అప్పల్రాముడు వెళిపోయేడు – సీతారాముడ్ని మనకొదిలేసి!

తెలుగుసాహిత్యకారుల్లో అరుదైన సాహిత్యవ్యక్తిత్వం కారామాస్టారిది! ఏ ఉద్దేశంతో ఓ విమర్శకుడు కారామాస్టారిని ‘యజ్ఞం’ కథలోని అప్పల్రాముడు, సీతారాముడు పాత్రలతో పోల్చేడో గానీ ఒక రకంగా అది నిజమే! మాస్టారు ఎల్లప్పుడూ వ్యక్తిగా అప్పల్రాముడు, రచయితగా సీతారాముడు!
మాస్టారిలో సీతారాముడు రూపుదిద్దుకున్నాక సామూహిక జీవన చిత్రణ ఆరంభమయ్యింది. గ్రామీణ వ్యవసాయక జీవనాల కథనం ఆరంభమయ్యింది. సంఘటనలు మాత్రమే కాదు సంఘటనల చరిత్రను కథనం చేయడమారంభమయ్యింది. జీవితచిత్రణ మాత్రమే కాదు ఆ జీవితాల సంచలనాల కారణాలను వెలికితీయడమారంభమయ్యింది.
‘యజ్ఞం’ కథ ద్వారా తెలుగు కథాలోకాన్ని సంచలనానికి గురిచేసిన కథారచయిత కాళీపట్నం రామారావు శుక్రవారం నాడు తన తొంభయ్యవ యేట యీ లోకాన్నుంచి నిష్క్రమించేరు. కాళీపట్నం రామారావు అన్న పూర్తిపేరుతో కంటే కారా అనే సంక్షిప్త నామంతో యెక్కువమందికి తెలుసు. అతి తక్కువ కథలు రాసి అతి యెక్కువ చర్చకు గురయిన కథకులు రామారావు. రాయటం మానేసి దాదాపుగా మూడు దశాబ్దాలవుతున్నా వర్తమాన సాహిత్యలోకంలో నిత్యమూ కదలాడే కథకులు రామారావు. తొలితరం వామపక్ష రచయితలయిన చాసో, రావిశాస్త్రి, కొ.కు. నుంచి నేటిదాకా సుదీర్ఘకాలంపాటు కథాసాహిత్యరంగంలో నిలవడమే గాక కథకు ఒక నీడ అవసరమని గ్రహించి ‘కథానిలయం’ కట్టినవాడు. కథను తన ఉచ్ఛ్వాస, నిశ్వాసలుగా జీవించినవాడు, కవి ఛాయరాజ్‌ అన్నట్టు ‘కథ’ అంటే మీరు ‘కారా’?. ఔను…కథ అంటే – కారా యే! ఔనౌనౌను కారా…యే! మరో మూడేళ్లు భౌతికంగా వుండుంటే వందేళ్ల కథకు వందనాలని అనేది లోకం! మరో మూడేళ్లే కాదు తెలుగు కథ వున్నన్నాళ్లూ కారా వుంటారు!
కారా సాహిత్యం మీద జరిగినంత చర్చ తెలుగుకథకుల్లో మరే కథకుడిమీదా జరగలేదు. కారాని మార్క్సిస్టని కొందరూ, కాదు గాంధేయవాది అని మరి కొందరూ, శిల్పం అనేది వుండదని కొందరూ, గుప్తమే శిల్పమని యింకొందరూ, ‘యజ్ఞం’ రాసిన్నాడు సీతారాముడు కానీ యిప్పుడు (కథానిలయం నిర్మించాక) అప్పల్రాముడు అనీ యిలా కారా సాహిత్యాన్నీ, వ్యక్తిత్వాన్నీ వ్యాఖ్యానించింది లోకం! తెలుగుసాహిత్యకారుల్లో అరుదైన సాహిత్యవ్యక్తిత్వం కారామాస్టారిది! ఏ ఉద్దేశంతో ఓ విమర్శకుడు కారామాస్టారిని ‘యజ్ఞం’ కథలోని అప్పల్రాముడు, సీతారాముడు పాత్రలతో పోల్చేడో గానీ ఒక రకంగా అది నిజమే! మాస్టారు ఎల్లప్పుడూ వ్యక్తిగా అప్పల్రాముడు, రచయితగా సీతారాముడు! యజ్ఞం కథలోని అప్పల్రాముడు సౌమ్యుడు.
సమాజ నియమాలను, సమాజాన్ని నడిపే పెద్దల నిర్ణయాలనూ గౌరవించే వ్యక్తిత్వం. లోకం యేమనుకుంటుందో అని సంశయిస్తాడు. సీతారాముడు ఉద్రేకి. సమాజనియమాలూ, సమాజాన్ని నడిపే పెద్దలూ న్యాయ బద్ధంగా వుంటేనే గౌరవిస్తాడు. లేదంటే తిరస్కరిస్తాడు. లోకం యేమనుకుంటుందో అని సంశయించడు, లోకం నివ్వెరబోయినా, నిష్ఠురమాడినా నిప్పులాంటి నిజాల మూటల్ని విప్పుతాడు. లోకానికి ఆలోచనలనందిస్తాడు. లోకం నివ్వెరబోయే వ్యక్తిత్వం సీతారాముడుది. సరిగ్గా యీ లక్షణాలు తన అన్ని రచనల్లోనూ (మలిదశలో తాను రాసిన), చివరిగా రాసిన ‘సంకల్పం’, ‘అన్నెమ్మనాయురాలు’ కథల్లోనూ కన్పిస్తాయి. వ్యక్తిగా కారా మాస్టారిలో కన్పించే సౌమ్యత, లోకమేమనుకుంటాదో అనే సంశయాత్మకత లోకానికి తెలిసిందే. ఏ సందర్భంలోనూ నోరు విప్పి తనదయిన అభిప్రాయాలను చెప్పలేదు, చెప్పాల్సిన సందర్భాల్లో నోటికి కిల్లీని కుక్కేసుకునేవాడు. కానీ రచయితగా లోకానికి ఎరుక చేయాల్సిన అంశాల దగ్గరకు వస్తే కుండ బద్దలు కొట్టేడు.
దళితవాడలో అంతకుముందరెవ్వరూ నడవని బాటలోకి సీతారాముడు నడచినట్టు కారామాస్టారు రచయితగా కొత్తబాట నడచేడు. యజ్ఞం కథలో సీతారాముడు పాఠకలోకానికి కనబడినా, మాస్టారిని ఆవహించినది అంతకుముందరే! తనకిష్టమయిన కథలంటూ రాయటం పట్టుబడిన తర్వాత రాసిన తొలి కథ ‘తీర్పు’ లోనే! ‘నేనింక యీ తగవు తీర్చలేను’ అనంటూ ఒక వీసెడు బరువున్న పదార్థమేదో విసిరిపోయింది పరంధామయ్య భార్య అని ఆరంభమవుతుంది ‘తీర్పు’ కధ. యజ్ఞం కథ చివరలో గోనెసంచీలోంచి దబ్‌దబ్‌మన్న శబ్దంతో గోనెసంచీలోంచి మొండెమూ, కాళ్లూ, దేహమూ పడుతుంది. తీర్పు కథలో చిన్నవాడు పరంధామయ్య, అతని భార్య తీర్చలేని తగవుని తీర్చుతాడు. యజ్ఞం కథలో చిన్నకొడుకు సీతారాముడు పెద్దల తీర్పులోని పర్యవసానాన్ని కళ్లముందర పరుస్తాడు. తీర్పు కథలో అట్టలు పడిన శబ్దం గానీ యజ్ఞం కథలో మృతదేహం పడిన శబ్దం గానీ ఆ దృశ్యాలు గానీ సాహితీలోకానికి విభ్రమం! నివ్వెరపాటు! అప్పటిదాకా వ్యక్తుల చుట్టూ, కుటుంబాల చుట్టూ, ఇళ్లల్లోనే తెలుగుకథ తిరుగాడింది. మాస్టారిలో సీతారాముడు రూపుదిద్దుకున్నాక సామూహిక జీవన చిత్రణ ఆరంభమయ్యింది. గ్రామీణ వ్యవసాయక జీవనాల కథనం ఆరంభమయ్యింది. సంఘటనలు మాత్రమే కాదు సంఘటనల చరిత్రను కథనం చేయడమారంభమయ్యింది. జీవితచిత్రణ మాత్రమే కాదు ఆ జీవితాల సంచలనాల కారణాలను వెలికితీయడమారంభమయ్యింది.
యజ్ఞం, కుట్ర, శాంతి వంటి కథలు రాయడానికి ఙ్ఞానంతో పాటు ధైర్యం కావాలి. వీటితో పాటు మొత్తంగా వ్యవస్థ నమ్మే విషయాలలోని అసంగతాలను అర్థం చేయడానికి శక్తి, సీతారాముడిలోని తెగింపు, తన ఎరుక పట్ల అచంచలమైన విశ్వాసం కావాలి. పంచవర్ష ప్రణాళికల ద్రోహాన్ని విప్పిచూపింది యజ్ఞం; రాజ్యాంగం, చట్టం, శాసనాల కుట్రలను అర్థం చేయించింది ‘కుట్ర’ కథ…(పార్లమెంటరీ రాజకీయాలను బహిష్కరించి సాయుధబాట పట్టిన రాజకీయుల మీద పెట్టిన కుట్ర కేసుని గుర్తుకు తెస్తూ.)! ఇదే తెగువతో, ఎరుకతో మాస్టారు ‘సంకల్పం’ కథ అటు విప్లవశక్తులకు అర్థం కావాలన్న ఉద్దేశంతో రాసేరు. విప్లవపార్టీల చీలికలను దృష్టిలో పెట్టుకొని రాసిన కథ. అయితే విప్లవశక్తులేవీ యీ కథను అర్థం చేసుకున్నట్టు లేదు సరికదా అపార్థం చేసుకున్నట్టుంది. రావిశాస్త్రి గారి ‘జరీ అంచు తెల్ల చీర’ కథాంశమైన తీరని కోర్కె గురించిన కథలా కన్పిస్తుంది గానీ కాదు. ఆ కథాంశాన్ని విస్తరించి పెత్తనం, నాయకత్వం మార్పు అనేది నెత్తురు ఒలకడంతోనూ కనీసం కన్నీళ్లు ఒలకడంతోనో జరుగుతాయని సకల జీవుల్లోనూ యీ ఘర్షణ (కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని నమ్మే విప్లవపార్టీలలోనైనా సరే) ‘సంకల్పం’ కథ ఎరుకచేస్తుంది.
మాస్టారి కథలు గణితబోధనలా వుంటాయి. సామాజికచలన దశలను, ఆయా దశల్లో జీవనచలనాలనూ ఎరుకపరుస్తాయి. వ్యక్తులమీదా, సమాజం మీదా పడే రాజకీయార్థిక ప్రభావాలను మాస్టారి కథలు ఎరుకపరుస్తాయి. ఎనభయ్యేళ్ల వయసులో రాసిన ‘అన్నెమ్మనాయురాలు’ కథ అయితే గ్రామీణప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న అనేక మార్పుల్ని, వ్యక్తుల ఆలోచనల్లో పరిణామాలను చూపుతూ, పాలకులూ, పాలితులూ మధ్య కాలం తెచ్చిన మార్పుల్ని చూపి, మారని విప్లవపార్టీల ఆలోచన, ఆచరణల గురించి చింతన వుంటుంది. ఇది కటువుగానే వుంటుంది, అప్పల్రాముడి మెతకదనం కన్పించదు, సీతారాముడి కటువు కన్పించుతుంది.
వ్యక్తిగా కూడా అప్పల్రాముడితో కేవలం సౌమ్యత వరకూ పోల్చాలి. మిగిలిన విషయాల్లో తనదైన ప్రత్యేకతలున్నాయి. వేసే కిల్లీ నుంచి రాసే కథ దాకా తనదయిన ప్రత్యేకతే! సాహితీసృజన అనేది సమాజం యిచ్చిందేననీ; వస్తువు, సంభాషణలు సమాజం నుంచి పొందినవే; కూర్పూ చేర్పూ చేసే శక్తీ, జ్ఞానం కూడా సమాజం నీకు నేర్పినదే; కనుక సాహిత్యం ద్వారా లభించే యేదయినా సమాజానికోసమే ఖర్చు చేయాల తప్ప స్వంతానికి ఖర్చు చేయగూడదన్న స్వీయనిబంధన పెట్టుకొని అలా సాహి త్యం ద్వారా లభించేదంతటినీ సాహిత్యానికీ, సమాజానికీ ఖర్చుపెట్టేరు. ప్రతీ వ్యక్తీ తీర్చవలసిన ఋణాలు… తల్లిదండ్రుల ఋణం, గురువుల ఋణం, సమాజ ఋణం అనే వారు… అలా అన్నమాట ప్రకారం బహుశా అన్ని ఋణాలూ తీర్చిన ఉదాత్తుడు కారా మాస్టారు. మాస్టారికే సమాజం ఋణపడి వుందేమో!
                                                                                              -అట్టాడ అప్పల్నాయుడు
                                                                                  (ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో)