపాదడపానే మెరుస్తోంది. ఎక్కువగా తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తుందని అపవాదు కోలీవుడ్‌ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం రెజీనా ‘మిస్టర్‌ చంద్రమౌళి’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.

ఈ సినిమాలో సీనియర్‌ నటుడు కర్తీక్‌, ఆయన కొడుకు గౌతమ్‌ కర్తీక్‌ కలిసి నటించడం విశేషం. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పార్టు ప్రణాళిక వేగంగా జరుపుకుని గురువారంతో పూర్తి చేసుకుంది. ఈ సినిమాను సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత ధనుంజయన్‌ తెలిపారు. షూటింగ్‌ పూర్తి అయిన సందర్భంగా చిత్ర యూనిట్‌ కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

కేక్‌పై ‘థాంక్స్‌ రెజీ ఫర్‌ ది కోఆపరేషన్‌’ ఒన్‌ మోర్‌ డే ప్లీజ్‌ అంటూ పేర్కొనడం విశేషం.  ఈ సందర్భంగా నిర్మాత ధనుంజయన్‌ మాట్లాడుతూ.. వృతిపై భక్తి కలిగిన నటి రెజీనా అని పేర్కొన్నారు. అంకితభావంలోనూ, నటనలనూ తనకు సాటి తనేనని పొగిడారు. ఈ చిత్రానికి ఆమె సహకారం చాలా ఉందని  నిర్మాత చెప్పారు.