‘నటి జీవితం’ అంటే ‘నట జీవితం’ మాత్రమే కాదు !

షకీలాగా రిచా చద్దా… షకీలా జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ బయోపిక్‌ తెరకెక్కుతోంది. ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్‌లో రిచా చద్దా షకీలా పాత్రలో నటిస్తున్నారు.ఒకప్పుడు షకీలా మలయాళ చిత్ర పరిశ్రమలో ఓ సంచలనం. శృంగార తారగా ఆమె పరిశ్రమని శాసించారు. ఆమె సినిమాల ధాటికి స్టార్‌ హీరోల సినిమాలకు సైతం కలెక్షన్లు రాని సందర్భాలెన్నో ఉన్నాయి. అంతేకాదు ఒకానొక దశలో ఆమెతోపాటు ఆమె సినిమాలను పరిశ్రమ నుంచి బహిష్కరించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. ఏదిఏమైనా షకీలాది ఓ చరిత్రే అని చెప్పుకోక తప్పుదు. 
 
ఈ నేపథ్యంలోఈ  సినిమాలో తన లుక్‌కు సంబంధించిన పలు ఫొటోలను రిచా ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పంకజ్‌ త్రిపాఠి ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. షకీలా పాత్ర కోసం రిచా చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తున్నారు. షకీలా చిన్నతనంలో ఎలా ఉండేవారు?, ఆమె జీవిత గమనం ఎలా సాగింది?, గ్లామర్‌ తార వెనకాల ఉన్న సుఖ, దు:ఖాలేంటి?, ఆమె హావభావాలు, భాష వంటి అంశాలను పరిశోధించే పనిలో రీచా ఉన్నారు. దీని కోసమై షకీలా పూర్వీకులను కలుసుకోవడంతోపాటు, షకీలా ఇంటి చుట్టుపక్కల వారితో ఆమెకు సంబంధించిన పలు విషయాలను కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాత్రలో జీవించడం కోసం, సహజత్వం కోసమే రిచా ఇంత హోం వర్క్‌ చేస్తోందని చిత్రయూనిట్‌ తెలిపింది.
 
నిజాన్ని షుగర్‌ కోట్‌ చేయడం లేదు !
“షకీలా తరహా బయోపిక్స్‌ చేయడమంటే పెద్ద బాధ్యతను భుజాలమీదకు ఎత్తుకోవడమే. ఇలాంటి బాధ్యతాయుతమైన కథలనే ఎంపిక చేసుకోవాలనుకుంటున్న తరుణంలో ఇంద్రజిత్‌ నాకు కథ చెప్పారు. వినగానే నచ్చి అంగీకారం తెలిపాను…. అని అంటోంది రిచా చద్దా.
షకీలా జీవితంలో కావాల్సినంత డ్రామా ఉంది. ఆసక్తికరమైన మలుపులున్నాయి. కొన్ని సందర్భాల్లో చాలా విచారకరంగానూ సాగింది. మామూలుగా వ్యక్తిగతంగానో, వృత్తిపరంగానో ఇబ్బందులు తలెత్తినప్పుడు చాలా మంది మద్యానికి, డ్రగ్స్‌కి బానిసలవుతుంటారు. కానీ ఎన్ని సంక్షోభ, క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ షకీలా ఆత్మస్థైర్యంతో వ్యవహరించారు. ఆ కోణంలోనే సినిమా నడక ఉంటుంది. ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలకు సమ ప్రాధాన్యతనిస్తూ కథను అల్లారు. ఇందులో షకీలా వెండితెర వెలుగులను మాత్రమే చూపించడమో, లేకుంటే నిజాన్ని షుగర్‌ కోట్‌తోనూ చెప్పడమో… చేయడం లేదు.
నా దృష్టిలో నటీనటులందరూ ఇమేజ్‌ అనే బందీఖానాలో ఉన్నవారే. నాక్కూడా ‘బోల్డ్‌’, ‘గట్సీ గర్ల్‌’ అనే ఇమేజ్‌ ఉంది. నా వ్యక్తిగత జీవితం ఎవరికీ తెలియదు. ఓ నటి జీవితం అంటే కేవలం నటజీవితం మాత్రమే కాదన్న విషయాన్ని గ్రహించాలి.
నేను ‘షకీలా’ చిత్రం కోసం సెట్లో అడుగుపెట్టడానికి ముందు షకీలాతో చాలా సేపు మాట్లాడాను. మా మధ్య సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. జీవితం గురించి, బోయ్‌ ఫ్రెండ్స్‌ గురించి, భోజనం గురించి… ఒకటేంటి.. లౌకిక విషయాలన్నిటి గురించీ మాట్లాడుకున్నాం. ఆమె చాలా స్వతంత్రంగా పెరిగింది. అయినా ఆమెకు ఆధ్యాత్మిక భావన ఎక్కువ.ఈ చిత్రంతో కేరళ సంస్కృతిని దేశానికి చూపించబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వస్సేపూర్‌’ బీహార్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. నాకు స్క్రిప్ట్‌ నచ్చితే ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధమే…అని చెప్పింది.