మొహమాటానికి చేస్తే ప్రేక్షకులు నా మొహాన్నే మర్చిపోతారు !

నాకు నచ్చిన సినిమాలే చేస్తాను. నచ్చకపోతే ఎవరు బలవంతం చేసినా చేయను. దిల్‌రాజుగారి సినిమా కథ నన్ను ఇంప్రెస్‌ చేయలేదు. అందుకే చేయనని చెప్పాను. ఈ సినిమాకి నాకు తక్కువ మొత్తం ఇస్తాన్నారని కొందరు, లేదు లేదు చాలా ఎక్కువ ఆఫర్‌ చేసినా చేయనన్నానని కొందరు ఇలా ఎవరికి నచ్చింది వారు అనుకున్నారు. ఎవరేమనుకున్నా నా దారి నాదే! కథ నచ్చితేనే సినిమా. లేకపోతే లేదు….అని అంటోంది ఇటీవల తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన సాయి పల్లవి.

మణిరత్నం సార్‌ మంచి దర్శకులు.అయితే కథ నచ్చలేదు. నాలాంటి వారికి ఆయన దర్శకత్వంలో నటించాలని ఎందుకు ఉండదు? దర్శకులు గొప్ప వ్యక్తే కావచ్చు….కథ నచ్చకపోతే ఎలా చేస్తాను? అలా చేస్తే పాత్రకి తగిన న్యాయం చేయలేను. ఇవన్నీ ఆలోచించే మణిసార్‌కి నో చెప్పాను. ఈ సారి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. అలాగే విక్రమ్‌గారి సరసన చేసే అవకాశం వచ్చింది. కానీ కథ నచ్చలేదు. ఆయన పక్కన నటించాలంటే మంచి పవర్‌ఫుల్‌ పాత్ర ఉండాలి. లేకపోతే ఆయన పక్కన కనిపించం. ఆయన పక్కన నా పాత్ర తేలిపోతుంది అనిపించింది. అందుకే చేయనని చెప్పాను. ఈ రెండు విషయాల్లోనూ కోలీవుడ్‌లో చాలా మంది నన్ను తప్పు పట్టారు. ఒకటి రెండు సక్సెస్లకే  సాయిపల్లవికి పొగరెక్కిందనీ, ఎవరి మాటా వినదని అన్నారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా పట్టించుకోను. నా పంథాలో నేను వెళ్ళిపోతాను అంతే!

ఎక్కువ ఇస్తాం. గ్లామర్‌గా కనిపించమంటున్నారు. నా ముఖం మీద మొటిమలు ఉన్నా తెర మీద అందంగానే కనిపిస్తున్నాను కదా! గ్లామర్‌ అంటే అందంగా కనిపించడమే అంటారు. అలా అయితే నేను అందగత్తెనే! కొందరి దృష్టిలో అందాల ఆరబోతనే గ్లామర్‌ అనుకుంటారు. అలా అనుకుని నా దగ్గరకు కొందరు వచ్చారు కూడా! వారి ఉద్దేశం అర్థమయ్యే వారి సినిమాలు చేయను. గ్లామర్‌ పేరుతో అందాల ఆరబోత నాకు ఇష్టం ఉండదు. అవే కండిషన్లు అనుకుంటే నేను చెప్పగలిగేది ఏమీ లేదు. మరి కొందరు వస్తారు. కథ చెప్పరు. హీరో ఫలానా వ్యక్తి నటిస్తారా? అంటూ నేరుగా అడుగుతారు. నా దృష్టిలో కథనే హీరో. మిగతా వారంతా నటులే! ఆ కథ తెలుసుకోకుండా ఎలా ఓకే చెబుతాను. నా పక్కన ఎవరు చేస్తున్నారు? అన్నది పట్టించుకోను. ఇవన్నీ చెబితే కండిషన్లంటారు! ఇక లిప్‌లాక్‌లు లాంటివి నా వల్ల కాదు. నేను మధ్య తరగతి అమ్మాయిని. అలాంటి వాటికి మా పేరెంట్స్‌ అస్సలు ఒప్పుకోరు. నేను సినిమాలు చేస్తానంటే వాళ్ళు కొన్ని కండిషన్లు పెట్టారు. అందులో లిప్‌లాక్‌లు ఒకటి.

కెరీర్‌ కోసం మనసు చంపుకోలేను. ఇది మొదటి కారణం. ఏదో మొహమాటానికి పోయి సినిమాలు చేస్తే ప్రేక్షకులు నా మొహాన్నే మరిచిపోతారు. ఇంకో విషయం….సినిమాలే నా కెరీర్ కాదు. డాక్టరుగా స్థిరపడాలన్నదే నా కోరిక. వీలున్నంత వరకూ సినిమాలు చేసి ఆ తరువాత డాక్టర్‌గా స్థిరపడతాను. కార్డియాలజిస్ట్‌గా స్థిరపడాలన్నది నా కోరిక.