సచిన్ కుమార్తె సారాకు నటన పట్ల ఆసక్తి !

సుమారు రెండున్నర దశాబ్దాలపాటు ఇండియన్ క్రికెట్ టీంకు సేవలందించారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ మెంబర్‌గా,రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాగా, ‘లిటిల్ మాస్టర్’ ముద్దుల తనయ సారా తెందుల్కర్ సినిమాల్లోకి రాబోతోందని సమాచారం. బాలీవుడ్ ఖాన్‌త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ సారాను బాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారని తెలుస్తోంది. సారాకు కూడా చిన్నప్పటి నుంచి నటన పట్ల ఆసక్తి ఉందట.

దాంతో ఇదే సరైన సమయమని భావించిన అమీర్ ఆమెను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అంతేగాక ఆమె తొలి సినిమాల్లోనే రణ్‌బీర్ కపూర్‌తో కానీ రణ్‌వీర్ సింగ్‌తో కానీ కలిసి పనిచేయనుందనే వార్త కూడా ప్రస్తుతం బాలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచిచూడాల్సిందే. ఇదిలాఉండగా కొంతకాలం క్రితం సారా సినిమాల్లోకి వస్తుందనే వార్తను సచిన్ ఖండించిన సంగతి తెలిసిందే. ఇక సచిన్ తనయుడు అర్జున్ తెందుల్కర్ తండ్రి బాటలోనే క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు.