‘విప్లవశంఖం’ మూగబోయింది !

విప్లవ నటుడు, అభ్యుదయ చిత్రాల నిర్మాత మాదాల రంగారావు(71) అనారోగ్యంతో కన్నుమూశారు. గత ఏడాది హార్ట్‌ స్ట్రోక్‌ రావడంతో ఓపెన్‌ సర్జరీ చేశారు. ఈ నెల 19న అస్వస్థతకు గురైన రంగారావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని మైనంపాడు ఆయన జన్మస్థలం. రంగారావుకు భార్య పద్మావతి, కుమారులు రవి, సుధాకర్‌తోపాటు కుమార్తె విజయ ఉన్నారు. ప్రజా నాట్యమండలిలో క్రియాశీల సభ్యుడిగా పనిచేసిన ఆయన వందల సంఖ్యలో నాటక ప్రదర్శనలిచ్చారు. ఆ తర్వాత జి.రామినీడు దర్శకత్వం వహించిన ‘ఛైర్మన్‌ చలమయ్య’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ‘ఎర్రమల్లెలు’, ‘ఎర్ర సూర్యుడు’, ‘ఎర్రపావురాలు’, ‘విప్లవశంఖం’, ‘స్వరాజ్యం’, ‘జనం మనం’, ‘ప్రజాశక్తి’ వంటి విప్లవాత్మక చిత్రాల్లో నటించి రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 1979-80లో నవతరం పిక్చర్స్‌ బ్యానర్‌ను స్థాపించి ఆయనే హీరోగా ‘యువతరం కదిలింది’ చిత్రాన్ని నిర్మించారు. ఆయనకు స్నేహితులైన టి.కృష్ణ, పోకూరి బాబూరావు షూటింగ్‌ సమయంలో ఎంతో సహకరించారు. ఆ తర్వాత ‘ఎర్రమల్లెలు’, ‘ప్రజాశక్తి’, ‘స్వరాజ్యం’, ‘జనం మనం’, ‘ఎర్రమట్టి’ చిత్రాలను నటించి నిర్మించారు. నటుడిగా 70 చిత్రాల్లో కనిపించిన రంగారావు నిర్మాతగా 15కు పైగా సినిమాలు నిర్మించారు. ‘యువతరం కదిలింది’ చిత్రానికి 1980లో రాష్ట్ర ప్రభుత్వం బంగారు నందితో సత్కరించింది. డా.మాదాల రవి హీరోగా 2004లో వచ్చిన ‘నేనుసైతం’ చిత్రంలో రంగారావు కీలక పాత్ర పోషించారు. అదే ఆయన నటించిన ఆఖరి చిత్రం.
సెన్సార్‌బోర్డ్‌తో ఎన్నో పోరాటాలు:
‘విప్లవశంఖం’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వడానికి అంగీకరించకపోతే సెన్సార్‌ ఆఫీస్‌ ముందు ఆమరణ నిరాహారదీక్ష చేసి సెన్సార్‌ సర్టిఫికెట్‌ సాధించిన తొలి నిర్మాత ఆయనే. రంగారావు సాహసానికి తమిళ నటుడు ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ అభినందించారు. ఆ తర్వాత ‘ప్రజాశక్తి’ చిత్రాన్ని కూడా సెన్సార్‌ బోర్డు నిరాకరిస్తే సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఏడాదిన్నరపాటు సాగిన పోరాటంలో సర్వోన్నత న్యాయస్థానంరంగారావు పక్కనే నిలిచింది. అప్పుడు చిన్నచిన్న మార్పులు చెప్పి సర్టిఫికెట్‌ ఇచ్చారన్న విషయం తెలిసిందే. ‘జనం-మనం’ చిత్రాన్ని కూడా విడుదల చెయ్యనివ్వకపోవడంతో పది నెలలపాటు కమ్యూనిస్ట్‌ నాయకులు నిరాహారదీక్ష చేసి సర్టిఫికెట్‌ వచ్చేలా చేశారు. మాదాల నిర్మించిన ‘ఎర్రమట్టి’ చిత్రానికి ఐదేళ్ల తర్వాత సెన్సార్‌ సర్టిఫికెట్‌ లభించింది. చలన చిత్ర చరిత్రలో ఇన్నిసార్లు సెన్సారు వారితో పోరాడి గెలిచిన నిర్మాత మాదాల రంగారావు.
ప్రముఖుల సంతాపం
మాదాల రంగారావు మరణావార్తతో చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతికి లోనయింది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, చిరంజీవి, శ్రీకాంత్‌, నల్లూరి వెంకటేశ్వర్లు, తమ్మారెడ్డి భరద్వాజ, పోకూరి బాబురావు, ఆర్‌.నారాయణమూర్తి వంటి సినీ ప్రముఖులు, సీపీఐ, సీపీఎమ్‌ నాయకులు, కార్యకర్తలు మాదాల స్వగృహానికి చేరుకొని నివాళులు అర్పించారు. మంచు మోహన్‌బాబు, పవన్‌కల్యాణ్‌ సంతాపాన్ని ప్రకటించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు మాదాల రంగారావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌ లోని మహా ప్రస్థానంలో జరగనున్నాయని ఆయన తనయుడు రవి తెలిపారు.