ఎన్నికల్లో దూసుకుపోతున్న సినీ కధా నాయిక

రేష్మా రాథోడ్‌… ‘ఈ రోజుల్లో’, ‘జైశ్రీరామ్‌’ వంటి సినిమాల హీరోయిన్‌ రేష్మ న్యాయశాస్త్ర విద్యలో పట్టభద్రురాలు. పుట్టిన బంజారా తెగకు ఏదో చేయాలని తపిస్తూ… తెలంగాణ ఎన్నికల బరిలో ఆమె ఎస్టీ రిజర్వుడ్‌ నియోజక వర్గం ఖమ్మం జిల్లా వైరా నుంచి పోటీ చేస్తోంది.
 
“మేము బంజారాలం. మా కుటుంబానికి మొదటి నుంచి జనంతో సంబంధాలున్నాయి. నాన్న హరిదాస్‌ ఒకప్పుడు బి.జె.పి. యువ మోర్చాలో పదిహేనేళ్ళు చురుకుగా పనిచేశారు. చదువుకోకపోవడం వల్లే మా తెగ వాళ్ళంతా వెనకబడిపోతున్నారని ఆ రోజుల్లోనే ఊళ్ళో విద్యా ఉద్యమం నడిపి, చైతన్యం తేవడానికి కృషి చేశారు. మా అమ్మ రాధాబాయ్‌ కూడా వాళ్ళింట్లో తొలితరం అక్షరాస్యురాలు. ఆమె చదువుకొని, హైకోర్టు లాయర్‌గా పనిచేసింది. ఆమె కూడా బడుగువర్గాల కష్టాలు విని చేతనైనంత సాయం చేసేది. లీగల్‌ హెల్ప్‌ అందించేది. అలా వాళ్ళను దగ్గర నుంచి చూడడంతో నాకు కూడా తెలియకుండా అది నా స్వభావంలో ఇంకిపోయింది.
మారుతి ‘ఈరోజుల్లో’ హీరోయిన్‌
మొదటి నుంచి నాకు ‘లా’ చదివి, మెజిస్ట్రేట్‌ అవ్వాలనేది లక్ష్యం. అయితే, చదువుకొనే రోజుల్లో చూడడానికి బాగుంటానని మా అమ్మ స్నేహితులు నన్ను ప్రోత్సహించారు. వాళ్ళ ద్వారా కొన్ని యాడ్స్‌లో చేశా. అప్పుడే టీవీ ప్రముఖులు మంజులా నాయుడు మా అమ్మానాన్నల్ని ఒప్పించి, ‘మొగలిరేకులు’ సీరియల్‌కు తీసుకున్నారు. దర్శకుడు మారుతి ‘ఈరోజుల్లో’ హీరోయిన్‌ పాత్ర కోసం నటిని వెతుకుతున్నారు. ఒక యాక్టింగ్‌ ఏజంట్‌ వల్ల నా వివరాలు తెలుసుకొని, పిలిపించారు. ఆ సినిమా పెద్ద హిట్టవడంతో మంచి గుర్తింపు వచ్చింది. తరువాత హీరో ఉదయ్‌కిరణ్‌ ఆఖరి సినిమాల్లో ఒకటైన ‘జైశ్రీరామ్‌’లో సాయిబాలాజీ గారి దర్శకత్వంలో, అలాగే ‘లవ్‌సైకిల్‌’, ‘ప్రతిఘటన’ల్లో చేశా.మధ్యలో తమిళ, మలయాళ చిత్రాల్లో నటించా. భాషతో పాటు కరాటే, గుర్రపుస్వారీ నేర్చుకున్నా. ఇప్పుడు నాకు తమిళం, మలయాళం మాట్లాడడం, చదవడం, రాయడం వచ్చు. ఏదైనా మనసు పెడితే నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు.
మా లాంటివాళ్ళం వస్తేనే
నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఉంది. ఎక్కడెక్కడి నుంచో నాయకులు వచ్చి, మా దగ్గర పోటీ చేస్తున్నారు. వాళ్ళను నమ్మి మేము ఓటేస్తే, గెలుస్తున్నారు. కానీ, వాళ్ళ వల్ల స్థానికంగా మాకు అభివృద్ధి లేదు. గిరిజనులకూ, గిరిజనేతరులకూ గొడవలు పెడుతున్నారు. ఓటు బ్యాంకుగానే వాడుకొని వదిలేస్తున్నారు. చదువుకున్నవాళ్ళం, అవగాహన ఉన్నవాళ్ళం… మనమే ఎందుకు ప్రజాప్రతినిధి అయి, సమస్యలు పరిష్కరించకూడదనిపించింది. మా లాంటివాళ్ళం వస్తేనే రాజకీయాలు మారతాయి. అందుకే వచ్చా.
నా మొదటి ప్రాధాన్యత ప్రజాసేవే! 
త్వరలోనే నటిగా కూడా ఛాలెంజింగ్‌ పొలిటికల్‌ రోల్‌ చేస్తున్నా. బి.జె.పి. మాతృసంస్థ ‘భారతీయ జనసంఘ్‌’ వ్యవస్థాపకుడు, సిద్ధాంతకర్త అయిన శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ జీవితంపై ఓ ప్రతిష్ఠాత్మక బయోపిక్‌ రానుంది. జనవరిలో హిందీ, బెంగాలీల్లో ప్రారంభమవుతోంది. అందులో ముఖర్జీ సతీమణి సుధాదేవిగా గుర్తుండిపోయే పాత్ర పోషించనున్నా. నా కొత్త సినిమా ‘పెళ్ళంటే’ విడుదలకు సిద్ధమవుతోంది. నటించడం కొనసాగించినా… నా మొదటి ప్రాధాన్యత  రాజకీయాలు, ప్రజాసేవే!