సూక్తి ముక్తావళి…. ‘చిత్రలహరి’ సినిమా సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.25/5

మైత్రి మూవీ మేకర్స్‌ కిషోర్ తిరుమల దర్శకత్వం లో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సీవీ మోహ‌న్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు
కధాంశం…
విజ‌య్ కృష్ణ (సాయిధ‌ర‌మ్‌తేజ్‌) ఎల‌క్ట్రానిక్ ఇంజ‌నీరింగ్ చేస్తాడు. అత‌నికి ల‌హ‌రి (క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌) తొలి చూపులోనే న‌చ్చుతుంది. ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉంటుంది. త‌న‌కంటూ సొంత తెలివితేట‌లు లేని అమ్మాయి. ప్ర‌తి దానికీ ప‌క్క‌నోళ్ల మీద ఆదార‌ప‌డుతుంది. వాళ్లు చెప్పే విష‌యాలు ఆమె జీవితంలో వేదాలు. అలాంటిది తొలిసారి త‌న‌కు తానుగా నిర్ణ‌యం తీసుకుని విజ‌య్‌ని ప్రేమిస్తుంది. అయితే అత‌ను ల‌హ‌రికి అబ‌ద్ధాలు చెబుతున్నాడ‌ని స్వేచ్ఛ (నివేదా పెతురాజ్‌) చెబుతుంది. తీరా ఆరా తీస్తే అది నిజ‌మేన‌ని అర్థం చేసుకుంటుంది ల‌హ‌రి. దాంతో విజ‌య్‌కి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. విజ‌య్ చెప్పిన ఓ ఐడియా న‌చ్చ‌డంతో అత‌నికి సాయం చేయ‌డానికి ముందుకొస్తుంది స్వేచ్ఛ‌. అయితే స్వేచ్ఛ‌, ల‌హ‌రి స్నేహితురాళ్ల‌న్న సంగ‌తి విజ‌య్ కు తెలియ‌దు. ఓ సంద‌ర్భంలో జీవితంలో అత్యంత ఘోరంగా ప‌రాజ‌యం పాలైన‌ట్టు ఫీల‌వుతాడు విజ‌య్‌. ఆ స‌మ‌యంలో అత‌నికి తోడుగా నిలిచిందెవ్వ‌రు? విజ‌య్ తండ్రి (పోసాని కృష్ణ‌ముర‌ళి) ఇచ్చిన స‌ల‌హాలేంటి? ఒక దిక్కున ఉద‌యించే సూర్యుడు నాలుగు దిక్కుల్లోనూ ఉద‌యించినా త‌న జీవితంలోకి వెలుగు రాద‌నుకునే విజ‌య్ ని విజ‌యం వ‌రించిందా? లేదా? మ‌ధ్య‌లో విజ‌య్ గ్లాస్ మేట్ (సునీల్‌) తీసుకున్న‌నిర్ణ‌యం ఏంటి? ముంబైలో త‌మిళ తంబి (వెన్నెల కిశోర్‌) పండించిన హాస్యం ఎలాంటిది? …ఇవ‌న్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ…
ఈ చిత్ర దర్శకుడు కిషోర్‌ తిరుమల ‘నేటి యూత్ సక్సెస్‌ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు. సక్సెస్‌ వెంట పరిగెడుతూ తమని తాము ఎలా కోల్పోతున్నారు’ అన్న విషయాలను తెరమీద చెప్పే ప్రయత్నం చేశాడు. కిషోర్‌ పాత్రలని బాగా రాసుకున్నాడు. కానీ, కథలోని పాత్రలు, సన్నివేశాలతో ఆడియన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే స్థాయి సీన్స్‌ లేకపోవటం సినిమాకు మైనస్ అయ్యింది.క్యారక్టర్స్ ,ఎపిసోడ్స్ కనపడతాయి కానీ, కథలో వచ్చే ముఖ్యమైన మలుపు కనపడదు. పాత్రలు, పాటలు, మాటలు లాంటివి ఆసక్తి కోల్పోకుండా ప్రేక్షకుడిని కూర్చోబెట్టగలుగుతాయి ..కానీ, తెరపై జరుగుతున్న దానిలో లీనమయ్యేలా..పాత్రలు అనుభవిస్తోన్న భావోద్వేగాలని ఫీలయ్యేలా చేసేది కథనం. దాన్ని కిషోర్‌ విస్మరించాడు.అలాగే ప్రారంభం ఇంట్రస్ట్ గా అనిపించినా మెల్లమెల్లగా డ్రాప్ అవుతూ ..సెకండాఫ్ లో మరీ డల్ అయిపోయింది.
 
కిషోర్‌ తిరుమల దర్శకుడిగా తడబడినా రచయితగా మాత్రం సక్సెస్‌ అయ్యాడు. కొన్ని డైలాగ్స్ గుర్తుండి పోయేలా ఉన్నాయి.పాటలు, మాటలు చాలా బాగున్నాయి. ఛాయాగ్రహణం, కళ, కూర్పు అన్నీ చక్కగా కుదిరాయి. అయితే ముందే చెప్పినట్టుగా బేసిక్స్‌ని ‘చిత్రలహరి’ దర్శకుడు ఓవర్‌ లుక్‌ చేసాడు.దర్శకుడు డైలాగులు మీద పెట్టిన శ్రద్ద..స్క్రీన్ ప్లేని ఇంట్రస్టింగ్ గా నడపటంలో పెట్టలేదనిపించింది.
నటీనటులు…
వరుస పరాజయాల్లో ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ ఈ సారి ఓ కొత్త తరహా పాత్రను ఎంచుకున్నాడు. నేటి యూత్‌ ను ప్రతిబింభించే చేసే క్యారెక్టర్‌లో బాగానే నటించాడు. మెచ్యుర్డ్‌ పర్ఫామెన్స్‌తో విజయ్‌ కృష్ణ పాత్రలో జీవించాడు. హీరోయిన్‌గా కల్యాణీ ప్రియదర్శన్‌ పరవాలేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె డబ్బింగ్ కాస్త ఇబ్బందిగా అనిపించినా.. తరువాత ఓకె అనిపించేలా ఉంది. మరో హీరోయిన్‌గా నటించిన నివేదా పేతురాజ్‌కు పెద్దగా నటన చూపించే చాన్స్ దక్కలేదు. కార్పోరేట్ ఉమెన్‌గా నివేదా లుక్‌ ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, సునీల్‌, వెన్నెల కిశోర్‌ తమ పరిధి మేరకు చేశారు.
సాంకేతికవర్గం…
ఇటీవల వరుసగా ఫెయిల్ అవుతున్న సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ కూడా ఈ సినిమాతో పరవాలేదనిపించాడు. రెండు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఫ్రెష్ గా ఉంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ బోర్‌ కొట్టిస్తాయి. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి
– రాజేష్