మరచిపోలేని జేమ్స్ బాండ్ 007

రోజర్‌ మూర్‌… ప్రపంచమంతటా ఒక తరాన్ని ఉర్రూతలూగించిన వెండితెర జేమ్స్‌బాండ్‌. పన్నెండేళ్ళలో (1973 నుంచి 1985 మధ్య) ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా ఏడు జేమ్స్‌బాండ్‌ సినిమాలతో దేశదేశాల ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు. హాలీవుడ్‌లో జేమ్స్‌బాండ్‌ అఫిషియల్‌ ఫ్రాంఛైజ్‌ సినిమాల్లో ఇప్పటి దాకా ఆ జేమ్స్‌ బాండ్‌ పాత్రలకు ఆరుగురు నటులు ప్రసిద్ధులైతే, వారిలో మూడో వ్యక్తి రోజర్‌ మూర్‌. పంతొమ్మిది వందల డెబ్భై మూడులో తొలిసారిగా లివ్‌ అండ్‌ లెట్‌ డై చిత్రంతో మొదలైన ఆయన జేమ్స్‌బాండ్‌ పాత్ర ప్రయాణం పంతొమ్మిది వందల ఎనభై అయిదులో ఎ వ్యూ టు ఎ కిల్‌ చిత్రంతో ముగిసింది. కారుల్లో, విమానాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో… విలనతో పోరాటానికి వెండితెరపై పేరొందిన రోజర్‌ మూర్‌ నిజజీవితంలో కొద్దికాలంగా క్యాన్సర్‌తో పోరాడి, ఎనభై తొమ్మిదేళ్ళ వయసులో చివరకు ఈ నెల ఇరవైమూడున అందరికీ భౌతికంగా గుడ్‌ బై చెప్పేశారు. రోజర్‌ మూర్‌ జీవితం చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. సామాన్య ఉద్యోగస్థులైన తల్లితండ్రుల ఏకైక సంతానం ఆయన. ఆయన తల్లి మన దేశంలోని కోల్‌కతాలో పుట్టిన ఇంగ్లీషు వనిత. తల్లి అన్నా, తండ్రి అన్నా రోజర్‌ మూర్‌కు తగని ప్రేమ.
రచయిత ఇయాన్ ఫ్లెమింగ్‌ సృష్టించిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజంట్‌ జేమ్స్‌ బాండ్‌ పాత్ర అంటే ఒక తరానికి రోజర్‌ మూరే. ఆయన కన్నా ముందు సీన కానరీ, జార్జ్‌ లాజెనబీ లాంటి ప్రసిద్ధ నటులు ఆ పాత్రను అద్భుతంగా పోషించారు. అయినా, ఆ పాత్రలో సరదాగా మాట్లాడే తీరు, చూపే ఆత్మవిశ్వాసం రోజర్‌ మూర్‌ను ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మార్చేశాయి. సీన కానరీ లానే రోజర్‌ మూర్‌ కూడా ఏకంగా ఏడు సినిమాల్లో బాండ్‌ పాత్ర పోషించారు. అయితే, వరుసగా అలా దీర్ఘకాలం ఎక్కువ సినిమాల్లో చేసిన ఘనత రోజర్‌ మూర్‌దే. ముఖ్యంగా, రచన, దర్శకత్వం, ప్రొడక్షన డిజైన, యాక్షన సన్నివేశాలు, కామెడీ, సస్పెన్స్‌ ఇలా అన్నీ అద్భుతంగా కుదిరిన చిత్రం ద స్పై హూ లవ్డ్‌ మి. ఆ సినిమా ఓపెనింగ్‌ సీక్వెల్‌లో పేరాచూట్‌ తెరిచి, మృత్యుముఖం నుంచి జేమ్స్‌ బాండ్‌ తప్పించుకొనే సీనకు గుమ్మైపోని ప్రేక్షకులు ప్రపంచంలో లేరు. స్టార్‌ వార్స్‌ సిరీస్‌తో అంతరిక్షానికి సంబంధించి అన్నిటికీ క్రేజు రావడంతో ఆ హవాలో తీసిన మూన రేకర్‌ చిత్రం గురించి కూడా అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. అలాగే ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ సినిమా కూడా ఆదరణ పొందింది.
 లేటు వయసులో ఘాటు వేషం!
జేమ్స్‌ బాండ్‌ పాత్రలోకి రోజర్‌ మూర్‌ లేటు వయసులో ఎంటర్‌ అయ్యారనే చెప్పాలి. సీన్ కానరీ ముప్ఫై రెండేళ్ళకే బాండ్‌ అయితే, ఇటీవలి డేనియల్‌ క్రెగ్‌కు ముప్ఫై ఏడేళ్ళ వయసులో ఆ పాత్ర దక్కింది. కానీ, రోజర్‌ మూర్‌ ఈ పాత్ర తొలిసారిగా చేసే నాటికి నలభై అయిదేళ్ళవాడు. అయినా సరే యాభై ఆరో ఏట దాకా జనాన్ని మెప్పించడం సామాన్యం కాదు. మూన్ రేకర్‌ సినిమాలో ప్రత్యర్థుల చేతిలో చిత్రహింసకు గురైనా, ఆక్టోపసీ చిత్రంలో మారువేషంలో బాంబును నిర్వీర్యం చేసినా, అలాగే ఎ వ్యూ టు ఎ కిల్‌ సినిమాలో ఈఫిల్‌ టవర్‌, గోల్డెన్ గేట్‌ బ్రిడ్జ్‌ లాంటివి ఎక్కినా జనం ఈలలు వేశారు. ఆయన మాత్రం తన సక్సెస్‌కు కారణం తన నటన కన్నా, నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు అదృష్టం అని వినమ్రంగా చెప్పేవారు.
 అతను కిల్లర్‌… నేను లవర్‌!
రోజర్‌ మూర్‌, తన కన్నా ముందు ఆ పాత్రలు చేసిన సీన కానరీ మధ్య మంచి స్నేహం ఉండేది. రోజర్‌ ఎప్పుడూ చాలా వినయంగా జేమ్స్‌ బాండ్‌గా తన కన్నా సీన కానరీనే బెస్ట్‌ అంటుండేవారు. తమ ఇద్దరి పాత్రపోషణ మధ్య తేడా కూడా ఆయనే చెప్పారు. సీన పోషించిన జేమ్స్‌ బాండ్‌ పాత్ర సీరియస్‌ కిల్లర్‌ తరహా అయితే, నేను చేసిన బాండ్‌ సరదాగా సాగే కులాసా ప్రేమికుడు అని రోజర్‌ మూర్‌ చెప్పారు. ఆడవారి నుంచి మగవారి దాకా అందరికీ ఆయన ఆరాధ్యుడవడానికి ఒక రకంగా అదే కారణం కూడా!
 యునిసెఫ్‌తో… సేవలో…
అధిక ఆదాయం ఉన్నవాళ్ళకు వేసే అధిక పన్ను రేటును తప్పించుకోవడం కోసం 1970లలోనే బ్రిటన్ ను వదిలేసిన మూర్‌ స్విట్జర్లాండ్‌, మొనాకో లాంటి దేశాల్లో గడిపారు. రోజర్‌ మూర్‌కు చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఆరోగ్యసమస్య ఉండేది. హృద్రోగం, క్యాన్సర్‌ లాంటి దీర్ఘ రోగాలూ పీడించాయి. చివరిసారిగా 2002లో నాలుగో పెళ్ళి చేసుకున్న ఈ సినీ హీరోకు మూడో భార్య ద్వారా ముగ్గురు పిల్లలు. మై వర్డ్‌ ఈజ్‌ మై బాండ్‌ పేరిట రాసిన ఆత్మకథలో అనేక ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. జీవితం రెండో అంకంలో యునిసెఫ్‌కు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా మానవతా కార్యక్రమాల్లో ఆయన చేసిన సేవ అంతా ఇంతా కాదు. అందుకు గుర్తింపుగా రెండువేల మూడో సంవత్సరంలో ఆయనకు సర్‌ బిరుదు దక్కింది. జేమ్స్‌ బాండ్‌ పాత్రపోషణలో తన స్థానం తాజా బాండ్‌ పాత్రధారి డేనియల్‌ క్రెగ్‌, సీన్ కానరీ, జార్జ్‌లాజెన్ బీల తరువాత నాలుగోది అని రోజర్‌ మూర్‌ ఎంత వినయంగా చెప్పుకున్నా… మీ లాగా చేసినవాళ్ళెవరూ లేరు అని డేనియల్‌ క్రెగ్‌ తన సంతాప సందేశంలో ఘనంగా నివాళులర్పించారు. దాన్నిబట్టి జేమ్స్‌ బాండ్‌గా రోజర్‌ మూర్‌తో ప్రేక్షకుల బంధం ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు. లాంగ్‌ లివ్‌ జేమ్స్‌ బాండ్‌… రోజర్‌ మూర్‌ లివ్స్‌ ఆన్….
 ఒక్కో అడుగూ… పై పైకి!
లండన్ లో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ కుమారుడైన రోజర్‌ పదిహేనేళ్ళకే స్కూలు చదువు వదిలేసి, సినిమా కంపెనీ ట్రైనీ యానిమేటర్‌గా పనిచేశారు. మిత్రులతో కలసి ఎక్స్‌ట్రా వేషాలు వేశారు. తరువాత మిలటరీలో కొన్నాళ్ళు పనిచేశారు. తిరిగొచ్చాక రంగస్థలంపైనా, సినిమాల్లో, ఆ పైన టీవీలో నటించారు. పాపులర్‌ టీవీ క్రైమ్‌ సిరీస్‌… ద సెయింట్‌లో నేరాలను ఎదిరించే పోరాటవీరుడిగా, ప్లేబాయ్‌గా దాదాపు ఏడేళ్ళ పాటు నటించడం ఆయన జీవితాన్ని మలుపు తిపిఁంది. కొన్ని ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. ఆ తరువాత చేసిన మరో ప్లేబాయ్‌ ఎడ్వంచర్‌ టీవీ సిరీస్‌ ‘ద పర్‌సుయేడర్స్‌’ కూడా హిట్‌. ఆ టైమ్‌లో లివ్‌ అండ్‌ లెట్‌ డై సినిమాలో తొలిసారిగా జేమ్స్‌ బాండ్‌ పాత్ర వేయడంతో రోజర్‌ మూర్‌ కెరీర్‌ మారిపోయింది. జేమ్స్‌ బాండ్‌గా మూడో సినిమా ద స్పై హూ లవ్డ్‌మి ఆయన కెరీర్‌లో పరాకాష్ఠ అయింది. బాండ్‌ పాత్రల నుంచి విరమించుకున్నాక మూర్‌కు యాక్టింగ్‌ మీద కోరిక తగ్గింది. చాలా కొద్దిపాత్రలు మాత్రమే చేశారు.
 
రోజర్‌ మూర్‌ చేసిన మొత్తం ఏడు జేమ్స్‌బాండ్‌ సినిమాలూ ఏమిటంటే…
* 1973 : లివ్‌ అండ్‌ లెట్‌ డై
* 1974 : ద మ్యాన్ విత ద గోల్డెన్ గన్
* 1977 : ద స్పై హూ లవ్డ్‌ మీ
* 1979 : మూనరేకర్‌
* 1981 : ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ
* 1983 : ఆక్టోపస్సీ
* 1985 : ఎ వ్యూ టు ఎ కిల్