రెండు సొంత సినిమాలతో ఫ్యాన్స్‌ ముందుకు…

ప్రభాస్ ఇకపై స్పీడు పెంచబోతున్నాడు. ఒకవైపు ‘సాహో’ సినిమా షూటింగ్‌ను పూర్తిచేస్తూనే మరోవైపు రాధాకృష్ణ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు.’బాహుబలి’ సిరీస్ చిత్రాలకోసం ఐదేళ్ల సమయాన్ని వెచ్చించిన ప్రభాస్ సంవత్సర కాలంగా ‘సాహో’కే తన సమయం మొత్తాన్ని కేటాయించాడు. అయితే ఇకపై సినిమాల స్పీడు పెంచబోతున్నాడు యంగ్ రెబెల్ స్టార్. ఒకవైపు సొంత సంస్థ లాంటి యు. వి.క్రియేషన్స్  నిర్మిస్తున్న  ‘సాహో’ షూటింగ్‌లో పాల్గొంటూనే మరొకవైపు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నాడు. జూలై 7 నుంచి ప్రభాస్-రాధాకృష్ణ చిత్రం పట్టాలెక్కబోతుంది.
 ‘భక్త కన్నప్ప’, ‘అమరదీపం’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై రెబెల్ స్టార్ కృష్ణంరాజు.. ప్రభాస్-రాధాకృష్ణ సినిమాని నిర్మించబోతున్నాడు. ఇక ‘బిల్లా’ తర్వాత సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్‌లో ప్రభాస్ నటిస్తోన్న సినిమా ఇదే.ఈ చిత్రంలో ‘యంగ్ రెబెల్ స్టార్‌’కి జోడీగా పూజా హెగ్డే నటించబోతుంది. ప్రస్తుతం పక్కాగా ప్రి-ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాత కృష్ణంరాజు. మొత్తంమీద ‘బాహుబలి-2’ తర్వాత భారీగానే గ్యాప్ తీసుకున్న ప్రభాస్. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో ఫ్యాన్స్‌ ముందుకు రాబోతున్నాడన్నమాట.