అందుకనే వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళాయి!

హీరోయిన్లకు సక్సెస్ రావడం ఎంత ముఖ్యమో ఆ సక్సెస్‌ను వాళ్లు ఏ రకంగా ఉపయోగించుకున్నారన్నది కూడా అంతే ముఖ్యం. చాలామంది హీరోయిన్లు తమకొచ్చిన విజయాలను జాగ్రత్తగా ఉపయోగించుకోలేక ఫెయిలవుతుంటారు. టాలెంట్ ఉన్న హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తనకు వచ్చిన సక్సెస్‌ను సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమ్మడి కెరీర్ గ్రాఫ్‌ను చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ‘పెళ్లిచూపులు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రీతూ వర్మ కూడా ఈ కోవలోకి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ‘పెళ్లిచూపులు’ సినిమాలో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చిన రీతూవర్మకు ఆ తరువాత అవకాశాలు బాగానే వచ్చాయి.
అయితే అమ్మడు మరీ సెలక్టివ్‌గా ఉండటం …. అందాల ప్రదర్శనలో రిజర్వుడ్ గా ఉండటం….పలానా హీరోతో అయితేనే నటిస్తానని కండీషన్లు పెట్టడంతో ఆమెకు వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్లిపోయాయని కొందరు చెబుతున్నారు. అందులో వాస్తవం ఎంతనే విషయం పక్కనపెడితే… ప్రస్తుతం రీతూ వర్మ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదని తెలుస్తోంది. సమంత, కీర్తి సురేశ్ వంటి హీరోయిన్లు తమకు వచ్చిన విజయాలను బాగా ఉపయోగించుకుని తమ కెరీర్‌ను ప్లాన్ చేసుకున్నారని, కానీ రీతూ వర్మ మాత్రం కొన్ని విషయాల్లో మొండిగా ఉండటం వల్ల నష్టపోయిందని అంటున్నారు.
 ఈ ఏడాది రీతూ నటించిన ఒకే ఒక్క సినిమా ‘కేశవ’ ఆడియెన్స్‌ను ఆకట్టుకోకపోవడం కూడా ఆమెకు మైనస్‌గా మారిందని సినీజనం చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రీతూ వర్మ విక్రమ్ సరసన తమిళ సినిమాలో నటిస్తున్నా, అది ఆమెకు కలిసొస్తుందని ఎవరూ చెప్పలేకపోతున్నారు.