సారా సినీ రంగ ప్రవేశంపై విభేదాలు లేవు

సైఫ్‌-అమృతాసింగ్‌ కూతురు సారా త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, సారా బాలీవుడ్‌ ఎంట్రీపై తండ్రి సైఫ్‌ ఆందోళన చెందుతున్నాడని, తల్లి అమృతాసింగ్‌ సారా సినిమాల్లోకి రావాలని కోరుకుంటుండగా.. ఇందుకు సైఫ్‌ నిరాకరించారని, దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలను ఖండిస్తూ సైఫ్‌ తాజాగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు….

తనకు, అమృతాసింగ్‌ మధ్య గొడవ జరిగిందంటూ వచ్చిన కథనాలు బూటకమని ఆయన తెలిపారు. సారా అలీఖాన్‌ సినీ రంగ ప్రవేశంపై తాను, తన మాజీ భార్య అమృతాసింగ్‌ ఒకే అభిప్రాయంతో ఉన్నామని, ఈ విషయంలో తమ మధ్య ఎలాంటి విభేదాలకు తావు లేదని బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ స్పష్టం చేశారు.
‘సారా సినీ ప్రవేశంపై నేను, అమృత ఒకే అభిప్రాయంతో ఉన్నాం. ఈ విషయంలో మేం ఎలాంటి వాదనా జరుపలేదు. నటించాలన్న సారా అభిమతానికి నేను పూర్తి మద్దతు ఇచ్చాను. ఆమెతో సవివరంగా చర్చించాను. ఓ తండ్రిగా ఆతృతతో, మిశ్రమ భావోద్వేగంతో ఆమె సినీ రంగ ప్రవేశం గురించి ఎదురుచూస్తున్నాను’ అని సైఫ్‌ పేర్కొన్నారు.
సైఫ్‌, అమృతాసింగ్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు సరా, ఇబ్రహీం ఉన్నారు. వీరు 2004లో వేరయ్యారు. ప్రస్తుతం కరీనా కపూర్‌ను పెళ్లాడిన సైఫ్‌కు తైమూర్‌ అలీఖాన్‌ అనే కుమారుడు ఉన్నాడు.