అది చదువుకునే రోజుల నుండే అలవాటైంది!

“జీవితంలో అనుకున్నది జరగకపోతేనో, చేసిన పనికి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడో నిరాశకు గురవడం సహజం .అయితే వాటిని తాను వేరే కోణంలో చూస్తానని చెప్పింది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  సాయిపల్లవి. ఏదైనా జరగాలని రాసి పెట్టి ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరంది. అందుకే అలాంటి సమస్యలు ఎదురైతే.. అందులోంచి కొత్త విషయాలను నేర్చుకోవాలని ..అంతేగానీ, ‘ఆశించింది జరగలేదే’ అని నిరుత్సాహపడకూడదని అంది. ‘ఏం జరిగినా మన మంచికే’ అని భావించడం తనకు చదువుకునే రోజుల నుంచే అలవాటైందని చెప్పింది. ఆ అలవాటు ఇప్పుడు ఈ రంగంలో హెల్ప్‌ అవుతోందని చెప్పింది. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే మనం పాఠం నేర్చుకోవడానికే అది జరిగిందని భావిస్తానని అంది.
 
ఎలాంటి కసరత్తులు ఉండవు!
‘ఫిదా’ తో ఆకట్టుకున్న సాయి పల్లవి.. తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ లో నటిస్తోంది.. నాగచైతన్య హీరోగా ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌, వీడియోకు విశేష స్పందన లభించింది.
సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘‘హీరోతో కెమిస్ట్రీ విషయంలో ఎలాంటి కసరత్తులు ఉండవు. పాత్రను, కథను అర్థం చేసుకుంటే సగం పని అయిపోయినట్టే. కథకు, పాత్రకు సంబంధం లేని పాత్రలు చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సినిమాలకు నో చెప్పా’’ అని అన్నారు.
 
ఆ జాబితాలో సాయి పల్లవికి చోటు
తాజాగా సాయి పల్లవికి అరుదైన ఘనత దక్కింది. ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్‌ తాజాగా `ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30` జాబితాను విడుదల చేసింది. 30 సంవత్సరాలలోపు తమ తమ రంగాల్లో విజయాలను సాధించిన 30 వ్యక్తుల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో 27 సంవత్సరాల సాయి పల్లవి చోటు దక్కించుకుంది. దీంతో సాయిపల్లవి అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
 
తన అద్భుత నటనతో, డ్యాన్స్‌తో  ప్రేక్షకులను ఆకట్టుకుంది తమిళ భామ సాయి పల్లవి. గ్లామరస్ పాత్రలకు దూరంగా.. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ.. ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం పల్లవి తెలుగులో మంచి అవకాశాలతో దూసుకు పోతోంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న`విరాటపర్వం’ చిత్రంలో ఈమె హీరోయిన్‌గా నటిస్తుంది.