వాటిని వాడితే అందం మెరుగవుతుందా ?

“అలంకరణ సాధనాల ప్రకటనల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నటించన”ని చెప్పింది సాయిపల్లవి. మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో నటిగా ప్రవేశించిన సాయిపల్లవి… ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లోకి వచ్చింది. ముఖ్యంగా టాలీవుడ్‌లో విజయాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక కోలీవుడ్‌లోనూ ‘దయా’, ‘మారి–2’ చిత్రాల్లో నటించినా … తెలుగులో మాదిరి ఇక్కడ మార్కెట్‌ను పొందలేదు. అందుకు కారణం ఆ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. అయితే ‘మారి–2’ చిత్రంలో ధనుష్‌తో డాన్స్‌ చేసిన ‘రౌడీ బేబీ’ పాట సూపర్‌ పాపులారిటీ పొందింది. అలా సాయిపల్లవి తన స్థానాన్ని పెంచుకుందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం సూర్యతో రొమాన్స్‌ చేసిన ‘ఎన్‌జీ’కే చిత్రం కోసం మాత్రం చాలా ఆసక్తిగా చూస్తోంది.
 
ఎందుకంటే ఆ చిత్రం మినహా సాయిపల్లవికి ఇక్కడ మరో అవకాశం లేదు. ‘ఎన్‌జీకే’ చిత్రం వచ్చే నెల 31వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా నటి సాయిపల్లవి … సినిమాల్లోనే నటిస్తారా.. వాణిజ్య ప్రకటనల్లో నటించరా? అన్న ప్రశ్నకు… వాణిజ్య ప్రకటనలంటే అందాలకు మెరుగులు దిద్దే అలంకరణ సాధనాల ప్రకటనల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నటించనని చెప్పింది. అయినా అలంకరణ సామగ్రిని వాడితే అందం మెరుగవుతుందని తాను భావించనని అంది. మేకప్‌ వేసుకుంటే వేరేవారిలా కనిపిస్తున్నట్లు తనకు కావలసిన వారు చెప్పడంతో తాను మేకప్‌ లేకండానే నటిస్తున్నానని చెప్పింది. దర్శకులు అలానే కోరుకుంటున్నారని సాయిపల్లవి పేర్కొంది.
 
భారీ ఆఫర్‌ని తిరస్కరించింది !
సాయిపల్లవి.. తాజాగా తనకు దక్కిన 2 కోట్ల ఆఫర్‌ని తిరస్కరించిందట. ఎలాంటి మేకప్‌లకు ప్రాధాన్యం ఇవ్వకుండా నాచురల్‌గా కనిపిస్తూనే సహజ నటన కనబర్చడమనేది ఆమెకే సొంతం. కాగా పలువురు సెలబ్రిటీలు.. సినిమాలు చేస్తూనే పలు ప్రకటనల ద్వారా భారీ మొత్తం సొమ్ము చేసుకుంటున్న ఈ రోజుల్లో తాను మాత్రం ఎలాంటి ప్రకటనల్లో నటించనని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న ఈమె అన్నంత పని చేసింది.
తాజాగా ఆమెకు ఓ ప్రముఖ ఉత్పత్తుల సంస్థ వారు తమ పేస్ క్రీమ్ ప్రకటనలో నటిస్తే 2 కోట్లు ఇస్తామని భారీ ఆఫర్ చేశారట. కానీ అందుకు ఆమె తిరస్కరించడమే గాక ఎలాంటి మేకప్ లేకుండా సినిమాల్లో నటిస్తున్న తాను మీ ఉత్పత్తులను ఎలా ప్రమోట్ చేస్తానని ప్రశ్నించిందట. ‘పోనీ మేకప్ లేకుండానే మా ప్రకటనలో కనిపించండి’ అని సదరు సంస్థ సూచించినప్పటికీ ‘నో’ అని చెప్పేసిందట సాయి పల్లవి.