డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో ‘క్యాబరే’ విడుదల

బాలీవుడ్‌లో భిన్నమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది రిచా చద్దా. ఓ పక్క కమర్షియల్‌ సినిమాలతో పాటు సమాంతర (పార్లల్‌) సినిమాలకూ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే కథానాయికగానూ రిచాకి మంచి పేరు సొంతం చేసుకున్నారు. రిచా ప్రస్తుతం ‘క్యాబరే’ చిత్రంలో నటించారు. ఇండియన్‌ రొమాంటిక్‌ డాన్స్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. కౌస్తవ్‌ నారాయణ నియోగి దర్శకత్వం వహించారు. ఇందులో రిచాతోపాటు గుల్షన్‌ దేవయ్య, క్రికెటర్‌ శ్రీశాంత్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదల గత రెండేండ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. నిర్మాతలు కూడా మారారు. ప్రస్తుతం పూజా భట్‌, టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థియేటర్‌లో విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ సినిమాను ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ నటి, డాన్సర్‌ హెలేన్‌ జీవితం ఆధారంగా రూపొందించిన విషయం విదితమే.
ప్రస్తుతం రిచా  ‘ఘూమ్‌కేతు’లో కథానాయికగా నటిస్తోంది. పుష్పేంద్ర మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్‌ 16న విడుదల కానుంది. దీంతోపాటు ‘షకీలా బయోపిక్‌’లో షకీలా పాత్ర పోషిస్తోంది. ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షకీలా కూడా అతిథి పాత్రలో నటించనుండటం విశేషం. ప్రస్తుతం బెంగుళూరులో షకీలాపై పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘సినిమాలో సహజత్వం తీసుకురావడానికి, ఆడియెన్స్‌లో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచటానికే షకీలాతో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’ అని దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేష్‌ తెలిపారు