తెలివితక్కువ సినిమా ‘ఇంటిలిజెంట్‌’ చిత్ర సమీక్ష

                                              సినీవినోదం రేటింగ్ : 2/5

సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై వినాయక్ దర్శకత్వం లో సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు

ఓ సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత నంద‌కిషోర్ (నాజ‌ర్‌) అనాథ‌ల‌కు, పేద‌వాళ్ల‌కు స‌హాయ‌ప‌డుతుంటాడు. త‌న కంపెనీలో ప‌నిచేసే ఉద్యోగుల‌ను కూడా చ‌క్క‌గా చూసుకుంటూ ఉంటాడు. నంద‌కిషోర్ స‌హాయంతో చ‌దువుకుని… ఆయన కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు తేజ (సాయిధ‌ర‌మ్ తేజ్‌). త‌న స్నేహితులు (రాహుల్ రామ‌కృష్ణ‌, స‌ప్త‌గిరి, న‌ల్ల‌వేణు)ల‌తో క‌లిసి సరదాగా గడిపే తేజు జీవితంలోకి ఓ అమ్మాయి (లావ‌ణ్య త్రిపాఠి) ఎంట‌ర్ అవుతుంది. ముందు తేజ అంటే ఇష్ట‌ప‌డ‌క‌పోయినా… అమ్మాయిలంటే అత‌నికున్న గౌర‌వాన్ని చూసి అత‌న్ని ఇష్ట‌ప‌డుతుంది. అదే స‌మ‌యంలో నంద‌కిషోర్ త‌న కంపెనీ ఉద్యోగుల‌కు చేస్తున్న బెనిఫిట్స్ చూసి.. నంద‌కిషోర్‌ను దెబ్బ కొట్టి.. కంపెనీని సొంతం చేసుకోవాల‌నుకుంటారు కొందరు . అందులో భాగంగా మాఫియా డాన్ విక్కీ భాయ్‌(రాహుల్ దేవ్‌), అత‌ని త‌మ్ముడు (దేవ్ గిల్‌)ల స‌హాయం తీసుకుంటారు. విక్కీ అండ్ గ్యాంగ్ నంద‌కిషోర్‌ను బెదిరించినా లొంగ‌డు. ఢిల్లీకి వెళ్లి సెంట్ర‌ల్ మినిష్ట‌ర్‌ను క‌ల‌వాల‌నుకుంటాడు. అయితే అనుకోకుండా త‌న కంపెనీని విక్కీకి రాసిచ్చేసి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు నంద‌కిషోర్‌. అదే స‌మ‌యంలో తేజ‌పై ఎటాక్ కూడా జ‌రు గుతుంది. అస‌లు నంద కిషోర్ ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు? అస‌లు అది ఆత్మ‌హ‌త్యా? హ‌త్యా? చివ‌ర‌కు త‌న‌కు అండ‌గా నిల‌బ‌డ్డ నంద‌కిషోర్ ఫ్యామిలీ కోసం తేజ ఏం చేసాడు? అనే విష‌యాలు సినిమా చూసి తెలుసుకోవాలి …..
ఈ సినిమా కథ చాలా పాతది. ఆకుల శివ అందించిన కథలో పస లేదు. కథ పాతదే అయినా ఆకట్టుకునే కథనం, సన్నివేశాలు ఉంటే ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేసే ఆస్కారం ఉంటుంది. కానీ ఇందులో అలాంటివేమీ లేవు. కథనం మొత్తం నిరుత్సాహంగానే నడిచింది. దర్శకుడు వినాయక్ పనితనం ఈ సినిమాలో అస్సలు కనబడలేదు. ఆయన కెరీర్లో వచ్చిన అత్యంత బలహీనమైన చిత్రమేదంటే ఈ ‘ఇంటిలిజెంట్’ అనిపిస్తుంది. అలాగే వరుస ఫ్లాపుల్లో వున్న సాయిధరమ్‌ తేజ్‌ చేసిన మరో ఫ్లాపు ఈ చిత్రం . ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సాదా సీదా హీరో, ఒక్కసారిగా డాన్ గా మారిపోవడం, అతనికి భయపడి పెద్ద పెద్ద విలన్స్ హీరో కాళ్ళ మీద పడ్డం వంటి సన్నివేశాలను జీర్ణించుకోవడం ప్రేక్షకులకు కష్టమే.కథలో గుర్తుంచుకోదగిన, ఆసక్తికరమైన మలుపు ఒక్కటి కూడ లేదు. సినిమా మొత్తం చప్పగానే నడిచింది. ఎప్పడు బయటికెళ్లిపోదామా అనిపించింది .

సాయిధ‌ర‌మ్ తేజ్ తన పాత్రను బాగా చేసేందుకు కృషి చేసాడు . డాన్సులు, యాక్ష‌న్ పార్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. అయితే అతని నటనలో మరింత పరిణితి అవసరం. ఇక హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి పాత్ర‌కు ప్రాముఖ్య‌త లేదు. గ్లామ‌ర్ కోసం లావ‌ణ్య‌ను తీసుకున్నార‌నిపిస్తుంది . ఆమె పాట‌ల‌కే ప‌రిమిత‌మైంది. ఇక సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టించిన నాజ‌ర్ త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. ఇక మెయిన్ విల‌న్స్‌గా రాహుల్ దేవ్‌, దేవ్ గిల్‌, వినీత్‌కుమార్‌లు, గుణ చేసారు. కాశీ విశ్వ‌నాథ్‌, షాయాజీ షిండే త‌దితరులు పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలివేష‌న్‌.. హీరో, అత‌ని స్నేహితులు, పోసాని కృష్ణ‌ముర‌ళి మ‌ధ్య వ‌చ్చే కామెడీ ట్రాక్‌… జ‌య‌ప్రకాష్, తేజు, స‌ప్త‌గిరి, విద్యుల్లేఖా రామ‌న్‌, ఫిష్ వెంక‌ట్‌, పోసాని మ‌ధ్య వ‌చ్చే ఎంట‌ర్‌టైనింగ్ ట్రాక్ రొటీన్ కామెడీతో ఉంది . బ్ర‌హ్మానందం హాస్యసన్నివేశాలు , థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ, కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్ కామెడీ ట్రాక్‌తో నవ్వించే ప్ర‌య‌త్నం చేసినా వ‌ర్క‌వుట్ కాలేదు.

ఆకుల శివ డైలాగులు పాత ధోరణిలోనే ఉన్నాయి. ఇక త‌మ‌న్ పాటలు వినసొంపుగా లేవు. సినిమాలో అసందర్భంగా వచ్చే పాటలు ఇబ్బందిపెడతాయి. సక్సెస్ కి కలిసి వస్తుందని చిరంజీవి మంచి పాటను రీమిక్స్‌ చేసారు. విషయం వున్న సినిమాలో చిరంజీవి రీమిక్స్‌ ఆకర్షణ అవుతుంది కానీ, ఇందులో వేస్టయిపోయింది. నేప‌థ్య సంగీతం ప‌రవాలేదు. విశ్వేశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. ప్రతి సీన్ ఎంతో అందంగా ,రిచ్‌గా ఉంది. గౌతంరాజు ఎడిటింగ్‌ కూడా బాగా ఉంది –ధరణి