తెలుగు ,తమిళ భాషలలో ‘సైరత్ ‘ రీమేక్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా  ‘సైరత్’. కొత్త తారలతో 4  కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం 100  కోట్ల మైలురాయిని దాటిన తొలి మరాఠీ భాషా చిత్రం గా రికార్డులు సృష్టించింది. పరువు హత్యల నేపథ్యం లో రూపొందించిన ఈ చిత్రం లో ఆకాష్ తొషర్, రింకు రాజగురు హీరో హీరోయిన్లు గా నటించారు. నాగరాజ్ మంజులే దర్శకత్వం చేసారు . ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ వంటి ఎందరో ప్రముఖ బాలీవుడ్ తారల మనసు దోచుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ రీమేక్ రైట్స్ కోసం విపరీతమయిన పోటీ నెలకొంది. చివరికి భారీ మొత్తం చెల్లించి ప్రముఖ నిర్మాణ సంస్థ రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత వెంకటేష్ , జీ స్టూడియోస్ చేజిక్కించుకున్నారు .

ఈ సందర్భం గా రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ… “నా మనసుకి నచ్చిన సినిమా ఇది. చూసిన వెంటనే ఈ సినిమా రీమేక్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాo.66వ బెర్లిన్ చిత్రోత్సవం లో ఈ సినిమా చూసిన అందరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. లాస్ ఏంజెల్స్ లో ని సోనీ సింఫనీ స్టూడియో లో పాటల రికార్డింగ్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమా ఇదే. అందరికి బాగా తెలిసిన కథనే దర్శకుడు నాగరాజ్ మంజులే హృద్యంగా తెర పై ఆవిష్కరించారు. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రింకు రాజగురు కి జాతీయ పురస్కారం కూడా దక్కింది. చిన్న సినిమాల లో పెద్ద విప్లవం తీసుకొచ్చిన ఈ చిత్రాన్ని అతి త్వరలో తెలుగు, తమిళం భాషలలో రీమేక్ చేయనున్నాం. తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయ్యింది .ప్రస్తుతం లొకేషన్స్ ఎంపిక జరుగుతోంది .పూర్తి వివరాలు అతి త్వరలో నే తెలియచేస్తాం.” అని తెలిపారు.