‘తేజ్‌ ఐ లవ్‌ యూ’ పాటలు విడుదల చేసిన చిరంజీవి

మా కుటుంబం నుంచి వచ్చిన కథానాయకులందరికీ కష్టపడే మనస్తత్వం ఉంది. ఒళ్లు వంచి పనిచేస్తారు. వాళ్లంతా విజయాలు సాధిస్తున్నారా, లేదా? అనేదానికంటే క్రమశిక్షణతో ఉంటున్నారా లేదా? అనేదే నాకు ప్రధానం… అన్నారు చిరంజీవి. సాయి ధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’. శనివారం హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేశారు. కరుణాకరన్‌ దర్శకుడు. కె.ఎస్‌.రామారావు నిర్మాత. తొలిసీడీని చిరంజీవి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… ‘‘ఇది తేజూ సినిమా అని ఈ కార్యక్రమానికి రాలేదు. నా ప్రియమైన నిర్మాత, మిత్రుడు కె.ఎస్‌.రామారావు సినిమా అని వచ్చా. 80వ దశకంలో నా ఖాతాలో ఎక్కువ శాతం సూపర్‌ హిట్లున్నాయన్నా, నవలా కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నా, ఎవరికీ లేని సూపర్‌ హిట్‌ గీతాలు నాకొచ్చాయన్నా, ‘మెగాస్టార్‌’ అని ఈ రోజు ముద్దుగా పిలుచుకుంటున్నారన్నా.. వాటన్నింటికీ సమాధానం కె.ఎస్‌.రామారావు. అభిలాష, ఛాలెంజ్‌, రాక్షసుడు, మరణ మృదంగం.. ఇలా మంచి సినిమాలు చేశాం. వరుస విజయాలతో ఉన్న ఆయన సంస్థకు ‘స్టువర్ట్‌పురం పోలీస్‌ స్టేషన్‌’ అనే పరాజయం ఎదురైంది. అది నా తప్పిదం వల్లే. అంతకు ముందు యండమూరి వీరేంద్రనాథ్‌ ‘అగ్ని ప్రవేశం’ అనే సినిమా చేశారు. అది పరాజయం పాలైంది. ‘మరో దర్శకుడ్ని తీసుకుందామా’ అని రామారావుగారు అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. రామారావుగారు భయపడినట్టే ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. దానికి నేనే కారణమా? అనే బాధ ఇప్పటికీ నాలో ఉంది. ఇటీవల చరణ్‌తో మాట్లాడుతున్నప్పుడు ‘కె.ఎస్‌.రామారావుగారితో ఓ సినిమా చేయాలనివుంది’ అన్నాడు. దర్శకుడెవరైనా సరే.. రామారావుగారితో ఓ సినిమా ఉంటుంది. ప్రేమకథలు తెరకెక్కించడంలో కరుణాకరన్‌ తనకు తనే సాటి. ‘తొలి ప్రేమ’ అంటే నాకు చాలా ఇష్టం. తాను కూడా కొంత గ్యాప్‌ తీసుకున్నాడు. యువ దర్శకులు ఇలా విరామం తీసుకుంటే పరిశ్రమకు అన్యాయం చేసినట్టే. ఈ సినిమాలో కొన్ని భాగాలు చూశాను. చాలా బాగున్నాయి’’ అన్నారు.

సాయిధరమ్‌తేజ్‌ మాట్లాడుతూ ‘‘మావయ్యే ప్రాణం. ప్రపంచం. పొద్దుటే లేచి సెల్‌ఫోన్‌లో ఉన్న ఆయన ఫొటోనే చూస్తా. ఆయన ఆశీర్వచనాలు లేకుండా ఏ రోజూ గడవదు. ‘తేజ్‌’ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. పాటలన్నీ బాగా ఆస్వాదించాన’’న్నారు.

సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ మాట్లాడుతూ ‘‘ఈ వేదికపై చిరంజీవిగారిని చూస్తే ఆనందంగా ఉంది. ఆయన్ని చూస్తే మాటలు రావడం లేదు. మా అమ్మగారు ఆయనకు వీరాభిమాని. ‘చుక్కల పల్లకిలో..’ అనే పాట తరచూ పాడేది. ఈ చిత్రంలో నా సంగీతం మీ అందరికీ నచ్చుతుందనుకుంటా’’ అన్నారు .

అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ ‘‘కె.ఎస్‌.రామారావు గారు ఎన్ని సినిమాలు చేసినా నిర్మాతగా ఆయన అభిరుచి తగ్గలేదు. ‘తొలిప్రేమ’లాంటి గొప్ప సినిమా ఇచ్చిన దర్శకుడితో పనిచేయడం నాకు గర్వంగా ఉంది. తేజ్‌ మంచి నటుడు, మంచి డాన్సర్‌’’ అన్నారు.

నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారిని చూసి పరిశ్రమ ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆయన ఇండియాలోనే మెగాస్టార్‌. కరుణాకరన్‌తో నాకు కొంచెం చనువు ఉంది. దాంతో నేను ఆయన్ని కాస్త కంగారు పెట్టి ఉంటాను. నా వల్ల ఇబ్బంది పడి ఉంటారు. అందుకు నన్ను క్షమించాలి. తొలిప్రేమలానే ఈ సినిమా గురించీ మాట్లాడుకుంటారు’’ అన్నారు.

కరుణాకరన్‌ మాట్లాడుతూ ‘‘అన్నయ్య ముందు మాట్లాడాలంటే గుండె దడదడలాడుతోంది. సహాయ దర్శకుడిగా పనిచేసేటప్పుడు ఉదయం ఏడింటికి లేచి చెన్నైలోని కోడంబాకం బ్రిడ్జిపై నిలబడేవాడ్ని. కారులో వెళ్తున్న చిరంజీవి గారిని చూసేవాడ్ని. సినిమా అనే కల ఇచ్చింది పెద్దన్నయ్య చిరు అయితే, సినిమా అవకాశం ఇచ్చింది చిన్నన్నయ్య పవన్‌కల్యాణ్‌. ఇప్పుడు తమ్ముడు తేజ్‌తో సినిమా చేశా’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆండ్రూ, సి.కల్యాణ్‌, అశోక్‌ కుమార్‌, మారుతి, కిషోర్‌ తిరుమల, గోపీచంద్‌ మలినేని, హరీష్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, ఛాముండేశ్వరీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.